సర్వమతాల కోసం ఓపెన్ మసీద్

Tue,June 19, 2018 01:01 AM

మెహిదీపట్నం: పవిత్ర ఉపవాస దీక్షల మాసమైన రంజాన్ ముగిసిన అనంతరం నగరానికి చెందిన మసీద్ ఏ కుబాలో ముస్లిమేతరుల కోసం ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శాంతి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మసీదులో దేశంలోనే మొట్టమొదటి సారి మసీదు ఓపెన్ ఫర్ ఆల్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈద్‌మిలాప్‌లో భాగంగా ఇతర మతస్తుల కోసం ఈ మసీదు ద్వారాలను రోజంతా తెరిచి ఉంచారు. ఈ సందర్భంగా ఇస్లాం మత బోధనలను వివరించడంతో పాటు మతసామరస్యం, శాంతి సందేశాలను వివరించడం అందరిని ఆకట్టుకుంది. సర్వమతాల వారు సంభాషణలు చేసుకోవడంతో పాటు ముస్లింలు నమాజ్, అజాన్, వజూ(నమాజ్‌కు ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం) గురించి వివరించారు. సామూహిక ఈద్ మిలాప్‌లో భాగంగా పాల్గొన్న క్రైస్తవులు, సిక్కులు, హిందువులకు ముస్లింల నిత్యకృత్యాల భావాలను ప్రదర్శనల ద్వారా నిర్వాహకులు వివరించారు.

మెహిదీపట్నం నానల్‌నగర్‌లో నిర్మించిన మసీద్-ఏ-కుబా నిర్మాణ విశిష్టతను మసీదు ప్రముఖులు సయ్యద్ అక్తర్ వివరించారు. ఈజిప్షియన్, అరేబియన్ శైలిలో సుమారు 850 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మసీదుకు నసీర్, అజీజ్, జహీర్ అహ్మద్‌లు రూపకల్పన చేశారని ఆయన పేర్కొన్నారు. ఒకే సారి 1200 మందికి ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఉన్న ఈ మసీదులో మూడు అంతస్తులు కలిగి ఉండటంతో పాటు పైన గోపురం, మినార్లు ఉన్నాయి. ఈద్‌మిలాప్‌లో భాగంగా ఇస్లాంకు సంబంధించిన అంశాలతో రూపొందించిన ప్రదర్శనలు ఈ సందర్భంగా ఆకట్టుకున్నాయి. మహా ప్రవక్త కాలంలో మసీదులలో ప్రార్థనలతో పాటు వివాహాలు, సమావేశాలు జరిగాయని, పలు చోట్ల విద్యాకేంద్రాలుగా కూడా ఉండేవని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఫిలాంత్రోపిస్ట్ సయ్యద్ అనీసుద్దీన్, ఇన్టాక్ ఎన్జీవో డైరెక్టర్ అనురాధ ముస్లిం మతాధికారులు, ఇస్లామిక్ పండితులు, తదితరులు పాల్గొన్నారు.

316

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles