పాసు పుస్తకాల... ఆధార్ సీడింగ్ వేగవంతం చేయాలి


Fri,February 23, 2018 01:24 AM

మేడ్చల్ కలెక్టరేట్: జిల్లాలో మార్చి 11వ తేదీ నుంచి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉన్నందున గ్రామాల్లోని రైతులందరికీ ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎంవీరెడ్డి అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉన్నందున 4 రోజల్లో రైతుల ఆధార్ సీడింగ్,డిజిటల్ సంతకం వంటి ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు.ముఖ్యంగా శామీర్‌పేట,కీసర,మేడ్చల్ మండలాల్లో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

ఇసుక,మట్టి అక్రమ రవాణాపై దృష్టి
జిల్లాలో ఇసుక,మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.దీంతో పాటు అక్రమ లేఅవుట్లు,ప్రతి రోజు దినపత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్త కథనాలపై రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.జిల్లాలో ఉన్న కోట్లాది విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షించేందుకు వీలుగా వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించి మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్‌లో 29,కీసర డివిజన్ పరిధిలో 71 కేసులకు కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా రెవెన్యూ కోర్టు కేసులకు సంబంధించి కీసర డివిజన్‌లో 66,మల్కాజ్‌గిరి డివిజన్‌లో 50 కేసులను పరిష్కరించాల్సి ఉందన్నారు.మరో వారం రోజుల వ్యవధిలో ఈ కేసులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కల్యాణలక్ష్మి దరఖాస్తులపై
తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తులను త్వరగా పరిశీలించి తదుపరి ఎమ్మెల్యేల ద్వారా లబ్ధ్దిదారులకు చెక్కుల పంపిణీ జరిగేలా చూడాలన్నారు.కల్యాణలక్ష్మి చెక్కులకు సంబంధించి కీసర రెవెన్యూ డివిజన్‌లో దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నాయని,చెక్కుల పరిశీలన పూర్తి చేసిన అనంతరం లబ్ధ్దిదారులకు పంపిణీ చేయాలని సూచించారు.

మీ-సేవ దరఖాస్తులపై...
జిల్లాలో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో కుల,ఆదాయ,జనన ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని,వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.ఇక గ్రామాల్లో డబుల్ ఇండ్లకు సంబంధించి లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా చేపట్టాలన్నారు. తహసీల్దార్లు తమ తమ మండలాల్లో ఉన్న జనాభా సంఖ్యను అంచనా వేస్తూ లబ్ధ్దిదారుల ఎంపిక చేయాలన్నారు.ఎన్‌ఓసీ జారీ విషయంలో ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.అదే విధంగా భూ సర్వే ప్రక్రియను కూడా జాప్యం లేకుండా వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో జేసీ ధర్మారెడ్డి,లా అధికారి విజయ కుమారి,ఆర్డీఓలు హన్మంతరెడ్డి,మధుసూధన్,తహసీల్దార్లు పాల్గొన్నారు.

225
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...