సైబర్ నేరాలపై అవగాహన అవసరం


Tue,February 20, 2018 12:24 AM

బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో సైబర్ సెక్యూరిటీపై సరైన అవగాహన లేకపోవడంతో సైబర్ నేరస్తులు సులభంగా మోసం చేయడానికి అవకాశం ఏర్పడిందని నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాస్‌రావు అన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ఐదు లఘు చిత్రాలను సోమవారం సీపీ శ్రీనివాస్‌రావు, నిర్మాతలు దిల్‌రాజ్, సుప్రియ, రాజ్ కు మార్ తదితరులతో కలిసి బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో వీక్షించారు. సోషల్ మీడియా వేదికగా చేస్తున్న నేరాల గురించి, ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు, వివాహ ప్రకటనల పేరుతో మోసాలు, మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ఓటీపీ నెంబర్లు తెలుసుకుని మోసాలు తదితర అంశాలపై రూపొందించిన ఈ లఘు చిత్రాలకు సినీ ప్రముఖులు ఎస్‌ఎస్.రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, నిఖిల్ తదితరులు వాయిస్‌ఓవర్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగించేవారు 53నుంచి 55శాతం ఉన్నారని, మనదేశ జనాభాలో ఇంటర్నెట్ వినియోగదారులు 35శాతం ఉన్నారని, వీరిలో అత్యధికులు ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియాను వినియోగిస్తున్నారన్నారు. మూడేళ్లుగా ఈ-కామర్స్ విధానం విపరీతంగా ప్రాచుర్యం పొందిందని, ఇంటర్నెట్ వినియోగించే వారిలో 50నుంచి 52శా తం మంది ఈ-కామర్స్ ద్వారా షాపింగ్ చేస్తున్నారన్నారు.

ఇటువంటి వారు ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లింపులు జరిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు, నేరగాళ్లు మోసానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ-కామర్స్ ద్వారా లా వాదేవీలు జరిపేవారు స్టాండర్ట్ యాంటీవైరస్ పద్ధతులను , ఫైర్‌వాల్స్ వినియోగించకపోతే ముప్పు పొంచిఉందని హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ఏటా 300నుంచి 350 దాకా కేసులు నమోదవుతున్నాయని వివరించారు. అయితే సెల్‌ఫోన్ సంస్థలు, బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తుండడం ఆందోళన కరమన్నారు. సోషల్‌మీడియాలో ఎడాపెడా ఫొటోలు పోస్ట్‌చేయడం, సమాచారాన్ని పంపించడంతో ఆ సమాచారాన్ని ఉపయోగించి మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని, అట్టి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శక్తివంతమైన సినిమా మాద్యమాన్ని వినియోగించుకునే ప్రయత్నంలో భాగంగా లఘు చిత్రాలను నిర్మించడం జరిగిందని, ఈ లఘు చిత్రాలను సినిమా థియేటర్లు, టీవీ చానెళ్లలో విస్త్రృతంగా ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (క్రైం) స్వాతి లక్రా, సైబర్ క్రైం విభాగం అదన పు డీసీపీలు రఘువీర్, జోగయ్య పాల్గొన్నారు.

270
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...