భూ రికార్డుల ప్రక్షాళన త్వరగా పూర్తిచేయాలి


Sat,March 17, 2018 02:34 AM

మేడ్చల్ కలెక్టరేట్ : జిల్లాలో రైతులకు కొత్త పాసు పుస్తకాలు, పెట్టుబడి రాయితీ చెక్కులను పంపిణీ చేయాల్సి ఉన్నందున భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎంవీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ భూములకు సంబంధించి ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకం ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. నిజమైన హక్కులు కలిగిన ఏ ఒక్క రైతు కూడ ఈ ప్రక్రియలో మిగిలిపోవద్దని అన్నారు. అదే విధంగా విస్తీర్ణంలో కూడ తేడా లేకుండా ఈ ప్రక్రియను జరుపాలని ఆదేశించారు. ఆధార్ నంబర్ ఇవ్వని వారి భూములను క్లీయర్ లేనివిగా చూపిస్తూ బినామీలుగా పరిగణించడంతో పాటు భవిష్యత్తులో ఆ భూములు రిజిస్ర్టేషన్ కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలో ఘట్‌కేసర్, దుండిగల్ మండలాలు మినహా మిగతా మండలాల్లో ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకాల సేరకణ ప్రక్రియ వెనుకబడి ఉందన్నారు. భూ రికార్డుల ఫిర్యాదులను స్వీకరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.

అదేవిధంగా ఆర్డీఓ కార్యాయాల్లో కూడ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధించి వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులకు కౌంటర్లు దాఖలు చేయాలని అన్నారు. అలాగే సుప్రీం కోర్డు, హై కోర్టు, రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ కోర్టు కేసులకు సంబంధించి ప్రతి శనివారం ప్రత్యేకంగా కేసుల విచారణను చేపట్టాలని అన్నారు. జిల్లాలో అక్రమ లేఔట్‌లకు సంబంధించి నోటీసులు జారీ చేయడంతో పాటు ఫిల్టర్ ఇసుక, మట్టి తవ్వకాలపై దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీఓ నంబర్ 58, 59 కింద వచ్చిన క్రమబద్ధ్దీకరణకు దరఖాస్తు చేసుకొని డబ్బులు చెల్లించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. అదే విధంగా అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరిగినప్పుడు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, తమ పరిధిలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ డి.శ్రీనివాసరెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో విజయకుమారి జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు.

418
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...