నెలాఖరు నాటికి స్వయం ఉపాధి రుణాలను గ్రౌండింగ్ చేయాలి


Sat,January 13, 2018 03:29 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఈ నెలాఖరు నాటికి జిల్లాలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించిన గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ, అటవీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వెనుకబడిన తరగతుల (బీసీ)లకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.45కోట్లను విడుదల చేసిందన్నారు. బీసీల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న స్వయం ఉపాధి పథకాల గ్రౌండింగ్‌కు సంబంధించి శుక్రవారం ఆదిలాబాద్ నుంచి మంత్రి జోగురామన్న, సచివాలయం నుంచి బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ఈ రుణాల గ్రౌండింగ్‌పై దృష్టి సారించి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో రుణాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2017-18 సంవత్సరానికి గాను స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి రూ.వెయ్యి కోట్లు, రజక, నాయిబ్రాహ్మణుల సంక్షేమానికి రూ.250 కోట్ల చొప్పున ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించడం జరుగుతుందన్నారు. దోబీఘాట్ల నిర్మాణాలకు రూ.50కోట్లు, వృత్తి నైపుణ్యంలో శిక్షణకు గాను రూ.20 కోట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి గ్రౌండింగ్‌ను పూర్తి చేయాలన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం అర్హులకు వివాహ సమాయానికి ఆర్థిక సాయం అందించాలన్నారు. బీసీ హాస్టళ్లలో ఆశ్రయముంటూ విద్యనభ్యసించే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారు మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సందర్భంగా మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి స్పందిస్తూ 2015-16 సంవత్సరానికి 116 మంది లబ్ధిదారులకు రూ.కోటికి పైగా రుణాలను గ్రౌండింగ్ చేయడం జరిగిందని, త్వరలోనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా బీసీల అభివృద్ధి శాఖ అధికారి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

297
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...