మెరుగైన వైద్యమందిస్తాం

Sun,January 14, 2018 12:10 AM

-నైట్ షెల్టర్ల ప్రారంభోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి
సిటీబ్యూరో, సుల్తాన్‌బజార్, మహిదీపట్నం: రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈ రెండు శాఖల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నిలోఫర్, మహావీర్ దవాఖానల్లో రోగి సహాయకుల కోసం నూతనంగా నిర్మించిన నైట్ షెల్టర్ భవనాలను మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధారణంగా నగరంలోని నిలోఫర్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ దవాఖానలకు వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పేద రోగులు చికిత్స కోసం వస్తుంటారని, అయితే వారి కుటుంబ సభ్యులు దవాఖానలో ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందే సమయంలో రోగి సహాయకులు దవాఖానల పరిసరాల్లోని ఫుట్‌పాత్‌లు, దేవాలయాలు, చెట్లకింద ఆశ్రయం పొందుతుంటారన్నారు.

దీని వల్ల వారు పలు సమస్యలు ఎదుర్కొనేవారన్నారు. ఇది గమనించిన సీఎం కేసీఆర్ ప్రతి దవాఖాన ఆవరణలో రోగి సహాయకులు ఉండేందుకు వీలుగా నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసి, వారికి అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నగరంలోని రద్దీగా ఉండే 15 దవాఖానల్లో రూ.6కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ నైట్‌షెల్టర్లను నిర్మించిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యాధునిక వైద్యపరికరాలు, మౌలిక సదుపాయాలు, శానిటేషన్, సెక్యూరిటీ, ఆధునిక ల్యాబ్‌లు, ప్రసూతి దవాఖానల్లో మోడ్రన్ లేబర్‌రూమ్‌లను నిర్మించినట్లు చెప్పారు. రోగులతో పాటు వారి సహాయకులకు సైతం అన్ని వసతులతో నైట్‌షెల్టర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిలోఫర్‌లో రూ.2.60కోట్లతో మొత్తం 64 మంది బస చేసేందుకు వీలుగా షెల్టర్‌ను నిర్మించారని, త్వరలోనే మరో నాలుగు అంతస్తులు నిర్మించనున్నట్లు వివరించారు.

సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానలో రూ.1.95కోట్లతో 60 మంది బసచేసే విధంగా షెల్టర్‌ను నిర్మించినట్లు చెప్పారు. అదే విధంగా మహావీర్ హాస్పిటల్‌లో రూ.1.42కోట్ల వ్యయంతో 76 మంది బసచేసే విధంగా నైట్‌షెల్టర్‌ను నిర్మించినట్లు మంత్రి వివరించారు. ఫిబ్రవరి నెల వరకు అన్ని దవాఖానల్లో షెల్టర్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం సుల్తాన్‌బజార్ దవాఖానలో నిర్మించిన భవనాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలోని 15 దవాఖానల్లో రోగి సహాయకుల కోసం నైట్‌షెల్టర్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు ప్రస్తుతం మూడు దవాఖానల్లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, అయితే ప్రజలు కూడా అదే బాధ్యతగా సౌకర్యాలను వినియోగించుకోవడంతో పాటు వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డా.రమేష్‌రెడ్డి, నిలోఫర్ సూపరింటెండెంట్ డా.మురళీకృష్ణ, ఆర్‌ఎంవోలు డా.అనురాధ, డా.లల్లూప్రసాద్, రమేష్, డా.సీతారాం, డా.నరహరి బల్దియా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

228
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles