రూ. 17 లక్షలు సమర్పించుకున్నాడు


Thu,December 7, 2017 02:26 AM

-ఫేస్‌బుక్‌లో విదేశీ మహిళ పరిచయం
-ముక్కూ మొహం తెలియకున్నాసంభాషణలు.. ఆపై స్నేహం
-డబ్బు ఆశ చూపగానే గుడ్డిగా నమ్మాడు
-నూనె వ్యాపారం పేరుతో రూ.17 లక్షలు డిపాజిట్
-సైబర్ చీటర్ల వలలో రాంకోఠి వ్యాపారి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఓ మహిళ నూనె వ్యాపారం పేరుతో రాంకోఠికి చెందిన ఓ వ్యాపారికి రూ.17 లక్షలు టోకరా వేసింది.
తక్కువ ధరకు ఇండియాలో నూనె కొని, ఎక్కువ ధరకు ఇంగ్లాండ్‌కు పంపించాలంటూ నమ్మించి మోసానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే... రాంకోఠిలో ఆదినారాయణ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఎల్జిబెత్ జోన్స్ రేయి అనే ఓ మహిళ పరిచయం అయ్యింది. చాటింగ్ చేస్తూ ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ నీకు ఒక వ్యాపారానికి చెందిన ఐడియా చెబుతానంటూ నమ్మించింది. తాను ఇంగ్లాండ్‌లో ఫార్మషూటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ కంపెనీకి ఇచికు వా రిజర్వుడ్ ఆయి ల్ అవసరముంటుందని, ఇండియాలో దానిని నేను 2300 డాలర్లకు ఒక లీటర్ కొని, దానిని ఇక్కడ 4300 డాలర్లకు విక్రయిస్తున్నాని చెప్పింది. ఇటీవల తనను డిపార్టుమెంట్ మార్చారని, మా కంపెనీ యజమాన్యానికి ఈ విషయం తెలిస్తే తనకు సమస్య వస్తుందని నమ్మించింది.

అందుకు నీవే ఈ వ్యాపారం చేసి, అయిల్ కొని ఇక్కడికి పంపిస్తే మంచి వ్యాపారమవుతుందంటూ అతనిలో ఆశ కల్గించింది. ఆ కాంట్రాక్టు ఇప్పించే బాధ్యత తనదేనని, ఇందుకు వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తనకు ఇవ్వాలంటూ కోరింది. దీనికి అతను ఒప్పుకున్నాడు. మా కంపెనీకి 4700 డాలర్లకు ఒక లీటర్ పంపిస్తానంటూ ఒక కొటేషన్ పంపించూ.. నేను మా మేనేజింగ్ డైరెక్టర్‌తో మాట్లాడి నీకు కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ నమ్మించడంతో నారాయణ ఈమెయిల్ చేశాడు. ఈ అగ్రిమెంట్‌కు కంపెనీ ఒప్పుకుంది. అయితే ముందుగా మీ వద్ద ఉన్న ఆయిల్ శాంపిల్‌ను తనిఖీ చేయాలని, ఇద్దరు వ్యక్తులు ఇండియాకు వచ్చి తనిఖీ చేస్తారని మెయిల్ వచ్చింది. అప్పటికే చాటింగ్ చేసిన యువతి ఇండియాలో ఆయిల్ సరఫరా చేసేవారి ఫోన్ నెంబర్‌ను ఇచ్చింది. దీంతో ఆదినారాయణ ఆ నెంబర్‌కు ఫోన్ చేసి రెండు లీటర్ల ఇచికు వా ఆయిల్ కావాలన్నా డు. అయితే రెండు లీటర్లకు 2300 డాలర్ల చొప్పున బ్యాంకులో రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే ఆయిల్‌ను పంపిస్తామంటూ చెప్పారు. దీంతో వెంటనే అతను రూ. 3 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయడంతో రెండు లీటర్ల నూనెను పంపించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చి....
ఇంగ్లాండ్‌లోని కంపెనీ నుంచి ఆయిల్‌ను తనిఖీ చేయడా నికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన నైజీరియన్ ఆదినారాయణతో మాట్లాడి, అక్కడే రెండు లీటర్ల నూనెలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మీరు శాంపిల్‌గా పంపించిన ఆయిల్ చాలాబాగుందని, మేం ఇంగ్లాండ్‌లోని కంపెనీకి నివేదికను పంపించామని తెలిపారు. దీంతో ఆదినారాయణకు కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఫోన్ చేసి మీరు ఇచ్చిన శాంపిల్స్ చాలాబాగున్నాయని, మాకు వెంటనే 179 లీటర్ల నూనెను పంపించాలంటూ కంపెనీ ఎండీ కోరాడు. దీంతో తాను అంత పెద్ద మొత్తంలో పంపించలేనని, ముందుగా 10 లీటర్లు పంపిస్తానంటూ ఆదినారాయణ బేరం కుదుర్చుకున్నా డు. దీనికి సైబర్‌చీటర్లు ఒప్పుకున్నారు. దీంతో 10 లీటర్ల అయిల్ కావాలంటూ ఢిల్లీలో ఉన్న వ్యక్తికి ఫోన్ చేయడంతో, తమకు రూ. 14 లక్షలు డిపాజిట్ చేస్తే.. 10 లీటర్ల నూనె పంపిస్తామంటూ చెప్పగా, ఆడబ్బును డిపాజిట్ చేశాడు. డబ్బులు డిపాజిట్ చేసిన తరువాత అందరి ఫోన్లు స్విచ్‌అఫ్ అయ్యాయి. ఫేస్ బుక్, కంపెనీ ఎండీ, ఆయిల్ సరఫరా, శాంపిల్ సేకరణ అంతా ఒకే ముఠా చేసిందని గుర్తించి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.

473
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...