డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్


Thu,March 15, 2018 02:50 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: డిగ్రీ సప్లమెంటరీ పరీక్షల్లో ఒక కాలేజీ కేంద్రం నుంచి మాస్‌కాపియింగ్ జరిగినట్లు గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్‌లోని ఆర్‌కే డిగ్రీ కాలేజీ యజమాన్యంతో పాటు ఆ కేంద్రంలో పరీక్షలకు హాజరయిన 52 మంది విద్యార్థులను నిందితులుగా చేర్చుతూ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్ 2017లో జరిగిన డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను ఓయూలో దిద్దారు. ఈ సందర్భంగా సమాధాన పత్రాల నుంచి మార్కులను వేరు చేస్తున్న సమయంలో ఒకే విద్యార్థి పేరుతో రెండు సమాధాన పత్రాలు ఉండడాన్ని గుర్తించారు. ముందుగా ఒక విద్యార్థికి సంబంధించిన సమాధాన పత్రాన్ని పరిశీలించారు. కంప్యూటర్ సైన్స్-3కి సంబంధించి పరీక్ష కేంద్రంలో ఇచ్చిన సమాధాన పత్రంపై 7257771 నెంబర్ ఉండగా, 7257348 అనే నెంబర్‌తో మరో పత్రం కూడా ఉంది. దీంతో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించి సదరు విద్యార్థికి సంబంధించిన ఫలితాన్ని యూనివర్సిటీ అధికారులు నిలిపివేశారు.

పరీక్ష రాసే సమయంలో ఆర్‌కే కాలేజీ నుంచి సమర్పించిన డీ ఫామ్‌ను పరిశీలించి అందులో విద్యార్థులకు ఇచ్చిన సమాధాన పత్రాల నెంబర్లను పరిశీలించారు. ఈ నెంబర్లతో ఉన్న సమాధాన పత్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ స్టాంప్ ఉండగా, మరో నెంబర్‌తో ఉన్న సమాధాన పత్రంపై ప్రిన్సిపాల్ పేరుతో ఉన్న స్టాంప్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఎంత మంది సమాధాన పత్రాలు డబుల్ ఉన్నాయని ఆరా తీయగా 52 మందికి సంబంధించిన సమాధాన పత్రాలున్నట్లు అధికారులు గుర్తించారు. 52 మంది విద్యార్థులకు వేరు వేరు పరీక్ష కేంద్రాలను కేటాయించినా, వీరంతా ఆర్‌కే డిగ్రీ కాలేజీలో పరీక్ష రాసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్‌కే డిగ్రీ కాలేజీ యజమాన్యం, ఆ కాలేజీ చీఫ్ సూపరింటెండెంట్, కాలేజీ ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్స్‌తో పాటు 52 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు. మాల్ ప్రాక్టిస్ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలను తమకు ఇవ్వాలని సీసీఎస్ అధికారులు ఉస్మానియా అధికారులను కోరారు. సప్లమెంటరీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ నిర్వహించడంలో మూలాలు ఎక్కడున్నాయనే అంశం పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...