వందేళ్లక్రితమే గ్రంథాలయాలు


Fri,December 8, 2017 02:29 AM

-1872లో సిటీలో తొలి లైబ్రరీ ఏర్పాటు
-భాషాభివృద్ధిలో వీటిదే కీలకపాత్ర
-అన్ని ఉద్యమాలకు ఇక్కడే పునాది
శతాబ్దాలకు పూర్వమే ఇక్కడ అక్షరాలు అచ్చులోకి తర్జుమా అయ్యాయి. సాహిత్యం స్వేచ్ఛా విహారం చేసింది. ఉద్యమంలా మొదలైన అక్షరయానం నగరాన్నే ఓ పుస్తక భాండాగారంగా మార్చింది. భాషా నిలయాలు, గ్రంథాలయాలు, ముద్రణ సంస్థలు, విక్రయ సంస్థలతో మొదలై ఇప్పుడు డిజిటల్ లైబ్రరీల స్థాయికి చేరుకుంది. అది తెలుగు భాషా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఉద్యమ ప్రస్థానం. కేవలం 3 శాతం అక్షరాస్యత గల నిజాం రాజ్యంలో విద్యావ్యాప్తికి దోహదపడింది గ్రంథాలయోద్యమమే. పాలనా వ్యవహారాల్లో ఉర్దూ అధికార భాషాగా ఉండడం, తెలుగు భాషకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని గ్రంథాలయాలే భర్తీ చేశాయి. వందేళ్లకు ముందే ఈ నేలపై వెలసిన గ్రంథాలయాలు.. తెలుగు భాషా వైభవాన్ని సమున్నతంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి.

అక్షరయానం
పాతబస్తీ నుంచి మొదలైన ప్రస్థానం.. కాగితాలపై.. దాదాపు శతాబ్దంన్నరకు ముందే నగరంలో ముద్రణాలయాలుండేవి. తొలి రోజుల్లో బండలతో అక్షరాలు చెక్కి వాటితో కాగితాలపై అచ్చువేసేవారు. అలా పాతబస్తీలో ఉర్దూ సాహిత్యాన్ని ముద్రించేవారు. ఈ క్రమంలోనే... తెలుగుభాషా వికాసం కోసం నగరంలో గ్రంథాలయాలు ఆరంభమయ్యాయి. తొలినాళ్లలో సాహిత్యాన్ని ప్రజల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర వహించింది గ్రంథాలయాలే. నగరంలో తొలి గ్రంథాలయాన్ని 1872లో సోమసుందర మొదలియార్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు. 1895లోనే నగరంలో అసఫియా లైబ్రరీ, సికింద్రాబాద్‌లో ఆల్బర్ట్ రీడింగ్ రూంలు ఉండేవి. అణా గ్రంథమాల, దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన పుస్తకాలను పాఠకులు ఎక్కువగా గ్రంథాలయాల్లోనే చదివేవారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికను తెలుగు పాఠకులకు సాహిత్యాన్ని మరింత దగ్గరచేసింది.

భాషా నిలయం
1901కంటే ముందే తెలంగాణలో పాతికకు పైగా గ్రంథాలయాలుండేవని అంచనా. 1872లో సికింద్రాబాద్, కవాడిగూడ ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. 1891లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ప్రారంభమైంది. ఇలా చాలా సంస్థలు ప్రారంభమైనప్పటికీ 1901 సెప్టెంబర్ 1న ప్రారంభమైన శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం తెలంగాణ వ్యాప్తంగా గ్రంథాలయాల ఏర్పాటు స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసంలో ఈ భాషా నిలయం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. పాల్వంచ సంస్థానాధీశులు పార్థసారథి అప్పారావు, రాజు నాయిని వెంకట రంగారావు, ఆదిపూడి సోమనాథ రాయులు, హైదరాబాద్ జాగీర్దార్ రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు ఈ సంస్థ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. దీని స్ఫూర్తితోనే తెలంగాణవ్యాప్తంగా గ్రంథాలయాలు, భాషా నిలయాలు వెలిశాయి. 1904లో హనుమకొండలో రాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయం, ఖమ్మంలో ఆంధ్ర భాషా నిలయం... ఇలా సూర్యాపేట, నల్లగొండ, వరంగల్ అన్ని ప్రాంతాల్లోనూ భాషా నిలయాలు వెలిశాయి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం కేవలం పుస్తకాలు, పత్రికలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికే కాదు.. సాహితీ సమావేశాలకు, తెలంగాణ సాహితీ వికాసానికి ఎంతో కృషి చేసింది.

వేమనాంధ్ర భాషా నిలయం
1923 అక్టోబర్ 1న అంబర్ బజార్ ఫీల్‌ఖానాలో కొండా వెంకట రంగారెడ్డి వేమనాంధ్ర భాషా నిలయాన్ని ప్రారంభించారు. 1927లో ఈ భాషా నిలయాన్ని నాంపల్లిలోని ఒక అద్దె ఇంట్లోకి మార్చారు. నగర పాఠకుల కోసం పలు వార, మాస పత్రికలను అందుబాటులో ఉంచడంతో పాటు ఊరూరా తిరిగి పుస్తకాలను సేకరించేవారు. నెలనెలా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసింది వేమనాంధ్ర భాషా నిలయం. 1980 నాటి ముప్పై వేలకు పైగా పుస్తకాలుండేవి. సంస్కృతం, తెలుగు, చరిత్ర పరిశోధనలు, నవలలు, కథలు వంటి అన్ని సాహితీ ప్రక్రియల్లో సాహిత్యం అందుబాటులో ఉండేది. ఇలా.. గ్రంథాలయాలు కేవలం విజ్ఞాన నిలయాలుగానే కాక సాంఘిక ఉద్యమాలకు కేంద్రాలుగా నిలిచాయి. ఉర్దూభాషా ఆధిపత్యం కొనసాగుతున్న కాలం లో ప్రజలకు తెలుగును చేరువచేయడంతో పాటు సాహితీ వికాసానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదం చేశాయి. ఈ క్రమంలోనే నగరంలో ఎన్నో ప్రచురణ సంస్థలు ఏర్పాటయ్యాయి. అణాగ్రంథమాల వంటి ప్రచురణ సంస్థలు విశేష కృషి చేశాయి. నగరంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆధునిక గ్రంథాలయాలు.. డిజిటల్ పుస్తకాలు చేస్తున్న కృషి కంటే...విశేష కృషిని నాటి గ్రంథాలయోద్యమం చేసింది.

సాహితీ కరచాలనం
- నగరంలో తొలి గ్రంథాలయాన్ని 1872లో సోమసుందర మొదలియార్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు.
- 1878 కవాడిగూడ ప్రాంతంలో ముదిగొండ శంకరాచార్య శంకరానంద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
- 1891లో మౌల్వి అబ్దుల్ ఖయ్యుం అఫ్జల్‌గంజ్‌లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించారు. అప్పట్లోనే లక్షల పుస్తకాలు ఇందులో ఉండేవి.
- 1896లో భారత గుణవర్థక సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా 1896లో బొల్లారంలో గ్రంథాలయాన్ని స్థాపించారు.
- 1905లో సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయం, బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయం, శ్రీ వేమన భాషా నిలయం నెలకొల్పారు. వీటన్నింటికీ.. ప్రేరణ.. ఆంధ్ర భాషా నిలయమే..
- 1906లో విజ్ఞానచంద్రికా గ్రంథమాల ప్రారంభమైంది. ఈ గ్రంథమాల ద్వారా నవలలు, విజ్ఞాన శాస్త్ర విషయాలు, జీవిత చరిత్రలను ప్రచురించింది.
- శాలిబండలో 1897లో భారత గుణవర్థక సంస్థ ఏర్పాటుతో తెలుగు పుస్తకాల ముద్రణ ఆరంభమైంది.
- 1913లో అడుసుమిల్లి వెంకట దత్తాత్రేయ శర్మ స్వయంగా పలు పుస్తకాలు రాసి ముద్రించారు.
- 1922లో గౌలిగూడ చమన్‌లో బాల సరస్వతి ఆంధ్రభాష నిలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతి పునరుద్ధరణ, చదివే అలవాటును పెంపొందించే లక్ష్యంతో ఈ నిలయాన్ని ప్రారంభించారు.

- 1923లో వేమనాంధ్ర భాషా నిలయం ప్రారంభమైంది.
- 1924 నుంచి బాల సరస్వతి అనే లిఖిత మాస పత్రికను కోదాటి రామకృష్ణారావు నిర్వహించారు.
- 1931ల్లో అరుంధతి గ్రంథమాల పలు పుస్తకాలను ప్రచురించింది.
- 1938లో చంద్రసేన్ గుప్తా, వెల్దుర్తి మాణిక్యరావు అణా గ్రంథమాలను ప్రారంభించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి, రైతు వంటి పుస్తకాలను ప్రచురించారు. ప్రజల్లోకి సాహిత్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రతి పుస్తకాన్ని అణాకే విక్రయించేవారు.
- 1938లో వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధ్దారక గ్రంథమాలను ప్రారంభించారు. ఈ సంస్థ తరపున తొలి పౌరహక్కుల పుస్తకాన్ని ప్రచురించారు. ఉదయ సంధ్యలు, తెలంగాణం, పరిచయాలు కథల సంపుటి వంటి పలు పుస్తకాలు ముద్రించి స్వయంగా ఆయనే అన్ని గ్రంథాలయాలకు చేర్చేవారు.

336
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...