రారండోయ్..పండుగ చేద్దాం


Sat,January 13, 2018 03:38 AM

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో: నేటి నుంచి 3రోజుల పాటుస్వీట్స్, కైట్ ఫెస్టివల్ పరేడ్‌గ్రౌండ్స్‌లో సందడే సందడిఒకే వేదికపై వెయ్యి రకాల స్వీట్లు12 దేశాల నుంచి వస్తున్న కైట్ క్లబ్స్ రాత్రివేళల్లోనూ పతంగుల పండుగ రోజూ లక్ష మంది వస్తారని అంచనాప్రవేశం ఉచితం ఈ పండుగ నగరవాసులకు మరిన్ని సంబురాలను తీసుకువచ్చింది. నేటి నుంచి మూడు రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో స్వీట్స్, కైట్ ఫెస్టివల్‌ను పర్యాటక శాఖ ఘనంగా నిర్వహిస్తున్నది. వివిధ రాష్ర్టాలు, దేశాల ప్రజలు తయారుచేసిన స్వీట్లు దాదాపు 1000 రకాలు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్‌లో 12 దేశాలకు చెందిన కైట్ క్లబ్స్ పాల్గొంటున్నాయి. ఇందులో ప్లాస్టిక్ ఉపయోగించకుండా తయారు చేసిన గాలిపటాలను మాత్రమే ఎగురవేస్తారు. సౌత్ ఆఫ్రికా, సింగపూర్, నెదర్లాండ్స్, చైనా, వియత్నాం, ఇండోనేషియా తదితర దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ ఈ ఫెస్టివల్‌కు వస్తున్నారు. ఈ మూడు రోజులూ నైట్ కైట్ ఫ్లయింగ్ కూడా నిర్వహిస్తారు. చీకట్లోనూ కాంతులు వెదజల్లే గాలిపటాలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకలకు ప్రవేశం ఉచితం. ఈ ఉత్సవాలకు ప్రతిరోజు లక్షమందికి పైగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

భిన్న సంస్కృతుల ప్రజలంతా ఒక్కటిగా ఉండే నగరం హైదరాబాద్. దక్షిణ భారత దేశంలో అనేక భారతీయ భాషా సంస్కృతులు సహజీవనం చేసేది హైదరాబాద్‌లోనే. గంగా జమునా తెహజీబే కాదు భారతీయ వైవిధ్యానికి ఇది చిరునామా. ఈ వైవిధ్యంలోని తీపి రుచులన్నింటినీ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తున్నది రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రపంచ తీపి రుచుల పండుగ నిర్వహిస్తున్నది. నేటి నుంచి మూడు రోజులపాటు కళ్లుచెదిరే, నోరూరించే స్వీట్లతో, ఎగిరే పతంగులతో కనువిందు చేయనున్నది. చారిత్రక, భౌగోళిక, ఆర్థిక కారణాల వల్ల హైదరాబాద్ విభిన్న ప్రాంతాల వారికి ఆవాసంగా ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిర పడిన ఇతర ప్రాంతాల వారితోపాటు ఖండాంతరాల నుంచి వచ్చిన స్థిరపడిన వారూ ఉన్నారు. తమ ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ తమ సామాజిక అస్తిత్వాన్ని
కాపాడుకుంటున్న సమాజాలెన్నో నగరంలో ఉన్నాయి.

భిన్న సంస్కృతు లకు నిలయమైన నగరంలో ఇరాన్ ప్రాంతానికి చెందిన పార్సీలు నిజాంల పాలనా కాలంలో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. వివిధ వ్యాపారాల్లో స్థిరపడిన పార్సీలు విద్యా రంగంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. తమ జీవన విధానాన్ని ఆచరించేందుకు ప్రత్యేకమైన సామాజిక కేంద్రాలను ఏర్పాటు చేసుకుని నగర జీవితంలో భాగమయ్యారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉదారతతో వారంతా ఇక్కడే వివిధ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఇడ్లీ.. సాంబార్.. బోండా.. ఛాయ్

నిజాం కాలంలో చేపట్టిన రైల్వేలైను నిర్మాణం కోసం, బ్రిటీష్ ఆర్మీలో సేవలించేందుకు వచ్చిన తమిళులు, మలయాళీలు తొలినాళ్లలో సికింద్రాబాద్‌లో స్థిరపడి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించారు. కేరళీయులు ఖైరతాబాద్ కేంద్రంగా దశాబ్దాల నుంచి తమ సామాజిక ఐక్యతను, సాంస్కృతిక వికాసం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .

టేస్ట్ ఆఫ్ ఇండియా!

నిజాం - హైదరాబాద్ స్టేట్‌లో బీదర్, ఔరంగబాద్ మొదలైన ప్రాంతాలున్నాయి. మరాఠా, కన్నడ ప్రజలు విద్య, ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్య నగరంలో స్థిరపడ్డారు. నగరంలో ఏర్పాటు చేసిన కేంద్రీయ పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలతో ఆయా సామాజిక వర్గాల జనాభా పెరిగింది. నిజాం కాలంలోనే నగరంలో వివిధ రంగాల్లోకి బెంగాలీలు ప్రవేశించారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలుగా పనిచేసిన కవయిత్రి సరోజనీ నాయడు తండ్రి నిజాం ఆహ్వానంతోనే నిజాం కళాశాల నిర్వహణ బాధ్యత స్వీకరించారు. ఇలా స్థిరపడిన బెంగాలీలెందరో నేటినీ నగరంలో జీవిస్తున్నారు. రామకృష్ణ మఠం వద్ద వీరి సాంస్కృతిక కేంద్రం ఉంది. కన్నడ తీపి రుచులకు పేరుగాంచిన అయ్యంగార్ బేకరీలో లభించే బాదం హల్వా, పైనాపిల్ కేసరి బాత్, కొబ్బరిపొడి లడ్డూలు, గుడన్న, కప్ బర్ఫీ, ఉరాద్ దాల్ లడ్డూ, అవాల్ లడ్డూ, కర్జికాయ్, మరాఠీల గులాబీ జామ్ మొదలైన ఎన్నో నోరూరించే ఐటమ్స్‌ని అందించేందుకు సిటీలోని హోటళ్లు, స్వీట్స్ షాప్‌లు ఈ ఫెస్టివల్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి.

మిఠాయి వాటికలు

నిజాం కాలంలో నగరంలో చిల్లర వర్తకం నిర్వహించేందుకు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలకు చెందిన ఎందరో వ్యాపారులు వచ్చారు. రైల్వే సదుపాయం ఏర్పడడంతో సుదూర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చి విక్రయించే వెసులుబాటు రావడంతో ఉత్తరాదికి చెందిన వ్యాపార సమాజాలు ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. మిఠాయిల తయారీలో గుజరాతీ సంస్థ లు నగరంలో చాలా పేరు తెచ్చుకున్నాయి. ఉత్తరాది స్వీట్స్ అనగానే మిఠాయి వాటిక, బికనీర్‌వాల మొదలైనవి ఉన్నాయి. గుజరాతీ తీపి రుచులనగానే గుర్తొచ్చే పురాన్‌పోలి, కాది, సుఖాది, మొదలైనవెన్నో వందల వంటకాలను ఆరగించొచ్చు.

తీపి కబురు

ఈ వేడుకలో ప్రవేశం ఉచితంగా ఉంది. ఇక తినుబండారాలం టటారా? నామమాత్రపు ధరలకే అమ్ముతారు. మార్కెట్లో అమ్మే ధరల కంటే ఇక్కడి స్టాళ్లలో తక్కువ ధరకు కొనుక్కోవచ్చని అధికారులంటున్నారు.

ప్లాస్టిక్హ్రిత పతంగులకే స్థానం ..

సంక్రాంతి పండుగను భారత దేశంలో వివిధ పేర్లతో పిలుస్తారు. లోహ్రి, సుకరాత్, భోగాలి బిహు, పొంగల్ మొదలైన పేర్లతో పిలిచే సంక్రాంతిని అందరూ మూడు రోజులపాటు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో పిల్లలు, పెద్దలు గాలి పటాలను సామూహికంగా ఎగురవేస్తారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మూడవ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నది. పరేడ్ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించే ఈ కైట్ ఫెస్టివల్‌లో 12 దేశాలకు చెందిన కైట్ క్లబ్స్ పాల్గొంటున్నాయి. ఈ ఫెస్టివల్ పూర్తిగా పర్యావరణ హితమైన కార్యక్రమం. ప్లాస్టిక్ ఉపయోగించకుండా తయారు చేసిన గాలిపటాలను మాత్రమే ఎగురవేస్తారు.బాలికా విద్యను ప్రోత్సహించండి.. ఆమె ఈ ప్రపంచాన్ని మారుస్తుందనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ పలు సామాజిక విషయాలపై అవగాహన కల్పించేలా గాలిపటాల రూపొందించడంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకకు చైనా, వియత్నాం, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, సింగపూర్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కైట్ ఫ్లయర్స్ వస్తున్నారు.

కైట్ క్రాప్ట్స్...

ఈ కార్యక్రమంలో కేవలం గాలిపటాలను ఎగురవేయడమే కాదు. గాలిపటాల తయారీ గురించి ఓ వర్క్‌షాప్‌నిర్వహిస్తారు. వివిధ దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ విభిన్న రూపాల గాలిపటాల తయారీ విధానం, వాటిని ఎగురవేసేందుకు అనుకూలంగా ఉండేందుకు పాటించాల్సిన మెళకువలను ఇందులో వివరిస్తారు. ఈ పండుగ మూడు రోజులూ ముచ్చటగా రాత్రి వేళల్లోనూ నైట్ కైట్ ఫ్లయింగ్ నిర్వహిస్తారు. చీకటిలోనూ కాంతి వంతంగా కనిపించేలా రూపొదించిన గాలిపటాలు ఈ వేడుకలో కనువిందు చేస్తాయి.

509
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...