ప్రజల భాగస్వామ్యంతోనే..స్వచ్ఛత సాధ్యం

Tue,February 13, 2018 03:44 AM

-స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అందరూ పాల్గొనాలని మంత్రి కేటీఆర్ పిలుపు
-ఒకేచోట 15,320 మంది స్వీపింగ్‌తో రికార్డు
-హైరేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్,
-యూనివర్స్‌బుక్ ఆఫ్ రికార్డులు కైవసం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈనెల 15నుంచి 22వ తేదీవరకు జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో నగరాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గత ఏడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఇతర మెట్రో నగరాలకన్నా మన నగరం ముందు నిలిచిందని గుర్తుచేస్తూ, అదే స్పూర్తిని కొనసాగిస్తూ ఈసారి మరింత మెరుగైన స్థానం పొందేందుకు పాటుపడాలని కోరారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా నగరంలో పరిశుభ్రత సాధ్యంకాదని ఆయన స్పష్టంచేశారు. రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వీఎస్‌టీ చౌరస్తానుంచి బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీవరకు నిర్వహించిన స్వచ్ఛసర్వేక్షణ్ ప్రచారోద్యమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు చెందినవారు తదితర వర్గాలంతా కలిపి 15320మంది ఒకేసారి రోడ్లను శుభ్రంచేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టకముందే సీఎం కేసీఆర్ నగరంలో స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో నగరంలో పెద్దఎత్తున పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తుచేశారు. ముందుగానే సీఎం కేసీఆర్ నగరాన్ని నాలుగువందల భాగాలుగాచేసి ప్రముఖులందరికీ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. గతంలో రోజుకు 3500మెట్రిక్ టన్నులు వెలువడుతుండగా, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాక 4500మెట్రిక్ టన్నులు వెలువడుతున్నట్లు పేర్కొన్నారు.

కొందరు తాము పంపిణీ చేసిన చెత్తబుట్టలు బియ్యం, పప్పులు వేసేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ తడి, పొడి చెత్తపై ఇళ్లలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్కూలు పిల్లలపైనే ఉందని మంత్రి చెప్పారు. విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ హైదరాబాద్ కల సాకారమవుతుందన్నారు. చెత్తను తడి, పొడి చెత్తగా విడదీసేందుకు కృషిచేయడంతోపాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నించాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి సభకు హాజరైనవారితో స్వచ్ఛ ప్రతిజ్ఞచేయించారు.డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్, మాజీ మంత్రి వినోద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితోపాటు పలువురు నటీనటులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రికార్డు నమోదు

ఒకేచోట 15320మంది మూడు నిముషాలపాటు చీపుర్లు పట్టుకొని ఊడ్చి సరికొత్త రికార్డును నెలకొల్పారు. గతంలో వడోదరలో 5058మందితో ఊడ్చిన కార్యక్రమం గిన్నిస్ రికార్డులో నమోదుకాగా, ప్రస్తుతం దాన్ని అధిగమించారు. గిన్నిస్ రికార్డుకు చెందిన ప్రతినిధులు చీపుర్లను పంపిణీచేసి ఎంతమంది ఊడ్చారో నమోదుచేశారు. పదిరోజుల్లో గిన్నిస్ రికార్డు ఫలితం వెల్లడవుతుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దీంతోపాటు యూఎస్‌కు చెందిన హైరేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డుగా ప్రకటించింది.

దీంతోపాటు యూనివర్స్ బుక్ ఆఫ్ రికార్డును కూడా ఈ కార్యక్రమం సొంతం చేసుకుంది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు,బస్తీ కాలనీ వాసులు వీఎస్టీ జంక్షన్ నుంచి సుందరయ్య పార్కు వరకు భారీగా చేరుకున్నారు. అందరినీ వీడియోలో రికార్డు చేస్తూ చీపుర్లను అందజేశారు. ఇలా 15320 మంది చీపుర్లు తీసుకున్నట్లు అక్కడికి వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. అలాగే వీఎస్టీ జంక్షన్ నుంచి ఒకే ఎంట్రీ ఏర్పాటు చేయడంతో వచ్చినవారిని కచ్చితంగా లెక్కించే ఆస్కారం కలిగింది. దాదాపు 400 మంది నుంచి 600 మంది వరకు వలంటీర్లుగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, వీఎస్‌ఆర్ యువసేన కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బస్తీ, కాలనీ వాసులు పని చేశారు.

265
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles