విద్యుత్ సవరణ బిల్లును నిలిపివేయాలి


Thu,March 15, 2018 02:55 AM

- ఉద్యోగులు, కార్మికుల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర
-అఖిల భారత విద్యుత్
-ఉద్యోగుల ఆధ్వర్యంలో మహాధర్నా
-వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ సవరణ బిల్లు-2014ను తక్షణమే నిలిపివేయాలని అఖిల భారత విద్యుత్ ఉద్యోగుల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత విద్యుత్ ఉద్యోగులు సమాఖ్య పిలుపు మేరకు బుధవారం విద్యుత్‌సౌధలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాకు హాజరైన నాయకులు మాట్లాడుతూ... విద్యుత్ సంస్థలోని ఉద్యోగులు, కార్మికులను ప్రైయివేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేందుకు కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీకి ఏప్రిల్-3న చలో పార్లమెంట్‌కు తరలివేళ్లేందుకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైయివేట్ పరం చేయవద్దన్నారు. విద్యుత్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పనిలో భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధానమంత్రి మోడీ కార్యాలయానికి ప్యాక్స్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పద్మారెడ్డి, సాయిబాబా, తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్ ఆసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.రత్నాకర్‌రావు, పి.సదానందం, టీపీడీఈఏ ప్రతినిధి బీసీరెడ్డి, నాయకులు కుమారచారి, ఎన్.కిరణ్, సుధాకర్, మురళి, రాజేంద్రప్రసాద్, ఉదయ్, కిరణ్‌కుమార్, తులసీరామ్, బాలక్రిష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

199
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...