సరికొత్త బల్దియా సైన్యం!


Fri,January 19, 2018 12:15 AM

-జోన్లవారీగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
-మొదటిదశలో సుమారు 300 మంది సభ్యులు
-వచ్చే ఫిబ్రవరి నెలాఖరుకు మొదటిదశ బృందాలు సిద్ధం
-అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
-కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ
-ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో విపత్తుల సహాయక చర్యలు
-మేయర్ బొంతు రామ్మోహన్
సిటీబ్యూరో: అక్రమాలను అరికట్టడంతోపాటు విపత్తుల సంబర్భంగా సహాయక చర్యలు చేపట్టేందుకు బల్దియా సరికొత్త సైన్యాన్ని సిద్ధం చేస్తున్నది. ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్ స్థాయిలో ఇవి పనిచేస్తాయి. ఈ బృందాలు అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్లపై, నాలాల్లో చెత్తా-చెదారం వేయడం, హోటళ్ల తనిఖీలు, ఆహార భద్రత, అక్రమ పార్కింగ్‌లు తదితర చర్యలను నియంత్రించడంతోపాటు విపత్తులు సంభవించినప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తలదన్నే విధంగా సహాయక చర్యలు చేపడతాయి. అంతేకాదు, ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపాదిత ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల వివరాలను వెల్లడించారు. వచ్చే నెలాఖరునాటికి సుమారు 300మందితో మొదటిదశ బృందాలు సిద్ధమవుతాయని, అవసరాలకు అనుగుణంగా ఈ బృందాల సంఖ్యను 1000వరకూ పెంచనున్నట్లు తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి....

ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పర్యవేక్షించే అంశాలు, చర్యల వివరాలు.....
- చెత్తా-చెదారం రోడ్లపై ఇష్టానుసారంగా వేస్తే ఈ బృందాలు చర్యలు తీసుకుంటాయి
- అక్రమంగా రోడ్లను తవ్వినా, నాలాల్లో చెత్త వేసినా, రోడ్లపై నీరు వదిలినా, రోడ్లు, జీహెచ్‌ఎంసీ ఆస్తులకు నష్టం కలిగిస్తే పౌరులు ఫొటోతీసి పంపిస్తే చర్యలు తీసుకుంటారు.
- ఫిర్యాదులే కాకుండా బృందాలు కూడా తరచూ నిర్దేశిత ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ దృష్టికొచ్చిన అక్రమాలపై చర్యలు తీసుకుంటాయి.- రోడ్లపై డెబ్రిస్ వేసినా, డెబ్రిస్‌ను సంబంధిత వాహనాలు కాకుండా ప్రైవేటు వాహనాల్లో తరలించినా జరిమానాలు విధిస్తారు.
- అక్రమ నిర్మాణాలు చేస్తే లోకల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు సరిగా స్పందించకపోతే భవనాన్ని పడగొట్టే వరకు బృందం బాధ్యత తీసుకుంటుంది.
- ఫుట్‌పాత్‌లపై ఉన్న షాప్‌ల తొలగింపు బాధ్యతలను కూడా ఈ బృందం చూస్తుంది.
- అనుమతి లేని నిర్మాణాలను కూల్చిన అనంతరం ఆ వ్యర్థాల తరలింపునకు కూడా సంబంధిత యజమానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత కూడా బృందం చూస్తుంది.
- ట్రాఫిక్ పోలీస్ విభాగం నిర్వహిస్తున్న ఈ-చలాన్ మాదిరిగానే చెత్త వేస్తున్న వారికి జరిమానాలు విధిస్తారు. ఆన్‌లైన్‌లో జరిమానా చెల్లించే వీలుంటుంది.

కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ....
- ఫిర్యాదుల మానిటరింగ్ వ్యవస్థను పక్కాగా అమలు చేయనున్నారు. దీనికోసం ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఫిర్యాదు దగ్గర్నుంచి చర్యలు తీసుకునే వరకు ప్రక్రియంతా ఆన్‌లైన్‌లో కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటారు.
- అంతేకాదు, ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ నుంచి, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల ద్వారా వచ్చే ఇన్‌పుట్‌ల ఆధారంగా పర్యవేక్షిస్తారు.
- ఫిర్యాదు సరైందా లేదా అనేది ముందుగా సంబంధిత విభాగం నుంచి నిర్దారణ చేసుకున్న తరువాత జీహెచ్‌ఎంసీ యాక్టు ప్రకారం చర్యలకు దిగుతారు.- ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో బృందం సభ్యులకు సహాయక చర్యల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. - విపత్తు ఎదురైనా వెంటనే బృందాలు సహాయక చర్యలకు దిగుతాయి. దీనికోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు అన్నిరకాల పనిముట్లు సమకూర్చుతున్నారు. ముఖ్యంగా జేసీబీ, 200మిషన్, బ్రేకర్, అగ్నిమాపక సహాయక చర్యలకు సంబంధించిన యంత్ర సామగ్రి, గ్యాస్‌కట్టర్ తదితర సామగ్రి ప్రతి జోన్‌లో రెండు కిట్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు

345
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...