వడివడిగా..అడుగులు


Tue,November 14, 2017 01:01 AM

-పాదచారుల వంతెనల్లో ఐదింటికి లైన్ క్లియర్
-55 ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు
-11 ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి
-అవసరమైన చోట్ల స్వంతంగా నిర్మించేందుకు బల్దియా సన్నాహాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో పాదచారులకు ఇక్కట్లు తొలగించేందుకు బల్దియా విస్తృత చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ప్రమాదకరమైన 55 ప్రాంతాలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు బల్దియాకు ఆ జాబితా అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించి 11 చోట్ల ఖరారు చేసింది. ఇందులో ముఫకంజా కాలేజ్ వద్ద పనులు తుదిదశకు చేరినట్లు అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి టెంపుల్ బస్టాప్, మియాపూర్ ఓల్డ్ బస్‌స్టాప్ వద్ద పనులు వేగంగా కొనసాగుతుండగా, మదీనగూడ, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే నిర్మాణానికి ఎవరూ ముందుకురాని ప్రదేశాల్లో అత్యవసరమైన వాటిని గుర్తించి అవసరమైతే తామే పనులు ప్రారంభిస్తామని బల్దియా అధికారులు తెలిపారు. ఈ పాదచారుల వంతెనలు పూర్తయితే గ్రేటర్ శోభ రెట్టింపవుతుంది.

నగరంలో కొత్తగా మరో ఐదు పాదచారుల వంతెన(ఎఫ్‌ఓబీ)లు నిర్మాణం కానున్నాయి. మొత్తం పదకొండు ప్రాంతాల్లో నిర్మించేందుకు కాంట్రాక్టులు ఖరారు కాగా, ఐదుచోట్ల పనులకు లైన్‌క్లియర్ అయింది. ఇందులో ఒకచోట ఇప్పటికే పనులు తుదిదశకు చేరుకోగా, మరో రెండుచోట్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరో రెండు ప్రాంతాల్లో నేడో రేపో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన ఆరు ప్రాంతాల్లో ఎస్‌ఆర్‌డీపీ, హెచ్‌ఎంఆర్ ైఫ్లెఓవర్లతోపాటు నీటి పైప్‌లైన్లు, స్థానికుల అభ్యంతరాలతో పనులు చేపట్టలేదు. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువశాతం రోడ్డు దాటుతుండగానే జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు 55 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి ఆయాచోట్ల ఎఫ్‌ఓబీలు నిర్మించాలని జీహెచ్‌ఎంసీకి గతంలో సిఫారసు చేశారు.

దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వారు సూచించిన ప్రాంతాల్లో పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో ఎఫ్‌ఓబీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసి టెండర్లు పిలవగా, పదకొండు ప్రాంతాల్లో నిర్మించేందుకు కాంట్రాక్టులు ఖరారయ్యాయి. ఇందులో ముఫకంజా కాలేజ్ వద్ద ఎటువంటి సమస్యలూ లేకపోవడంతో ముందుగా పనులు చేపట్టారు. అక్కడ ప్రస్తుతం పనులు తుదిదశకు చేరినట్లు అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి టెంపుల్ బస్టాప్, మియాపూర్ ఓల్డ్ బస్‌స్టాప్ వద్ద సైతం పనులు శరవేగంగా కొనసాగుతుండగా, మదీనగూడ, ఈసీఐఎల్‌లలో నేడో రేపో పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఆరు ప్రాంతాల్లో హెచ్‌ఎంఆర్, ఎస్‌ఆర్‌డీపీ, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్, స్థానికుల అభ్యంతరాలు తదితర కారణాలతో పనులకు మోక్షం కలుగలేదు. మరో 44చోట్ల పనులు చేపట్టాల్సి ఉండగా, అనివార్యమైన ప్రాంతాల్లో రెండోదశలో పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండోదశలో మరికొన్ని ప్రాంతాల్లో...

ప్రకటనలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే యాడ్ ఏజెన్సీలు పనులు చేపట్టేందుకు ముందుకొస్తున్నట్లు, గిరాకీ లేనిచోట్ల స్పందన ఉండడంలేదని అధికారులు తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా అనివార్యమైన ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో కాకుండా తామే సొంతంగా నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో అత్యవసరమైన ప్రాంతాలను ఎంపికచేసి రెండోదశలో వాటిని చేపడతామన్నారు.

11ఎఫ్‌ఓబీల పురోగతి వివరాలు....

-బంజారాహిల్స్ రోడ్ నెం-2లోని ముఫకంజా కాలేజ్ వద్ద తుదిదశకు చేరిన పనులు.
-మియాపూర్ ఓల్డ్ పోలీస్‌స్టేషన్, కూకట్‌పల్లి టెంపుల్ వద్ద పురోగతిలో పనులు.
- మదీన్‌గూడ లక్ష్మీవిలాస్ రెస్టారెంట్, ఈసీఐఎల్ బస్టాప్ వద్ద త్వరలో పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు.
-శిల్పారామం, కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌లోని ఫోరం సుజనామాల్ ప్రాంతాల్లో ఎస్‌ఆర్‌డీపీ పనుల అడ్డంకి.
-గచ్చిబౌలి దివ్యశ్రీ ఎన్‌ఎస్‌ఎల్ సెజ్, మాదాపూర్ సైబర్ టవర్ జంక్షన్‌ల వద్ద ప్రతిపాదిత హెచ్‌ఎంఆర్ ఫేస్-2 అడ్డంకి.
-కూకట్‌పల్లి ఐడీఎల్ రోడ్ రెయిన్‌బో విస్టా వద్ద వరదనీటి పైప్‌లైన్ షిఫ్టింగ్ చేయాల్సి ఉండడంతో పనులకు అడ్డంకి.
-అమీర్‌పేట్ ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్‌మాల్ వద్ద స్థానిక దుకాణదారుల అభ్యంతరం.
-మొత్తం 11ఎఫ్‌ఓబీల్లో ఒకటి తుదిదశకు చేరుకోగా, రెండింటి పనులు పురోగతిలో ఉన్నాయి. మరో రెండింటి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, మిగిలినవి వివిధ కారణాలతో ఇంకా మొదలుకాలేదు.

ఎఫ్‌ఓబీలు ప్రతిపాదిత 55 ప్రాంతాలు...

దోమలగూడ రామకష్ణమఠ్, గచ్చిబౌలి దివ్యశ్రీ ఎన్‌ఎస్‌ఎల్ సెజ్, చిలుకలగూడ రింగురోడ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద, అమీర్‌పేట్ ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో ముఫకంజా కాలేజ్, ప్రశాంత్‌నగర్ ఐడీపీఎల్ బస్టాండ్, మాసాబ్‌ట్యాంక్ మహావీర్ దవాఖాన, కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌లోని ఫోరం సుజనామాల్, హైటెక్‌సిటీ సైబర్ గేట్‌వే, మదీనగూడ చెన్నయ్ షాపింగ్ మాల్, పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్, మదాపూర్ సైబర్ టవర్ జంక్షన్, మియాపూర్ ఆల్విన్ క్రాస్‌రోడ్స్, మదీనగూడ లక్ష్మీవిలాస్ రెస్టారెంట్, ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద ఘట్‌కేసర్ వెళ్లేమార్గంలో, కూకట్‌పల్లి టెంపుల్ బస్టాప్ పీఎన్‌ఆర్ ఎంపైర్ ఎదురుగా, నెక్లెస్‌రోడ్ ఈట్ స్ట్రీట్ పార్కింగ్ లాట్-2, రామంతాపూర్ హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్,

గచ్చిబౌలి ఇందిరాజంక్షన్ డీటీడీసీ ఆఫీసు ఎదురుగా, నేరెడ్‌మెట్ బస్టాప్ గోవింద్ స్వీట్‌హౌస్ ఎదురుగా, ముషీరాబాద్ గాంధీ దవాఖాన, సంతోష్‌నగర్ కేవీ రంగారెడ్డి కాలేజ్, టోలీచౌకీ షేక్‌పేట్ పాస్‌పోర్టు ఆఫీసు, లంగర్‌హౌస్ ఆరె మైసమ్మ టెంపుల్, మియాపూర్ ఓల్డ్ పోలీస్‌స్టేషన్, ఏఎస్‌రావు నగర్ సాయిసుధీర్ కాలేజ్ బస్టాప్, కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టా, రాయదుర్గం జంక్షన్ దర్గారోడ్‌వైపు, షేక్‌పేట్ ఒయాసిస్ స్కూల్, హైటెక్‌సిటీ శిల్పారామం వద్ద, ఈసీఐఎల్ బస్టాప్, ఎర్రగడ్డ ఈఎస్‌ఐ దవాఖాన, వనస్థలిపురం పనామా గోడౌన్స్, చందానగర్ విజేత సూపర్‌మార్కెట్, హయాత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ స్కూల్, మైత్రీవనం హెచ్‌ఎండీఏ ఎదురుగా, నాగారం చక్రీపురం క్రాస్‌రోడ్స్, ఏఎస్‌రావు నగర్ ఉషోదయ సూపర్‌మార్కెట్ వద్ద, గణేష్‌నగర్ షా థియేటర్ వద్ద,

జీడిమెట్ట బస్టాప్, మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాలు, షాపూర్‌నగర్ రంగభుజంగ థియేటర్, రాజేంద్రనగర్ స్వప్న థియేటర్, బండ్లగూడ సన్‌సిటీ, సుచిత్ర సర్కిల్ మేడ్చల్ రోడ్, ఐడీఏ ఉప్పల్ న్యూ మోడ్రన్ బేకరీ వద్ద, అమీర్‌పేట్ విశాల్‌మార్ట్ షాపింగ్ కాంప్లెక్స్, ఐఎస్ సదన్ క్రాస్‌రోడ్స్ వద్ద బిగ్ బజార్, దుర్గానగర్ టీ జంక్షన్ హెరిటేజ్ పార్లర్ ఎదురుగా, వనస్థలిపురం సుష్మా థియేటర్, నెహ్రూ జూపార్క్, ఓల్ట్ కర్నూల్‌రోడ్ టీ జంక్షన్ ఉందానగర్ వద్ద, ఆరాంఘర్ జంక్షన్ స్కైవేకు అనుసంధానంగా, అపోలో హాస్పిటల్ నిషాద్ మెడికల్స్, ఓమర్ హోటల్ షాలిమార్ హోటల్.

842
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...