ఔటర్‌పై పెరిగిన రద్దీ

Wed,June 13, 2018 03:32 AM

-గతంలో కంటే పోటెత్తుతున్న వాహనాలు
-రోజుకు లక్షా 8వేల వాహనాలు, రూ.86లక్షల ఆదాయం
-ఏడాదికి రూ. 9 కోట్ల నుంచి 312కోట్లకు టోల్ వసూలు
- మౌలిక వసతులు సమకూర్చుతున్న ప్రభుత్వం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన ఔటర్‌కు ప్రస్తుతం ప్రయాణికులు ఫిదా అవుతున్నారు.తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా ఔటర్ మార్గాన్ని ఎంచుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతర్జాతీయ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిర్ణీత సమయంలోపు చేరుకునే వీలు ఉండటంతో పాటు జాతీయ రహదారుల అనుసంధానం, ఔటర్ నుంచి నగరం నలుమూలలకు సులువుగా చేరుకునే అవకాశం ఉండటంతో ఔటర్‌కు వాహనాలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో కంటే వాహనాల రద్దీ పెరిగింది. సాధారణంగా అన్నీ వాహనాలు కలిపి రోజూ 40వేలకు మించని పరిస్థితి నుంచి ఇప్పుడు రోజూకు సరాసరి లక్షా 8వేల వాహనాలు ఔటర్‌లో తిరుగుతున్నాయని హెచ్‌ఎండీఏ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే టోల్ వసూలు రూపంలో రోజు రూ. 86 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో టోల్ రాబడి రూ. 9కోట్లు ఉంటే 2017-18 సంవత్సరంలో రూ. 191కోట్లను రాబట్టుకున్నది. ఈ 2018-19 ఆర్థిక సంవత్సరంలో టోల్ వ్యవస్థను మరింత బలోపేతం టెండర్లను ఆహ్వానించగా ఏడాదికి రూ.312కోట్లు (ప్రతి నెల రూ.26కోట్లు) చెల్లించే సంస్థకు బాధ్యతలు అప్పగించడం పై వాహనాల రద్దీ ఏ విధంగా ఉన్నదో స్పష్టమవుతున్నది.

ఔటర్‌తో పెరిగిన డిమాండ్
158 కిలోమీటర్ల ఔటర్ రహదారిలో భాగంగా తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారించి ఔటర్‌ను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకురావడంలో తనదైన ముద్రను స్వంతం చేసుకున్నది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన అసంపూర్తి పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘట్‌కేసర్-శామీర్‌పేట 22 కిలోమీటర్ల మేర మార్గాన్ని అనతికాలంలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే న్యాయ వివాదంలో చిక్కుకున్న కండ్లకోయ జంక్షన్‌పై సుప్రీంలో విజయం సాధించి 1.1 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేసి ఇటీవల ఆ మార్గాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించి 158 కిలోమీటర్ల ఔటర్ రహదారిని పరిపూర్ణం చేశారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలు నేరుగా నగరంలోకి ప్రవేశించకుండా ఔటర్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరే వీలును కల్పించారు.

ఈ నేపథ్యంలోనే ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం 15 టోల్ ఫ్లాజాల వద్ద దారి సుంకం వసూలును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. కారు/జీపు/ఎల్‌ఎంవీ, లైట్ కమర్షియల్ వెహికల్/మినీ బస్సు , ట్రక్/ బస్సు, మల్టీ యాక్సెల్ వెహికల్ 3-యాక్సెల్ , హెవీ వెహికల్/4,5,6 యాక్సెల్ ట్రక్, ఓవర్‌సైజ్డ్ వెహికల్ క్యాటగిరిగా విభజించి వాహనాలకు ఆయా రేట్లను ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజు దాదాపు లక్షా 8వేల వాహనాల ద్వారా రూ. 86 లక్షల మేర ఆదాయాన్ని సంస్థ సమకూర్చుకుంటున్నది. ఒకవైపు హరితహారంలో భాగంగా ఔటర్ మొత్తంలో మొక్కలు నాటి హరిత వలయం చేసి ప్రయాణికులకు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించడం, పెరుగుతున్న వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా ఎల్‌ఈడీ వెలుగులు, ఆర్‌ఎఫ్‌ఐడీ విధానంతో నాన్‌స్టాఫ్ ప్రయాణం, సురక్షిత ప్రయాణానికి హెచ్‌టీఎంఎస్, ఐటీఎస్‌లు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ప్రయాణికుల మన్ననలు పొందుతున్నది.

1213

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles