సంకల్పమే నడిపించింది


Wed,January 17, 2018 03:44 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జయించాలనే సంకల్పం ఉంటే చాలు... దారులు చదును చేసుకునే ధైర్యం సొంతమవుతుంది. అలా తమ ను తాము పదునెక్కించుకొని విజయం ముంగిట వాలిన ముగ్గురు వనితలు ఒకే వేదికపై కనిపించారు. మంగళవారం పార్క్ హయత్‌లో ఉమెన్ హూ హావ్ పేవ్‌డ్ దైర్ ఓన్ పాత్ అనే అంశంపై ఫిక్కి ఫ్లో నిర్వహించిన చర్చాకార్యక్రమంలో దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ముగ్గురు మహిళలు పాల్గొన్నారు. ఎంబీఏ చదివి యువ సర్పంచ్‌గా గుర్తింపు పొందిన ఛావి రజావత్, క్యాన్సర్‌ని జయించి జెట్ సెట్‌గోతో సంచలనం సృష్టిస్తున్న కనిక టెక్రివాల్, దళిత కుటుంబంలో పుట్టి దేశంలోనే ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన పద్మశ్రీ కల్పనా సరోజ్ ఈ చర్చా కార్యక్రమంలో తమ గాథలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఛావి రజావత్ మాట్లాడుతూ పుట్టి పెరిగిన ఊరికు ఏదైనా చేయాలనే ఆకాంక్షతో రాజస్థాన్‌లోని సోండ గ్రామానికి సర్పంచ్‌గా పోటీ చేశానని తెలిపారు.

తాను సర్పంచ్‌గా ఎన్నికయ్యే నాటికి గ్రామంలో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లోంచి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా పనిచేసినట్లు తెలిపారు. గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన వనరులను వేర్వేరు రంగాలనుండి సమకూర్చుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేశారు. కానీ సంకల్పం గొప్పదైనప్పుడు విజయం తప్పక వరిస్తుందన్నారు.

జెట్‌సెట్‌గో యజమాని కనిక టెక్రివాల్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే విమానాల పట్ల ఆసక్తి ఉండేదని, ఆ ఆసక్తే తనను అటు వైపు నడిపించిందన్నారు. క్యాన్సర్ బారిన పడ్డతరువాత దాన్ని జయించేందుకు చేసిన ప్రయత్నం జీవితానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. అలా ఎయిర్ ట్రావెల్స్‌లో వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు సిద్ధమై జెట్‌సెట్‌గోను ప్రారంభించినట్లు తెలిపారు. కామిని ట్యూబ్స్ యజమాని పద్మశ్రీ కల్పనా సరోజ్ మాట్లాడుతూ ఒక దళిత కుటుంబంలో పుట్టిన తాను పెద్దగా చదువుకోలేకపోయానని, వైవాహిక జీవితం వైఫల్యంతో జీవితం మరింత మారిందని గుర్తుచేశారు. ఒకనొక దశలో ఆత్మహత్యా యత్నం చేశానన్నారు. కానీ ముంబై వచ్చి చిన్న కంపెనీలో ఉద్యోగిగా చేరి, అటు నుంచి డిజైనింగ్, ఫర్నిచర్, బిల్డర్ ఇలా పలు రంగాల్లోకి ప్రవేశించానన్నారు. నష్టాల్లో ఉన్న కామినీ ట్యూబ్స్ తీసుకొని దాన్ని నిలబెట్టడం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు. కానీ తాను ఆ సంస్థను నిలబెట్టడం వల్ల వందలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నిండినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి ఫ్లో హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు కామిని సరాఫ్ తదితరులు పాల్గొన్నారు.

260
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...