బల్దియాలో ఇంటర్‌నెట్ బంద్


Tue,February 20, 2018 12:22 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:బల్దియాలో ఇంటర్‌నెట్ సేవలకు అడ్డుకట్ట వేసి ఇంట్రానెట్(పరిమిత సమాచార ప్రసార నెట్‌వర్క్) సేవలకు పరిమితం చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లకే కాకుండా అధికారులకు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లకు బల్దియా సమకూర్చుతున్న వైఫై సేవల్లో సైతం ఇదే విధంగా పరిమితులు విధించారు. ఇంటర్‌నెట్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా కమిషనర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బల్దియాలో వందల సంఖ్యలో ఉన్న కంప్యూటర్లకు ఇంతకాలం అపరిమిత ఇంటర్‌నెట్ సేవలు ఇస్తూ వచ్చారు. అధికారిక అవసరాలకన్నా ఎక్కువగా ఆట-పాటలు, సొంత వ్యాపకాలు, సినిమాలు తదితరవాటికే దీని వినియోగం అవుతున్నది. అంతేకాదు, కొందరు అధికారులు, ఉద్యోగులు తమ సొంత పనులకు కూడా కార్యాలయంలోని ఇంటర్‌నెట్‌నే వినియోగిస్తున్నారు. ఇటీవల కొత్తగా ఐటీ విభాగం అదనపు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ముషారఫ్ ఇంటర్‌నెట్ వినియోగంపై దృష్టి కేంద్రీకరించారు. ఉద్యోగులు, అధికారులు ఏఏ సైట్లు ఎక్కువగా వీక్షిస్తున్నారని ఆయన పరిశీలించగా, అందులో 90శాతం అనవసర వ్యవహారాలు, కాలక్షేపం కోసమే వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఆయన విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా కమిషనర్ ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంట్రానెట్ సేవలకు పరిమితం చేశారు. అంటే, అధికారిక కార్యకలాపాలకు సంబంధించిన లాన్ మాత్రం పనిచేస్తుంది. దీనివల్ల అధికారిక కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం ఉండదని, అన్నీ యథావిథిగా కొనసాగుతాయని ఓ అధికారి తెలిపారు. ఇంటర్‌నెట్ కావాలనుకునే అధికారులకు ప్రత్యేక కోడ్ ఆధారంగా సేవలు అందించనున్నట్లు, వినియోగంపై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఈ చర్యతో విచ్ఛలవిడి ఇంటర్‌నెట్ వినియోగానికి చెక్ పడినట్లయింది.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS