యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు


Thu,April 19, 2018 01:23 AM

-నేటి నుంచి అర్ధరాత్రి తనిఖీలకు ఎండీ దానకిశోర్ శ్రీకారం
-మట్టి తరలింపునకు ప్రత్యేకంగా 112 బృందాలు
-ఈ నెలాఖరు నాటికి మట్టి తరలింపు పనులు పూర్తి చేయాలి
-నాణ్యత విషయంలో రాజీ పడితే ఆయా ఏజెన్సీలపై చర్యలు
-సమీక్షలో జలమండలి ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రోడ్డు మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు జలమండలి ఎండీ దానకిశోర్ చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు నేటి నుంచి రాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల్లో వేగం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించడానికి డైరెక్టర్లు, సీజీఎం, ఇతర అధికారులతో కలిసి రాత్రి వేళల్లో పనులను తనిఖీలు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ వివరించారు. బుధవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో హడ్కో పథకం కింద చేపడుతున్న రోడ్డు మరమ్మతు పనులపై ప్రాజెక్టు, ఓఅండ్‌ఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఒక్కో ప్రాంతంలో రోడ్డు మరమ్మతు, మట్టి తరలింపు పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. హడ్కో ప్రాజెక్టులో నిర్మించిన 56 రిజర్వాయర్ల పరిధిలో ఒక్కో రిజర్వాయర్‌కు రెండు బృందాలు, మట్టి తరలించేందుకు ఒక వాహనం చొప్పున మొత్తం 56 వాహనాలు, 112 బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ తెలిపారు. ఈ నెల చివరి నాటికి పైపులైన్ తవ్వకాలు జరిపిన చోట మట్టి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు, ఏజెన్సీలను ఎండీ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టే లోపు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తవ్వకాలను కంకరపొడి, మొరంతో నింపి తాత్కాలికంగా మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా గ్యాపులు, జంక్షన్ పనులు జరిగే చోట బారికేడ్లు, జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఏజెన్సీలను ఎండీ ఆదేశించారు. మరమ్మతుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడేది లేదని, ఎక్కడైనా పనులు నాణ్యత లేకుండా చేపడితే ఆయా ఏజెన్సీల ఖర్చుతోనే తిరిగి పనులు చేయించనున్నట్లు ఏజెన్సీలకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. నల్లా కనెక్షన్లు ఇచ్చిన వెంటనే తవ్వకాలను పూడ్చివేయాలన్నారు. వీటితో పాటు ఎన్జీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డు మరమ్మతులపై అందజేసిన నివేదికలపై ఎండీ ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే వారంలోగా ఎన్జీవోలు బోర్డు దృష్టికి మరో నివేదిక అందజేయనున్నారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణ, ఎల్లాస్వామి, శ్రీధర్ బాబు, పి.రవి, సీజీఎం, జీఎం, ఏజెన్సీల ప్రతినిధులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.

432
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...