పదిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు


Wed,May 16, 2018 12:32 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతిలో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహుమతులుగా ఇవ్వనున్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా ప్రకటించారు. అదేవిధంగా పదికి తొమ్మది కంటే ఎక్కువ జీపీఏ సాధించిన 129 మంది విద్యార్థులకు చేతి గడియారాలు, మెడల్స్, షీల్డ్, ప్రశంసాపత్రాలను అందజేయను న్నామని తెలిపారు. కలెక్టర్ విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మతో కలిసి డిప్యూటీ డీఈవోలు, డిప్యూటీ ఈవో, సీఆర్పీలతో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2017-18 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి పదోతరగతి పరీక్షలకు హాజరైన 6,693 మంది విద్యార్థులలో 4757 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గోడ గడియారాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ వేడుకలలో సంబంధిత పాఠశాలల కమిటీ అధ్యక్షులు, కార్పొరేటర్లను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. 2018-19లో మిగిలిన 146 ఉన్నత పాఠశాలలో కూడా సెల్ఫ్ డిఫెన్స్‌ను అమలు చేసేందుకు పీఈటీలు, సీఆర్‌పీలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. పాఠశాల, జోనల్, జిల్లా స్థాయిలో క్రీడలకు ప్రతి పాఠశాలకు రూ.1000 మంజూరు చేస్తామన్నారు.

బాలికల నిలుపుదల బాధ్యత సీఆర్పీలదే
2018-19 విద్యాసంవత్సరంలో పదోతరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. జూన్ 1 నుండి బడిబాట కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాల న్నారు. డ్రాపౌట్ పిల్లలకు వయస్సుకు తగ్గ విద్యను అందించేందుకు అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్స్‌ను బ్రిడ్జి కోర్సు సెంటర్లుగా మార్చనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నమోదైన విద్యార్థులందరికి ఆధార్ సీడింగ్ 100శాతం చేయాలని, జూన్ 7న పాఠశాలల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించాలన్నారు. అదే విధంగా యూనిఫామ్‌లను కుట్టించి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని, టెక్ట్స్‌బుక్స్‌ను జూన్ 1 నుండి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

596
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...