మండే పదార్థాల గోదాములపై కొరడా


Wed,June 13, 2018 03:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాణిగంజ్‌లోని రంగుల (పెయింట్) గోదాములో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మండే గుణమున్న పదార్థాల గోదాములను జనావాసాలు, రద్దీ మార్కెట్ ప్రాంతా ల్లో లేకుండా బయటకు తరలించాలని నిశ్చయించింది. దీనికోసం త్వరలో సర్వే నిర్వహించి ఆ తరహా గోదాముల ట్రేడ్ లైసెన్సులు రద్దుచేయాలని నిర్ణయించారు.
రాణిగంజ్‌లో ఇటీవల రంగు డబ్బాల గోదాములో అగ్ని ప్రమాదం జరిగి మంటలధాటికి ఏకంగా భవనమే కుప్పకూలిన విషయం తెలిసిందే. పురాతన భవనం కావడంతో నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు లేకపోగా, అనుమతులు, ట్రేడ్ లైసెన్సు కూడా లేనట్లు విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం ఉపయోగం ఆధారంగా నిర్ణీత సెట్‌బ్యాక్‌లు ఉన్న భవనాలకు మాత్రమే ట్రేడ్ లైసెన్సులు జారీచేస్తారు. కాగా, సికింద్రాబాద్, చార్మినార్, గోషామహెల్ తదితర పాత నగరంలో పురాతన భవనాలను చాలావరకు గోదాములు, దుకాణాలకు వినియోగిస్తున్నారు. చిన్నచిన్న గల్లీలో ఉండే ఈ గోదాముల్లో భారీగా మండే గుణమున్న పదార్థాలను నిల్వ ఉంచడంతో ప్రమాదాలు జరిగినప్పుడు విపత్తుల నిర్వహణ అత్యంత క్లిష్టంగా మారుతోంది. రాణిగంజ్‌లో జరిగిన ఘటన మరోసారి అధికారులకు గుణపాఠం నేర్పినట్లు చెప్పవచ్చు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకున్నా మంటలను అదుపులోకి తెచ్చేందుకు చాలా సమయం పట్టింది. పెయింట్ డబ్బాలు కావడంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఇటీవల అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అధికారులు ప్రమాదకర వస్తువుల గోదాములను నగరంలో లేకుండా చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే గోదాములను అతి ప్రమాదకరం, తక్కువ ప్రమాదకరం, అసలు ప్రమాదానికి అవకాశం లేకపోవడం అనే మూడు శ్రేణులుగా విభజించేందుకు త్వరలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. పేలుడు పదార్థాలు, రసాయనాలు, రంగులు తదితర పేలుడుకు, మంటలు వ్యాపించేందుకు వీలున్న పదార్థాల గోదాములను అతి ప్రమాదకర శ్రేణిలో ఉంచి వాటి ట్రేడ్ లైసెన్సులను రద్దుచేయడంతోపాటు వాటిని నగరం వెలుపలికి తరలించాలని నిర్ణయించారు. అలాగే, ఎలక్ట్రానిక్స్ వస్తువులు తదితరవాటిని రెండవ శ్రేణిలో, ప్రమాదానికి పెద్దగా ఆస్కారంలేని కిరా ణా, ఫ్యాన్సీ, స్టేషనరీ తదితర గోదాములను మూడో శ్రేణి లో చేర్చాలని నిశ్చయించారు. రెండో శ్రేణివాటిపై కొన్ని ఆంక్షలు విధించి, మూడో శ్రేణిని యథావిథిగా కొనసాగించాలని నిశ్చయించారు. పేలుడు, మంటలు వ్యాపించేందుకు ఆస్కారమున్న గోదాములను నగరం వెలుపలికి తరలించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం త్వరలోనే సర్వే చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.

320
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...