రూ.32లక్షల ఆశ చూపి రూ.9.15లక్షలు కాజేశారు

Wed,June 13, 2018 03:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గడువు తీరిన ఇన్సూరెన్స్ పాలసీతో పాటు దాని బోనస్‌గా రూ. 32 లక్షల వరకు ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి ఓ వృద్ధురాలికి సైబర్ చీటర్లు రూ. 9.15 లక్షలు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం...
బేగంపేట్‌కు చెందిన ఇందుబహల్ అనే వృద్ధురాలికి గత ఏడాది డిసెంబర్‌లో లక్ష్మి త్రిపాఠి పేరుతో ఓ గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసింది. తాము ఐజీఎంఎస్(ఇంటరాగేటివ్ గ్రేవియన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) న్యూ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుంది. మీరు ఎల్‌ఐసీలో ఇన్సూరెన్స్ పాలసీకి డబ్బులు చెల్లించారని, ఆ డబ్బులు మీకు వెనక్కి ఇప్పిస్తామంటూ నమ్మించారు. అందుకు రూ. 3200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందంటూ సూచించారు. ఆమె చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన ఇందుబహల్ డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంది. కొన్ని రోజుల తరువాత ఐజీఎంఎస్ సంస్థలో డిపార్టుమెంట్ హెడ్ భాటియా అంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు.

మీకు ఇన్సూరెన్స్ డబ్బులే కా దు.. బోనస్‌గా రూ.32 లక్షల వరకు ఇప్పిస్తామంటూ ఆమెను బుట్టలో పడేశారు. లక్ష్మి త్రిపాఠి, సంజయ్ భాటియాలు ఇద్దరు ఆమెతో మాట్లాడుతూ మీకు బోనస్ డబ్బులు రావాలంటే మరొకసారి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని, ఆ తరువాత ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాలని, జీఎస్టీ ఇలా డబ్బులు చెల్లించాలంటూ సూచించడంతో ఆమె వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెను మరింతగా నమ్మించేందుకు ఐజీఎంఎస్ నుంచి బోనస్ చెక్కు విడుదలయ్యిందని, మరికొన్ని క్లియరెన్స్‌లు చేసుకుంటే మీ ఖాతాలోకి డబ్బు వచ్చేస్తుందని, అప్పటి వరకు వివిధ ఫీజుల కింద చెల్లించిన డబ్బు కూడా వస్తుందంటూ నమ్మిస్తూ వచ్చారు. ఆమెకు నమ్మకం కల్గేందుకు ఒక చెక్కుపై ఆమె పేరు రాసి దానిని స్కాన్ చేసి ఎన్‌పీసీఐ.జీవోవి.1<\@>జీమెయిల్.కామ్ నుంచి ఆమె ఈమెయిల్ ఐడీకి పంపించారు. ఇలా ఆమె వద్ద నుంచి దఫ దఫాలుగా రూ. 9.14 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించారు. డబ్బుల కోసం సైబర్‌చీటర్లు నాటకం ఆడుతున్నారని గ్రహించిన ఆమె ఎట్టకేలకు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.

539

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles