185 చెరువులకు పర్యాటక కళ


Tue,March 13, 2018 11:59 PM

-తొలివిడుతలో సరూర్‌నగర్, మల్కం చెరువుల అభివృద్ధికి 20 కోట్ల నిధులు కేటాయింపు
-చెరువుల్లో వర్షపునీరు మాత్రమే ఉండే విధంగా చర్యలు
-మురుగు నీరు డైవర్షన్‌కు ప్రత్యేక బాక్స్‌డ్రైన్‌ల నిర్మాణం
-చెరువుల పరిరక్షణకు లేక్ ప్రొటెక్షన్ టీం
-నగర మేయర్ బొంతు రామ్మోహన్

సిటీబ్యూరో, హస్తినాపురం,మార్చి13 నమస్తే తెలంగాణ : నగరంలోని 185 చెరువులను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ చెరువుల దశ మార్చడానికి బల్దియా కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు, వీటి పరిరక్షణకు 300 మందితో లేక్‌ప్రొటెక్షన్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. మొదట సరూర్‌నగర్‌చెరువు, బల్కం చెరువు అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. భవన నిర్మాణ వ్యర్థాలు చెరువుల్లో వేయడం వల్ల అవి ఉనికి కోల్పోతున్నాయన్నారు. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మురుగునీరు చెరువుల్లోకి వెళ్లకుండా చూస్తామన్నారు. చెరువుల చుట్టూ కాంక్రీట్‌వాల్ నిర్మించి, సీసీ రోడ్లు ఏర్పాటుచేసి, పచ్చదనం పెంపొందిస్తామన్నారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న 185 చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తయారు చేయడానికి జీహెచ్‌ఎంసీ కార్యాచరణ సిద్ధం చేసింది. చెరువులను కాపాడటానికి 300మంది లేక్ ప్రొటక్షన్ సిబ్బందిని నియమించామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ గ్రీన్‌పార్క్ కాలనీలో రూ.50లక్షలతో నిర్మించనున్న డ్రైనేజ్ పనులను స్థానిక కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, డీసీ విజయకృష్ణ, ఎల్‌బీనగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, కాలనీ అధ్యక్షుడు జగన్‌రెడ్డితో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల పాలనలో చెరువులు క్రమేణా ఆక్రమణకు గురయ్యాయని, చెరువులను రక్షించుకొనే బాధ్యతను ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ తీసుకుందన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి ఉప్పల్‌లో ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు. వ్యర్థాలను తీసుకెళ్లడానికి 20 టిప్పర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయన్నారు. చెరువుల్లోకి వచ్చే మురుగు నీళ్లకోసం చెరువు చుట్టూ ప్రత్యేకమైన డ్రైనేజీ ఏర్పాటు చేసి, దానిపైనే సీసీ రోడ్డును ఏర్పాటు చేసుకొని వర్షపు నీరు మాత్రమే నిల్వ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటి విడుతలో సరూర్‌నగర్ చెరువులోని గుర్రపు డెక్కను, పూడికను తొలగించి సుమారు రూ.9కోట్లతో చెరువు చుట్లూ బాక్స్‌డ్రైన్, కాంక్రీట్ వాల్, రోడ్డు నిర్మించి పూర్వపు నెక్లెస్‌రోడ్డును పునరుద్ధ్దరిస్తామన్నారు. ఈక్రమంలో కొన్ని గృహాలు తొలగించాల్సి వస్తే మెరుగైన పరిహరం చెల్లిస్తామన్నారు.

నగర వాసులకు తాగునీరు అందించడం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చుచేసి నగర వ్యాప్తంగా ఉన్న పురాతన తాగునీటి పైప్‌లైన్లను తొలగించి కొత్తలైన్లను వేసి తాగునీటికి కృషి చేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. గ్రీన్‌పార్క్ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాల సందర్భాన్ని పురస్కరించుకొని కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు చూసిన మేయర్ వెంటనే వాటిని తొలగించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుకు రూ.10 వేలు పెనాల్టీ వేయాల్సిందిగా ఆదేశించి, అక్కడికక్కడే పెనాల్టీ రశీదును అందజేసి, డబ్బును తీసుకున్నారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా డివిజన్ మహిళలు తెచ్చిన కేక్‌ను కట్‌చేసి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ ప్రతినిధులు మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్యగౌడ్, దేవేందర్‌రెడ్డి, అనిల్. టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేంధర్‌రెడ్డి, బెల్ద నర్సింహగుప్త, నర్రె శ్రీనివాస్‌కురుమ, గోకుల సరోజ, శ్రీధర్, కుమార్, వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, అధికారులు డీసీ కాండూరి విజయకృష్ణ, ఏఎంహెచ్‌ఓ మల్లిఖార్జున్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్‌యాదవ్, డీఈలు, ఏఈలు, పాల్గొన్నారు.

629
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...

Health Articles