తేడా వస్తే.. నిలిపివేతే


Thu,December 7, 2017 02:29 AM


-నిబంధనలకు లోబడి నిర్మాణం జరగాల్సిందే
-అన్ని దశల్లోనూ కచ్చితంగా తనిఖీలు
-ప్రమాదాల నివారణకు బల్దియా చర్యలు
సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ప్రమాదాలను నివారించేందుకు బల్దియా విస్తృత చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు రిస్క్ బేస్డ్ ఇన్‌స్పెక్షన్స్(ప్రమాద ఆధారిత తనిఖీలు)ను నిబంధనల్లో చేర్చారు. దీనిప్రకారం భవనాలను హైరిస్క్, మీడియం రిస్క్, లోరిస్క్‌గా విభజించి, ఏఏ దశలో తనిఖీలు నిర్వహించాలో నిర్ధారించనున్నారు. ఈ తనిఖీల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్, యజమాని తదితరులు పాల్గొంటారు. తనిఖీ నివేదిక ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం తదుపరి నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. నిబంధనల ప్రకారం లేకపోతే నిర్మాణం ఆపాల్సిందే.

ఇంటి అనుమతి పొందితే నిర్మాణం పూర్తయితే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకునే వరకూ దానివైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఇంతకాలం కొనసాగింది. ఇందుకు భిన్నంగా ఇప్పుడు నిర్మాణం వివిధ దశలను తనిఖీలు చేస్తూ ఎక్కడైనా తేడా వస్తే తదుపరి నిర్మాణాలను అడ్డుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డీపీఎంఎస్‌లో సరికొత్త నిబంధనను చేర్చారు. నిర్మాణదశలో ఉన్న భవనాల వద్ద ప్రమాదాలను నివారించడమే దీని ప్రధాన ధ్యేయంగా అధికారులు చెబుతున్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజ్‌నెస్(ఈవోడీబీ) కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీలో కొంతకాలంగా (డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీపీఎంఎస్))పేర ఇంటి అనుమతుల్లో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటి అనుమతి దరఖాస్తు దగ్గర్నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను జారీచేసే వరకు అన్నీ ఆన్‌లైన్ విధానంలోనే జరుపుతున్నారు. తాజాగా రిస్క్ బేస్డ్ ఇన్‌స్పెక్షన్స్(ప్రమాద ఆధారిత తనిఖీలు)ను నిబంధనల్లో చేర్చారు. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న భవనాన్ని నిర్దేశిత నిబంధనల ప్రకారం వివిధ దశల్లో తనిఖీలు నిర్వహించి మంజూరైన అనుమతుల ప్రకారం అన్నీ సవ్యంగా ఉంటేనే తదుపరి నిర్మాణాలను అనుమతించాలని, లేనిపక్షంలో అక్కడే నిర్మాణాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు.

తనిఖీల ప్రక్రియ ఇలా...

భవనాలను హైరిస్క్, మీడియం రిస్క్, లోరిస్క్ భవనాలుగా మూడు రకాలుగా విభజించనున్నారు. అలాగే ఏఏ దశలో తనిఖీలు నిర్వహించాలో, ఎన్నిరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలో నిర్దారించనున్నారు. అలాగే హైరిస్క్ భవనాల తనిఖీ పకడ్బందీగా ఉంటుంది. జన సమర్థం అధికంగా ఉండడంతో పాటు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న భవనాలను ఈ శ్రేణిలో చేర్చుతారు. అలాగే తనిఖీల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్, యజమాని తదుతరులు పాల్గొంటారు. తనిఖీ అనంతరం నివేదిక ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాతే తదుపరి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది. ఉదాహరణకు పిల్లర్ల స్థాయివరకు ఒక దశ అనుకుంటే, అధికారులు గడువులోగా దాన్ని తనిఖీచేసి ఆన్‌లైన్‌లో నివేదికతోపాటు నిర్మాణ ఛాయాచిత్రాలు సమర్పిస్తే వాటి ఆధారంగా పిల్లర్ల అనంతర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. నిర్దారిత గడువులోగా తనిఖీలు చేపట్టని పక్షంలో దరఖాస్తులో పేర్కొన్న ఇంటి యజమానులు, బిల్డర్ల మొబైల్ ఫోన్‌కు తనిఖీలు పెండింగ్‌లో ఉన్నట్లు ఎస్‌ఎంఎస్ వెళ్తుంది. రిస్క్ బేస్డ్ ఇన్‌స్పెక్షన్ల వల్ల ప్రమాదాలను అరికట్టడమే కాకుండా నిర్మాణ రంగాన్ని చాలావరకు గాడిలో పెట్టే ఆస్కారం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రమాదాల నివారణకే..

సెల్లార్ల కోసం జరిపే తవ్వకాల్లో పని చనిపోతుండగా, కొన్ని నిర్మాణాలూ కూలి మృత్యువాత పడుతున్నారు. ఇటీవల నానక్‌రామ్‌గూడలో ఓ నిర్మాణ భవనం కూలి పలువురు కూలీలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అది పూర్తిగా అక్రమ భవనమని విచారణలో తేలడం విశేషం. అంతేకాదు, ఇచ్చిన అనుమతి నమూనాలకు, జరిపే నిర్మాణాలకు పొంతన ఉండడం లేదు. ఇష్టారాజ్యంగా డీవియేషన్లకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్మాణాలపై నిఘా లేకపోవడమేనని అధికారులు గుర్తించారు. తరుచూ ప్రమాదాలు జరగడమే కాదు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. క్రమబద్ధీకరణ పథకానికి ప్రతిసారి లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

669
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...