లక్ష మందికి పైగా.....


Fri,January 19, 2018 12:19 AM

-పాత నేరస్తులపై మూడు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా సర్వే
-డీజీపీ నుంచి హోంగార్డు వరకు అందరూ వివరాల సేకరణలోనే..
-నేడూ రేపూ కొనసాగనున్న ప్రక్రియ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఒకపక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. మరో వైపు శాంతి భద్రతల పరిరక్షణకు వినూత్న చర్యలకు శ్రీకారం చుడుతున్న పోలీసులు తాజాగా పాత నేరస్తుల సర్వేను గురువారం ప్రారంభించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో తెల్లవారుజామునుంచే డీజీపీ నుంచి హోం గార్డు వరకు వివరాల సేకరణ ప్రారంభించారు. మూడురోజుల్లో దాదాపు లక్షా పదివేల ఇండ్లకు వెళ్లి ఈ సర్వే పూర్తిచేయ నున్నారు. మొదటిరోజు డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పోలీసు కమిషనర్లు వీవీ శ్రీనివాస్‌రావు, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్ పాల్గొన్నారు. గ్రేటర్‌ను శాంతి భద్రతలకు నిలయంగా మార్చడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సర్వేతో నేరస్తులపై కచ్చితమైన నిఘా ఉంటుందని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు అభిప్రాయపడగా, దీనివల్ల పాత నేరస్తులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య అన్నారు. అందరి వివరాలు తమ వద్ద ఉన్నందున నేరం చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. క్రైమ్‌రేట్ తగ్గించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాన్ని నగరవాసులు అభినందిస్తున్నారు.

పాత నేరస్తుల తాజా కదలికల గురించి పోలీసులకు అంతా తెలిసిపోయింది. సకల నేరస్తుల సమగ్ర సర్వేతో క్రిమినల్ తాజా వ్యవహారాలు పోలీసు రికార్డులకు ఎక్కాయి. ప్రస్తుత ఫొటోతో వారి వివరాలు అప్‌డేట్ అయ్యాయి. గురువారం ట్రై కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు పాత నేరస్తుల ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. 2007 నుంచి నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తున్న వారి తాజా చిట్టాను పోలీసులు ఇంటింటికి వెళ్ళి సేకరించారు. వారి ఇంటిని జియో ట్యాగింగ్ చేశారు. ఇలా మూడు పోలీసు కమిషనరేట్ పరిధుల్లో దాదాపు పలువివరాలను పోలీసు అధికారులు టీఎస్ కాప్ యాప్ తో పాటు ఇతర పోలీసుల రికార్డులో భద్రపర్చారు. ఒక వైపు టెక్నాలజీతో వివరాలు భద్రపరుస్తూనే మరో వైపు రాత పూర్వకంగా వారి నుంచి దాదాపు 30 విషయాల్లో వివరాలను తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా తాజా ఫొటో, ఆధార్ కార్డు, గ్యాస్ రిజిస్ట్రేషన్ బిల్లు, ఫోన్ నెంబర్‌లు, స్నేహితులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లు, వాహనాల నెంబర్‌లను ఎంట్రీ చేశారు. సైబర్ క్రైం, ఈవ్‌టీజింగ్, దొంగతనాలు, కిడ్నాప్‌లు, బెదిరింపు వసూలు, గ్యాంబ్లింగ్(పేకాటరాయుళ్ళు, క్రికెట్ బెట్టింగ్)మాదకద్రవ్య విక్రయాలు, దృష్టి మళ్ళింపులు, ఫేక్ వీసాలు, మట్కా, ఆయుధాల సరఫరా, వ్యభిచారం వంటి సంఘటనలకు పాల్పడ్డ వారితో పాటు ఇతర క్రిమినల్ వ్యవహారాలను సర్వేలో వివరాలను సేకరించారు.

మొత్తానికి ట్రై కమిషనరేట్‌ల పరిధులలో 1.10 లక్షల మంది నేరస్తుల ఇండ్లకు పోలీసులు వెళుతున్నారు. మొదటి రోజు సర్వేను డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పోలీసు కమిషనర్‌లు వీవీ శ్రీనివాస్‌రావు, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్‌లు పరిశీలించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాదాపూర్, హబీబ్‌నగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లోని సర్వేను పర్యవేక్షించారు. ఈ సర్వే సేకరణలోని అన్ని విషయాలను సిబ్బంది వారి ట్యాబ్‌లో అప్పటికప్పుడు అప్‌లోడ్ చేశారు. వేలి ముద్రలను కూడా తీసుకున్నారు. ఇదిలా ఉండగా కొందరు అరస్టైన సమయంలో ఇచ్చిన చిరునామాలో లేకపోవడంతో పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ సర్వే వివరాలను ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో క్రైం రికార్డ్స్ బ్యూరోలో వీటిని భద్రపర్చనున్నారు. అదే విధంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఫేసియల్ టెక్నాలజీకి క్రిమినల్స్ ఫొటోలను అనుసంధానం చేయడానికి కూడా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. క్రిమినల్స్ సర్వే పై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజా భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు అభినందిస్తున్నారు.

సైబరాబాద్‌లో 42,360 మంది క్రిమినల్స్

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 42,360 మంది నేరస్తులు నమోదయ్యారు. వీరిలో ప్రస్తుతం ఈ కమిషనరేట్ పరిధిలో ఉంటున్న వారి సంఖ్య 21803. వివిధ జిల్లాలో ఉంటూ సైబరాబాద్ పరిధిలో నేరాలకు పాల్పడుతున్న వారు 13,895 మంది ఉన్నారు. వీరిలో కొంత మంది సైబరాబాద్‌లో ఉంటూ ఇతర రాష్ట్రాల్లో నేరాలు చేస్తున్నారు. 6662 మంది నేరస్తులు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడి ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. 245 బృందాలతో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో స్వయంగా సీపీ సందీప్ శాండిల్య క్రిమినల్స్ వివరాలను సేకరించారు.

రైల్వే పోలీసులు సైతం..

మారేడ్‌పలి : సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే పోలీసులు గురువారం పాత నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జి. అశోక్‌కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ నగరం లోని పలు ప్రాంతాల్లో వివరాలను సేకరించారు. సికింద్రాబాద్ అర్బన్ సబ్ డివిజన్ లో మొత్తం 148 మంది నేరస్తులు ఉండగా.. 79 మంది నగరానికి చెందిన వారు కాగా, మిగతా 69 మంది వివిధ రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో తెలంగాణలో ఉన్న 79 మంది వివరాలను రైల్వే పోలీసులు సేకరించారు. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే రూరల్ సబ్ డివిజన్ పరిధిలో 54 మంది నేరస్తులు ఉండగా, 34 మంది తెలంగాణకు చెందిన వారు కాగా, మిగతా 20 మంది వివిధ రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారు.. నేరస్తుల పూర్తి వివరాలను రైల్వే పోలీసులు సేకరించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ రైళ్లలో, రైల్వే స్టేషన్లలో నేరాలకు పాల్పడిన వారి వివరాలను పూర్తి స్థాయిలో సేకరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న నేరస్తుల వివరాలను సేకరించినట్లు తెలిపారు. కొంత మంది నేరస్తులు రాష్ట్రంలో ఉండగా, మరి కొంత మంది వివిధ రాష్ర్టాల్లో ఉన్నారని తెలిసింది. నేరస్తులు ఫొటోతో పాటు అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నా మన్నారు.


441
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...