దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు ప్లీనరీ శ్రీకారం


Mon,April 16, 2018 05:37 AM

కంటోన్మెంట్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు ప్లీనరీతోనే శ్రీకారం చుడుతున్నట్లు ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ సిహెచ్.మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 17వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని కొంపల్లి జీబీఆర్ కల్చరల్ సొసైటీ ప్రాంగణం, వెంకటపతి రాజు క్రికెట్ అకాడమీ, పీఎస్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్లలో నిర్వహించనున్న ప్రతినిధుల సభ (ప్లీనరీ)లో 15 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఆదివారం ఎంపీ మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై నమస్తే తెలంగాణ ప్రతినిధితో ప్రత్యేంగా మాట్లాడారు. రైతు, కార్మిక, కర్షక సంక్షేమం దిశగా అడుగులకు సీఎం కేసీఆర్ నాంది పలుకనున్నారని వెల్లడించారు. దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. రైతు గురించి ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు. రైతుకు పెట్టుబడి ఇచ్చే ఆలోచన దేశాన్ని కుదిపేస్తుందన్నారు. అన్ని రాష్ర్టాల్లో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నదని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ఎజెండానే ప్రజల డిమాండ్‌గా మారనుందని ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు.

పండుగలా ప్లీనరీ..
టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో తెలంగాణలోని 31 జిల్లాల నుంచి 15 వేల మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున పిలుస్తున్నట్లు తెలిపారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ప్లీనరీ వేదికను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సభ ప్రాంగణాన్ని సెంట్రల్ ఏయిర్ కండిషన్డ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతినిధులకు రుచికరమైన వంటకాలతో విందు భోజనం వడ్డిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లీనరీకి పార్టీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ఈ నాలుగేండ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న కార్యక్రమాలను మననం చేసుకుంటూనే, రాబోయే ఏడాది కాలంలో ప్రణాళిక రచించేందుకు ప్లీనరీకి వేదికగా మార్చుకోననున్నట్లు చెప్పారు. గతేడాది జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది మరింత పకడ్బందీగా ప్లీనరీ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భోజన ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేశామన్నారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మీడియా ప్రతినిధులు, పోలీసులకు సపరేట్‌గా భోజన శాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏ జిల్లా వారు ఏ రూట్‌లో రావాలో వివరిస్తూ రూట్ మ్యాప్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్లీనరీకి సంబంధించిన కిట్లు, సామాగ్రిని ముందుగానే ఆయా జిల్లాల మంత్రులకు అందజేస్తున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా మంచినీళ్లు, మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మల్లారెడ్డి నారాయణ హృదాలయ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 మంది వైద్యులు, 30 మంది నర్సులు, రెండు అంబులెన్స్‌లు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. ప్లీనరీ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ తన పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించారని, అందరిని కలుపుకొని కమిటీలు వేసుకొని అన్ని పనులను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు.

313
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...