జల్సాల కోసం దొంగగా మారాడు..!

Tue,February 13, 2018 03:35 AM

కంటోన్మెంట్, (నమస్తే తెలంగాణ): జల్సాలకు అలవాటు పడిన ఓ విద్యార్థి దొంగగా మారాడు. ఇండ్లలో చోరీలు, బైక్‌లను తస్కరిస్తూ.. తప్పించుకుతిరుగుతున్నాడు. సీసీ ఫుటేజీల సహాయంతో గోపాలపురం పోలీసులు పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 9.3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు రెండు ఖరీదైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నార్త్‌జోన్ డీసీపీ బడుగుల సుమతి సికింద్రాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కూకట్‌పల్లి, ఆల్వీన్‌కాలనీకి చెందిన ఠాకూర్ విశాల్‌సింగ్(21) ఎస్‌ఆర్ నగర్‌లోని రావూస్ కాలేజీలో బీకాం కంప్యూటర్స్‌లో చేరాడు. ఇతని తండ్రి ఓ ప్రముఖ ఫ్యాన్ల తయారీ కంపెనీలో మేనేజర్. కాగా విశాల్‌సింగ్ కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడడంతోపాటు బైక్ రేసింగ్‌లను హాబీగా మలచుకున్నాడు. డబ్బుల కోసం తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

అదేవిధంగా బైక్ రేసింగ్‌ల కోసం ఖరీదైన కేటీఎం బైక్‌లను తస్కరిస్తున్నాడు. గతంలో దుండిగల్ పీఎస్ పరిధిలో బైక్‌ను, గోపాలపురం పీఎస్ పరిధిలో రెండున్నర లక్షల ఖరీదైన మరో బైక్‌ను తస్కరించాడు. దీంతో బాధితుడు ఆంథో ని జోసెప్ గత నెల 29న గోపాలపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి పాత నేరస్తుడు విశాల్‌సింగ్ నేరానికి పాల్పడ్డట్లు గుర్తించారు. సోమవారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఇండ్లలో చోరీలు, బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. కాగా.. ఇతను గతంలో గోపాలపురం పీఎస్ నుంచే జైలుకెళ్లినట్లు డీసీపీ తెలిపారు. మేడిపల్లి, చిక్కడపల్లి, జగద్గిరిగుట్ట తదితర పీఎస్‌ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, డీఐ కిరణ్‌కుమార్, డీఎస్సై రామకృష్ణలు పాల్గొన్నారు.

175

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles