విద్యాసంస్థల బస్సుల నిర్వాహకులు


Wed,May 16, 2018 12:32 AM

- నిబంధనలు పాటించకుంటే జైలుకే
పేట్‌బషీరాబాద్, మే 15 : విద్యాసంస్థల నిర్వాహకులు బస్సుల విషయంలో నిబంధనలు పాటించకుంటే జైలుకెళ్లడం ఖాయమని మేడ్చల్ జిల్లా రవాణ శాఖాధికారి డా.శ్రీనివాస్ పుప్పాల హెచ్చరించారు. మంగళవారం పేట్‌బషీరాబాద్‌లోని డీటీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి జూన్ 2 వరకు ప్రతి బస్సుకు ఫిట్‌నెస్ చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యాలయానికి వచ్చే ముందు దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు చేయించుకుని రావాలన్నారు. అదే విధంగా డ్రైవర్, అటెండర్‌కు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే స్లాట్ బుక్ అవుతుందన్నారు. తప్పనిసరిగా వివరాలతో రావాలని సూచించారు. ఆటోలో ఆరుగురికి మించి పిల్లలను తీసుకెళ్లొద్దన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష వేయడం జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే డ్రైవర్‌తో పాటు వాహన యాజమానికి సైతం జైలు శిక్ష పడుతుందన్నారు.
నిబంధనలు
* ప్రతి విద్యాసంస్థ పేరు, ఫోన్‌నెంబర్, చిరునామాను వాహనానికి ఎడమవైపు , ముందు భాగంలో రాయించాలి.
* వాహనం డ్రైవర్ 60 సంవత్సరాలకు మించి ఉండరాదు. డ్రైవర్‌కు సంబంధించిన ఆరోగ్య పట్టికను నిర్వహించి, బీపీ, షుగర్ వంటి తదితర పరీక్షలను చేయించి బస్సులో ప్రతి మూడు నెలలకొకసారి చేయించి అతికించాలి.
* కనీసం ఐదు సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ప్రతి డ్రైవర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులకు పరిచయం చేసి వివరాలు తెలుపాలి.
* వాహనంలో ఫిర్యాదుల పట్టికను ఏర్పాటు చేసి ఫిర్యాదులను ప్రతి నెలకు ఒకసారి పరిశీలించాలి.
* ప్రతి వాహనంలో అత్యవసర ద్వారం ఉండి, పెద్ద అక్షరాలతో రాయించాలి
* వాహనంలో ప్రథమ చికిత్స పెట్టెను పెట్టి అందులో అత్యసవరమైన మందులుండాలి.
* వాహనాలను సదరు విద్యాసంస్థలకు చెందిన స్థలంలోనే పార్కింగ్ చేయాలి.
* డ్రైవర్‌తో పాటు అటెండర్ తప్పనిసరి. అటెండర్లతో వాహనాలను నడిపించొద్దు. యూనిఫామ్ ధరించాలి.
* ప్రతి బస్సులో విద్యార్థుల పేర్లు, ఇంటి చిరునామా, తరగతులు, దిగాల్సిన ప్రదేశం పేర్ల పట్టికతో పాటు రూట్ మ్యాప్ ఉండాలి.
* విద్యార్థులు బస్సును ఎక్కడం, దిగడం విషయాన్ని గ్రహించేందుకు కన్వెస్ట్ క్రాస్ అద్దాలుండాలి. ప్రతి బస్సులో కూర్చున్న విద్యార్థులు డ్రైవర్‌కు కన్పించేలా పెద్ద అద్దం పెట్టాలి
* ప్రతి బస్సు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో అగ్నిమాపక యంత్రం(ఫైర్ ఎక్స్‌టింగ్విషర్) పొడి ఉండాలి
* బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు అరలు ఉండాలి.
* బస్సు నాలుగువైపుల బయటి భాగంలో విద్యార్థులకు కన్పించేలా పసుపు పచ్చని ఫ్లాష్ లైట్లు అమర్చాలి
* బస్సులు పాఠశాలకు చెందినవనే విషయాన్ని తెలిపేందుకు వాహనం ముందు భాగంలో బోర్డు పెట్టాలి. 250 మిల్లీ మీటర్లకు తగ్గకుండా ఒక విద్యార్థి, విద్యార్థిని ఫొటోను నల్ల రంగులో వేయించాలి. ఆ బొమ్మ కింది భాగంలో పాఠశాల లేదా కళాశాల బస్సు అని రాయాలి.
* రవాణ శాఖ కమిషనర్‌తో జారీ చేయబడిన బస్ పర్మిట్, బస్ జీవితకాలం తేదీ ముగిసిన నాటి నుంచి పూర్తయినట్లు గ్రహించాలి.
* రవాణ శాఖ ఇచ్చే శిక్షణలో ఏప్రిల్/మే నెలలో పాల్గొనాల్సి ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి విద్యార్థులతో రోడ్‌సేఫ్టీ డేను నిర్వహించాలి.

429
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...