అసలేం జరిగింది !


Sat,March 17, 2018 02:33 AM

అబిడ్స్ నమస్తే తెలంగాణ/ ఖైరతాబాద్/ ఉస్మానియాయూనివర్సిటీ/ తార్నాక/ దోమలగూడ: అల్పపీడన ధ్రోణి ప్రభావంతో నగరంలో శుక్రవారం కురిసిన చిరు జల్లులతో పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వాహనదారులు జారి పడి గాయాల పాలయ్యారు. దీనికి ఆమ్ల వర్షం కారణమని కొంతమంది ఊహిస్తుండగా, మరికొంత మంది రోడ్డుపై లీకైన ఆయిల్‌పై చిరుజల్లులు పడడంతో వాహన దారులు గుర్తించకుండా దాని మీదుగా ప్రయాణించడమే కారణమంటున్నారు. తెలుగు తల్లి ైఫ్లె ఓవర్ మీద మాత్రం ఆయిల్ లీకై పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వెంటనే రోడ్డుపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టిని పోసి వాహనదారులు కింద పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకు న్నా రు. వాహనదారులు తిరిగి ఆ రహదారి మీదుగా ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ైఫ్లెఓవర్‌పై గంట సేపు వాహనాల రాక పోకలను నిలిపివేశారు. అదే విధంగా అబిడ్స్ చౌరస్తాలో కూడా ట్రాఫిక్ సజావుగా సాగుతుండగా అకస్మాత్తుగా ఒకరి వెంట ఒక రు వాహనదారులు జారి పడ్డారు. దాదాపు 20 నుంచి 25 మంది వాహనదారులు రహదారిపై జారి పడ్డారు. అబిడ్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమార్ తన సిబ్బందితో రంగంలోకి దిగి కింద పడి పోయిన వారికి ప్రథమ చికిత్స చేయించి పంపి వేశారు. ఉస్మాన్‌గంజ్ ప్రాంతంలో సాధారణంగా ప్రయాణిస్తున్న వాహనదారులు కూడా ఒకరి వెంట ఒకరు అకస్మాత్తుగా జారి పడ్డారు.

దాదాపు ఇరవైకి పైగా వాహనదారులు జారి పడడంతో గాయాలు చోటు చేసుకున్నాయి. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి గాయాల పాలైన వారిని దవాఖానాకు తరలించారు. ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు అరగంట వ్యవధిలో సుమారు ముప్పై ద్విచక్రవాహనాలకు పైగా కిందపడడం గమనార్హం. వారిలో కొంత మంది స్వల్పగాయాల బారినపడ్డారు. రోడ్డుపై వాహనాలు కిందపడుతుండడంతో విద్యార్థులు నిలబడి వారికి సహాయం చేశారు. తార్నాక నుండి మౌలాలికి వెళ్లే మార్గంలో లాలాపేట ైప్లెఓవర్‌పై ఉదయం చెత్తలారీ నుండి అయిల్ లీకేజీ కావడంతో ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి కిందపడిపోయారు. చెత్తవాహనం జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు తరలించే చెత్తలారీలు ఈ రోడ్డుమార్గం గుండా వెళ్తుంటాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చెత్తలారీ ైప్లెఓవర్ పై నుండి వెళ్తున్న క్రమంలో చెత్తలో నుండి ఆయిల్ లీకేజీగా మారి బ్రిడ్జీ పై పారింది. దీనికి తోడు ఉదయం వర్షం జల్లులు కురవడంతో బ్రిడ్జీ నునుపుగా మారి ద్విచక్రవాహనదారులు ఒకరితర్వాత ఒకరు సుమారు అరగంట పాటు 30 మంది వాహనదారులు అదుపుతప్పి కిందపడిపోయారు. జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 100కు వివిధ ప్రాంతాలనుంచి ఫిర్యాదులు అందడంతో వెంటనే అధికారులు అత్యవసర సిబ్బందిని అప్రమత్తంచేసి జారి పడుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసి రోడ్లపై మట్టిపోసి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు.

281
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...