ఇక్కడ మనుషులే.. పుస్తకాలు


Tue,March 13, 2018 11:46 PM

-కొత్త కొత్త ముచ్చట్లు చెబుతాయి
-తమను తాము ఆవిష్కరించుకుంటాయి
-హ్యూమన్ లైబ్రరీకి ఏడాది
-వందకుపైగా పుస్తకాల పరిచయం
-ఇతర పట్టణాలకు విస్తరించే యోచన
లైబ్రరీ అనగానే.. పుస్తకాలు గుర్తుకువస్తాయి. అక్కడ మనకు కావల్సిన పుస్తకాలన్నీ తారసపడతాయి. అవి మనకు జ్ఞానాన్ని అందిస్తాయి. ఇక్కడా అంతే.. హ్యూమన్ లైబ్రరీలోనూ వైవిధ్యభరితమైన పుస్తకాలు తారసపడతాయి. అవి ప్రత్యక్షంగా మాట్లాడాతాయి. తమను తాము ఆవిష్కరించుకుంటాయి. అత్యాచారానికి గురైన యువతి, ట్రాన్స్‌జండర్, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వ్యక్తి, సరిహద్దులో పోరాడే జవాను, గృహ హింసను ఎదుర్కొన్న మహిళ ఇలా ఎం దరో వ్యక్తులు. వాళ్లను పలకరిస్తే... ఊహించని వాస్తవాలు వినిపిస్తాయి. అలాంటి వాళ్లను నగరవాసుల ముందుకు తెస్తోందీ హ్యూమన్ లైబ్రరీ. ప్రతినెలా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హ్యూమన్ లైబ్రరీలో వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులకు పుస్తకాలను పరిచయం చేస్తున్నది.

వైవిద్యభరితం
కుల, మత, లింగ వివక్ష, గృహ హింస, లైంగిక హింసను ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న వ్యక్తులను, దీర్ఘకాలిక వ్యాధులను అనుభవిస్తున్న వారిని హ్యూమన్ లైబ్రరీ పరిచయం చేస్తున్నది. గత సంవత్సరం మార్చిలో ప్రారంభమైన హైదరాబాద్ హ్యూమన్ లైబ్రరీ విజయవంతంగా ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 16 హ్యూమన్ లైబ్రరీలను నిర్వహించింది. వీటి ద్వారా దాదాపు వందకుపైగా పుస్తకాలను పరిచయం చేసింది. ప్రతి కార్యక్రమంలో దాదాపు 15 నుంచి 20 మందిని పుస్తకాలుగా పరిచయం చేస్తూ... పాఠకులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల వారు.. ఎవరితోనైనా సంభాషించి వాళ్ల అనుభవాలను తెలుసుకోవచ్చు. వేర్వేరు రూపాల్లో వివక్షను ఎదుర్కొంటున్న వారి జీవితాల్లోని వేదనను అర్థం చేసుకోవచ్చు.

వార్షికోత్సవం...
హైదరాబాద్ హ్యూమన్ లైబ్రరీకి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. పలువురు హ్యూమన్ లైబ్రరీని ప్రశంసిస్తున్నారు. గత ఏడాది కాలంలో లామకాన్, స్టేట్ ఆర్ట్‌గ్యాలరీ, బ్రిటీష్ లైబ్రరీతో పాటు నగరంలో వేర్వేరు కళాశాలల్లో హ్యూమన్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. నగరంతో పాటు తమిళనాడులోని ఎన్‌ఐటీ ట్రిచ్చిలోనూ హైదరాబాద్ హ్యూమన్ లైబ్రరీ కార్యక్రమాన్ని నిర్వహించింది. జనవరిలో జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లోనూ హ్యూమన్ లైబ్రరీ బుక్స్‌ను పరిచయం చేసింది. తాజాగా హెచ్‌హెచ్‌ఎల్ ఏడాది పూర్తయిన సందర్భంగా ది పార్క్ హోటల్‌లో 19 బుక్స్‌తో వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 450 మంది పాఠకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది గొప్ప విషయంగా హెచ్‌హెచ్‌ఎల్ ప్రతినిధి హర్షద్ తెలిపారు.

చుట్టు పట్టణాలకు విస్తరిస్తాం
హ్యూమన్ లైబ్రరీ హైదరాబాద్ ఆరంభించిన ప్రయత్నం పాఠకులకు సరికొత్త చూపును అందిస్తున్నది. వ్యక్తులతో నేరుగా సంభాషిస్తూ... వాళ్ల అనుభవాలను తెలుసుకోవడం పట్ల పాఠకులు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ ప్రయత్నాన్ని పట్టణస్థాయిలోకి సైతం విస్తరించాలని హ్యూమన్ లైబ్రరీ బృందం యోచిస్తున్నది. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు క్రౌడ్ ఫండింగ్ చేయనున్నామని హర్షద్ తెలిపారు. తద్వారా వచ్చే ఆదాయంతో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణాలకు వెళ్లి అక్కడ హ్యూమన్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తాం అంటూ వివరించారు.

387
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...