మూడు నెలల్లోగా స్పందించకుంటే తిరస్కరణ


Tue,November 14, 2017 12:58 AM

-ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులో హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం
-30వేల మందికి నోటీసులు జారీ
-ఆన్‌లైన్‌తో పాటు ఈ-చలాన్ల ద్వారా ఫీజులు చెల్లించుకునే వీలు
-డిసెంబర్ నెలాఖరుకు క్రమబద్ధీకరణ పూర్తి : కమిషనర్ చిరంజీవులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయడానికి హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం తీసుకున్నది. సంస్థ నుంచి ఫీజు చెల్లించాలని ఎస్‌ఎంఎస్ అందుకున్న వినియోగదారుడు మూడునెలల్లోగా నిర్ణీత రుసుం చెల్లించాలి. గడువులోగా స్పందించకుండా ఫీజు చెల్లించని ఆయా దరఖాస్తుదారుడి ఎల్‌ఆర్‌ఎస్‌ను తిరస్కరించనున్నారు. ప్రస్తుతం సంస్థ 70వేల అనుమతులను మంజూరు చేయగా, 30వేలమంది ఫీజు చెల్లించకుండా రోజుల తరబడి కాలయాపన చేస్తున్నారు. ఇలా దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని నిర్ణీత రుసుం (ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ఛార్జీలు) చెల్లించకుండా రోజుల కొద్దీ సమయం తీసుకుంటున్న వారిని దారిలోకి తీసుకొచ్చేందుకు మూడునెలలగడువు ఎత్తుగడను తెరపైకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఫీజులు చెల్లించాల్సిన 30వేలమందికి ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు జారీ చేయాలని కమిషనర్ చిరంజీవులు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తార్నాక సంస్థ ప్రధాన కార్యాలయంలో క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్) పురోగతిపై ప్లానింగ్ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డితో కలిసి కమిషనర్ చిరంజీవులు సమీక్షించారు. ఫీజు చెల్లింపులో జాప్యానికి చెక్ పెట్టారు.

తెరపైకి ఈ-చలాన్లు...
క్రమబద్ధీకరణ పథకం ఫీజు చెల్లింపులో సేవలను మరింత సులభతరం చేశారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్, ఈ-పేమెంట్ అడ్వైజ్‌లు లాంటి ఆన్‌లైన్ చెల్లింపులపై దరఖాస్తుదారులు పడుతున్న ఇబ్బందులు, నిర్ణీత సమయంలో చెల్లించకపోవడానికి ప్రధాన కారణమవుతుందని గుర్తించిన కమిషనర్ మరింత వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు దరఖాస్తుదారుడికి ఈ-చలాన్లు కంప్యూటర్ ద్వారా అందించనున్నారు. ఈ స్లిప్‌ను ఆయా దరఖాస్తుదారుడి ఎల్‌ఆర్‌ఎస్ స్టేటస్‌లోకి వెళ్లి ఈ-చలాన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని సంబంధిత బ్యాంకుకు వెళ్లి నగదును చెల్లించుకునే అవకాశాన్ని కల్పించారు. తద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారుల అంచనా.

వచ్చే నెలాఖరు నాటికి క్రమబద్ధీకరణ పథకం పూర్తి..
171లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు ప్రక్రియను తుదిదశకు తీసుకువచ్చిన అధికారులు బీఆర్‌ఎస్ ప్రక్రియను మొదలు పెట్టారు. సంస్థ పరిధిలో 37వేల బీఆర్‌ఎస్ దరఖాస్తుల స్వీకరించగా, ఇప్పటికే 6వేలవరకు టైటిల్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో 2వేల వరకు తొలిదశలోనే తిరస్కరణకు గురయ్యాయి. బీఆర్‌ఎస్ వేగవంతంలో భాగంగా టైటిల్ వెరిఫికేషన్, టెక్నికల్ స్క్రూట్నీ, ప్రొసీడింగ్స్ ప్రక్రియను ప్లానింగ్ విభాగంలోని దాదాపు 40మందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. డీపీఎంఎస్‌తో పాటుగా బీఆర్‌ఎస్‌ను రోజుకు 40 చొప్పున ఒక్కో అధికారి బీఆర్‌ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని సమీక్షలో కమిషనర్ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెలాఖరు నాటికి క్రమబద్ధీకరణ పథకం పూర్తి చేయనున్నామన్నారు.

391
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...