ఉక్కు సంకల్పం


Sat,January 13, 2018 03:32 AM

-పనుల ప్రతిష్టంభనపై ప్రభుత్వం దృష్టి
-ధరలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు
-ఇసుక ధరల మాదిరిగా ఇప్పుడు స్టీల్‌పై నజర్
-సరుకు ధరలపై అధ్యయనం
-నివేదిక కోరిన ముఖ్య కార్యదర్శి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : స్టీల్ ధరల పెరుగుదల కారణంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం పనుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ధరల పెరుగుదలకు కారణాలను లోతుగా అధ్యయనంచేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను జీహెచ్‌ఎంసీ అధికారులకు అప్పగించింది. ఇప్పటికే సిమెంటును మార్కెట్ ధరకన్నా దాదాపు రూ. 100తక్కువకు సరఫరా చేస్తుండగా, ఇసుకను ఉచితంగా ఇస్తున్నారు. ఇదేబాటలో ఇప్పుడు స్టీలు ధరలపై దృష్టి కేంద్రీకరించారు. స్టీల్ ధర వ్యవహారం తేలితే ఇళ్ల నిర్మాణం స్పీడందుకునే అవకాశముంది. నగరంలోని పేదలకోసం ఈ ఏడాది ఒక లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు 113 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణం కోసం దశలవారీగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఇందులో నాచారంలోని సింగంచెరువు తండ వద్ద చేపట్టిన 176ఇళ్ల కాలనీ ఇప్పటికే పూర్తయిపోయింది. మరో మూడునాలుగు కాలనీల్లో పనులు తుదిదశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నాయి. అయితే 90వేలకుపైగా ఇళ్లు ఇప్పుడిప్పుడే పునాదులు, పిల్లర్ల స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అకస్మాత్తుగా స్టీల్ ధరలు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లరు చేతులెత్తేశారు. పెరిగినమేరకు అధిక ధర చెల్లిస్తే పనులు చేపడతామని చెబుతున్నారు. కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం జీహెచ్‌ఎంసీ స్టీలు ధర ప్రతి టన్నుకు రూ. 34వేలవరకూ చెల్లించనుంది. అయితే ఈ ధర ఇప్పుడు సుమారు రూ. 48వేలకు చేరుకుంది. ఒక్కో ఇంటికి దాదాపు 2.8టన్నుల వరకూ స్టీలు పడుతుందని, పెరిగిన ధరలవల్ల ఒక్కో ఇంటికి అదనంగా దాదాపు 35వేల వరకూ భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

నగరంలో ఒక్కో డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి రూ. 7.75 నుంచి 8.00లక్షల వరకు ధర నిశ్చయించడంతో పెరిగిన స్టీలు ధరలు కాంట్రాక్టర్లు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మున్సిపల్ వ్యవహారాలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోగానికి కారణాలను గుర్తించి మందు వేయాలనే చందంగా స్టీల్ ధరల పెరుగుదలపై సమగ్రంగా అధ్యయనం చేసి వారంలోగా నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆయన ఆదేశించారు. ముడిసరుకు ధరలు గతంతో, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, స్టీల్ ధర పెరగడానికి కారణాలు ఏమిటీ అనే అంశాలను క్షుణ్ణంగా అధ్యయనంచేయాలని ఆయన స్పష్టంచేశారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వపరంగా తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణంలో ప్రధాన అంశమైన సిమెంటు ధరలను ప్రభుత్వం రూ. 230గా ఖరారుచేసిన విషయం విదితమే.

మార్కెట్ ధర దాదాపు రూ.330వరకూ ఉన్నప్పటికీ సిమెంటు కంపెనీలు డబుల్ బెడ్‌రూమ్ పథకానికి ఇదే ధరకు సరఫరా చేస్తున్నాయి. అంతేకాదు, ఇసుకను సైతం గోదావరి, కృష్ణ నదులనుంచి ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో ప్రధాన అంశమైన స్టీల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టారు. దీంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం స్పీడుకు ఎటువంటి అవరోధాలూ ఏర్పడే అవకాశం లేదని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే కాంట్రాక్టర్లు ప్రీకాస్టింగ్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల వ్యయం ఇలా...
నగర పేదలకు ఈ ఏడాది చేపట్టిన ఇళ్లు : 1లక్ష
ఒక్కో యూనిట్ వ్యయం : రూ. 7.75లక్షల నుంచి 8.00లక్షలు
మౌలిక సదుపాయాలకు : 75.00వేలు
ఒక్కో ఇంటికి అవసరమయ్యే స్టీలు : 2.8టన్నులు
ఇప్పటికే చేపట్టిన పనులకు కొనుగోలు చేసింది : 40వేల టన్నులు
ఇంకా కొనుగోలు చేయాల్సింది : 2.4లక్షల టన్నులు
సిమెంటు ధర : రూ. 330
ఇసుక : ఉచితం (కృష్ణ, గోదావరి నదుల నుంచి)

278
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...