కేసీఆర్ దేవుడిలా ఆదుకున్నారు

Wed,June 13, 2018 03:24 AM

కేపీహెచ్‌బీ కాలనీ : ఉద్యమంలో పెద్ద దిక్కును కోల్పోయిన తమను సీఎం కేసీఆర్ దేవుడిలా ఆదుకున్నాడని మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన రాజారెడ్డి భార్య సరస్వతి పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని నగరానికి కుటుంబ సమేతంగా వచ్చామని ఉద్యమ పోరాటంలో కుటుంబ అవసరాలను తీర్చే పెద్దదిక్కును కోల్పోవడంతో రోడ్డున పడ్డామని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవడంతో ఇప్పుడిప్పుడే బాధల నుంచి ఉపశమనం పొందుతున్నామని సరస్వతి పేర్కొన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌కు చెందిన గుడి రాజారెడ్డి(45) మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2012 సెప్టెంబర్ 30న నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన తెలంగాణ మార్చ్‌లో కేపీహెచ్‌బీ కాలనీలోని ఉద్యమకారులతో కలిసి గుడి రాజారెడ్డి పాల్గొన్నారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న ఉద్యమకారులపై పోలీసులు ప్రయోగించిన భాష్పవాయు గోళాల ధాటికి రాజారెడ్డి తీవ్ర అస్వస్తతతకు గురై అక్కడే పడిపోయాడు. తోటి ఉద్యమకారులు ఇంటికి తీసుకొచ్చి ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు.

చికిత్స చేయించినప్పటికీ 25రోజులు మృత్యువుతో పోరాడిన రాజారెడ్డి 25 అక్టోబర్ 2012న కన్నుమూశాడు. ఉద్యమంలో అమరుడైన రాజారెడ్డి భార్య సరస్వతి గృహిణి కాగా ఇద్దురు పిల్లలు వంశీకృష్ణారెడ్డి, సాయికృష్ణారెడ్డి పాఠశాలలో చదువుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం మండలం, పెద్దంపేట గ్రామానికి చెందిన రాజారెడ్డి కుటుంబంతో బతుకుదెరువు కోసం నగరానికొచ్చి కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తున్నారు. రాజారెడ్డి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తుండేవాడు. వచ్చే సంపాదనతో కుటుంబ సభ్యులను పోషిస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. రాజారెడ్డి మరణంతో ఆ కుటుంబం రోడ్డునపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో రాజారెడ్డి కలలుకన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజారెడ్డి కుటుంబానికి ఆసరా లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న తండ్రిలా, దేవుడిలా ఆలోచించి అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించారు. రాష్ట్ర పోరాట ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు మొదటగా ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తదానంతరం 2016 సంవత్సరంలో అరమవీరుల కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం జరిగింది. ఈ క్రమంలో అమరుడైన గడి రాజారెడ్డి కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయంతో పాటు భార్య సరస్వతికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందింది.

దీంతో సరస్వతి కుటుంబ భారాన్ని మోస్తూ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ జీవితాన్ని గడుపుతున్నది. ఇటీవలే సరస్వతి కుటుంబానికి అండగా నిలిచిన కన్న తండ్రి కూడా మరణించడంతో ఏ ఆధారం లేని కుటుంబానికి అన్నగా, కన్న తండ్రిగా, దేవుడిలా ముఖ్యమంత్రి కేసీఆర్ దారి చూపి ఆదుకుంటున్నారని సరస్వతి తెలిపారు. ఇలాంటి ప్రజల దేవుడు కేసీఆర్‌కు నాలాంటి కుటుంబాలన్నీ జీవితాంతం రుణపడి ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

614

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles