చర్లపల్లిలో ఆయుర్వేద గ్రామం


Tue,March 13, 2018 11:49 PM

-పంచకర్మ తదితర చికిత్సలకు సిద్ధం..
-నేడు ప్రారంభం
చర్లపల్లి : ఇప్పటికే సేంద్రియ సేద్యం తదితర పనులతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న చర్లపల్లి జైలు.. తాజాగా రోగుల సాంత్వన కోసం నేడు ఆయుర్వేదగ్రామాన్ని ప్రారంభిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ఖైదీలకు తగిన శిక్షణ ఇప్పించిన అధికారులు అన్నిరకాల ఆయుర్వేద చికిత్సలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

చర్లపల్లి వ్యవసాయక్షేత్రం(ఓపెన్ ఎయిర్ జైలు)లో ఖైదీల సంక్షేమానికి అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యవసాయక్షేత్రంలో ఖైదీలు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులను సాధిస్తూ తక్కువ ధరలకు కూరగాయాలు, వివిధ రకాల పండ్లు, పూలు అందిస్తున్నారు. తాజాగా వ్యవసాయక్షేత్రంలోకి ప్రజలను అనుమతిస్తూ అయుర్వేదిక్ చికిత్సను అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చికిత్సాలయాన్ని ఈనెల 14న (నేడు) ప్రారంభిస్తున్నారు. మైనేషన్ పేరిట ఆయుర్వేదిక్ విలేజిని ఏర్పాటు చేసిన అధికారులు కీళ్ల నొప్పులు, సర్వేకల్ స్పాండిలైటిస్, డయాబెటిస్, సోరియాసిస్ వంటి వ్యాధులకు చికిత్సలు అందించడంతోపాటు పంచకర్మ చికిత్సలు, యోగా, ధ్యానం వంటి సేవలను అందుబాటుల్లోకి తీసుకువస్తున్నారు.

నేటినుంచి జైలులో పంచకర్మ చికిత్సలు
ప్రభుత్వంపై ఆధారపడకుండా ఆదాయం సమాకుర్చుకునేందుకు జైళ్ల శాఖ అధికారులు, ఖైదీలు దృష్టి సారించారు. కొన్ని సంవత్సరాలుగా వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు చేసిన తప్పులను తెలుసుకొని జైళ్ళశాఖకు కావాల్సిన ఆదాయ వనరులపై దృష్టి సారించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఇప్పటికే జైలు అవరణలో పండిస్తున్న పంటల విక్రయ కేంద్రం, పెట్రోల్ బంక్, ధర్మకాంట, భారీ వాహనాలకు పార్కింగ్, జైలులోని పరిశ్రమలు, వాటర్ సర్వీసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన అధికారులు తాజాగా అయుర్వేదిక్ విలేజిని ఏర్పాటు చేసి చికిత్సలను అందుబాటుల్లోకి తీసుకువచ్చారు.

ఖైదీల సహకారంతోనే..
రాష్ట్ర ప్రభుత్వం, జైలు ఉన్నతాధికారుల సహకారంతో జైలు అవరణలో అయుర్వేద చికిత్సాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులకు చికిత్స చేయడంతో పాటు మసాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్టీమ్ బాత్ సౌకర్యం కల్పించడంతో పాటు పలు వ్యాధులకు చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నాం. అందరికి అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం.
-పర్యవేక్షణాధికారి రాజేశ్

యోగా, ధ్యానం..
వ్యవసాయ క్షేత్రంలో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించేందుకు వైద్యశాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గ్రామీణ వాతవరణాన్ని తలపిస్తూ ప్రకృతి ఒడిలో మెరుగైన వైద్యం అందించి మందులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా అనుభవజ్ఞులైన శిక్షకులచే యోగా, ధ్యానం తరగతులను నిర్వహించడంతో పాటు స్టీమ్ బాత్, మసాజ్ కేంద్రంను ఏర్పాటు చేశాం.
-వైద్యుడు వైబీ.రమేశ్

449
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...