నిమ్స్ వైద్యుల మరో ఘనత


Tue,November 14, 2017 12:58 AM

-ఆరు గంటల పాటు అరుదైన శస్త్రచికిత్స
-45సెం.మీల పొడవు, ఏడున్నర కిలోల కణతి తొలగింపు
-అభినందించిన మంత్రి లక్ష్మారెడ్డి
నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో : నిమ్స్ దవాఖాన వైద్యులు మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించారు. కాలేయం నుంచి 45 సెం.మీల పొడవున, ఏడున్నర కిలోల బరువుతో పెరిగిన బిలియరి సిస్ట్ ఎడినో కాస్నోమా కణతిని అరుదైన శస్త్రచికిత్స జరిపి తొలగించారు. ఇప్పటివరకు ప్రపంచ వైద్య చరిత్రలో 35సెం.మీల కణతిని తొలగించినట్లు మాత్రమే రికార్డులు ఉన్నాయని, సదరు ట్యూమర్స్ కూడా కాలేయ భాగానికి కాకుండా ఇతర భాగాలలో జనించినట్లు రికార్డుల్లో ఉందని, నిమ్స్ దవాఖాన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డా.బీరప్ప తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన వసంత(25) 17సంవత్సరాలుగా ఈ ట్యూమర్‌తో బాధపడుతోంది. 2011లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఈ ట్యూమర్‌కు జరిపిన శస్త్రచికిత్స విఫలమైంది. రోజురోజుకు సమస్య తీవ్రమైంది. దీంతో బాధిత కుటుంబం చివరకు నిమ్స్ దవాఖానను ఆశ్రయించింది. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డా.బీరప్ప రోగికి వైద్యపరీక్షలు జరిపి నివేదికలు పరిశీలించగా వసంత కడుపులో కాలేయం వద్ద పెద్ద కణతి ఉన్నట్లు గుర్తించారు. కణతిని బిలియారి సిస్ట్ ఎడినో కాస్నోమా అంటారని, ఇది ప్రపంచంలోనే అరుదైన కణతిగా ఆయన వివరించారు. రికార్డు స్థాయిలో 45సెం.మీల కణతి ఉందన్నారు.

నిమ్స్ ప్రపంచ రికార్డు.. మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
అరుదైన శస్త్రచికిత్సలకు నిమ్స్ కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎప్పుడూ జరపని అరుదైన శస్త్రచికిత్సను నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు నిర్వహించినట్లు తెలిపారు. దవాఖానలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా అక్కడికి వచ్చిన మంత్రి అరుదైన శస్త్రచికిత్స సమాచారాన్ని తెలుసుకుని సర్జికల్ గ్యాస్టో విభాగానికి చేరుకున్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన డా.బీరప్ప, ఆయన బృందాన్ని అభినందించారు. అనంతరం రోగిని పరామర్శించారు. ఇలాంటి శస్త్రచికిత్సలు మరిన్ని జరుగాలని, ప్రభుత్వం ప్రజావైద్యంపై ప్రత్యేక దృష్టిసారించి, దవాఖానలకు అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చుతున్నదన్నారు.

క్యూసా ద్వారా శస్త్రచికిత్స...
-డా.బీరప్ప, (నిమ్స్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి)
రోగికి సోమవారం శస్త్రచికిత్స నిర్వహించాం. శస్త్రచికిత్సలో ఎనిమిదిమంది వైద్యబృందం పాల్గొన్నారు. తీవ్ర రక్తస్రావం కాకుండా ఉండేందుకు క్యూసాఅనే అత్యాధునిక పరికరం ద్వారా శస్త్రచికిత్స నిర్వహించాం. ఆరుగంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో రోగికి కేవలం 300ఎంఎల్ రక్తాన్ని మాత్రమే ఎక్కించాం. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు, మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. పైత్య నాళాల ద్వారా జనించే ఈ కణతిని తొలగించేందుకు జరిపే శస్త్రచికిత్సకు కార్పొరేట్‌లో కనీసం రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చవుతుంది. డబ్బు ఖర్చుచేసినా నిష్ణాతులైన వైద్యబృందం ఎంతో కీలకం. అప్పుడే ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతమవుతాయి.

279
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...