మూడేళ్లలో.. పది లక్షల సీసీ కెమెరాలు


Fri,October 13, 2017 12:53 AM

మూడేళ్లలో.. పది లక్షల సీసీ కెమెరాలు
-లండన్.. న్యూయార్క్.. బీజింగ్ తరువాత మనమే నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి
ఖైరతాబాద్ : ప్రపంచంలో లండన్.. న్యూయార్క్.. బీజీంగ్.. పది లక్షల సీసీ కెమెరాలు కలిగిన ఉన్న నగరాలుగా ఖ్యాతిచెందాయి. రాబోయే మూడేళ్లలో ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ విశ్వనగరం నిలువనున్నది. ఇది దేశంలోనే ఓ రికార్డు అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. పశ్చిమ మండల పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడలోని జయగార్డెన్స్‌లో నేను సైతం (హైదరాబాద్ భద్రత-రక్షణలో పాల్గొంటాను) కార్యక్రమాన్ని సీపీ మహేందర్ రెడ్డి, పశ్చిమ మండల డీసీపీ ఎ. వెంకటేశ్వర్ రావు, పంజాగుట్ట ఏసీపీ ఎం. వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ప్రాజెక్టు ద్వారా నేరాల నియంత్రణకు నగర పోలీసులు సాధించిన ఘనతకు చిహ్నంగా దీనిని ఏర్పాటుచేశారు. నగరంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న నేరాలు, చైన్‌స్నాచింగ్, బైకు, ఇతర దొంగతనాల తాలుకు సీసీటీవీ ఫుటేజీలతో రూపొందించిన 18 నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నగరాన్ని సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా తీర్చాదిద్దాలని సంకల్పించారని, అందులో భాగంగానే పోలీసు స్టేషన్ల అధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రత్యేక వాహనాలను సమకూర్చారన్నారు. తద్వారా ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రావటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నది సీఎం లక్ష్యమన్నారు. కోట్లాది మంది జనాభా కలిగిన మెట్రో నగరాలను టార్గెట్ చేసుకొని ఇతర రాష్ర్టాలకు చెందిన కొందరు నేరస్తులు ఇక్కడ నేరం చేసి తప్పించుకోవచ్చన్న భావనతో ఉండేవారని, కాని హైదరాబాద్ నగరంలో వారి ఆటలు సాగవన్నారు. తప్పు చేసి తప్పించుకుందామనుకుంటే సీసీ కెమెరాలు వారిని వదిలిపెట్టవన్నారు. ముందుగా అనుకున్న లక్ష కెమెరాల ఏర్పాటుకు సమీపంలో ఉన్నామని, రాబోయే మూడేళ్లలో పది లక్షల సీసీ కెమెరాలు నగరంలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నిర్మించనున్న ఫ్యూజన్ సెంటర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి తప్పించుకోలేరని, ఇప్పటికే షీ టీమ్స్ మహిళలకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తోందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ఓ సామాజిక బాధ్యతగా ప్రజలు గుర్తించాలన్నారు. డీసీపీ ఎ. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ పశ్చిమ మండలంలో నేరాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయని, రికార్డు స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసిఫ్‌నగర్‌లో 7,205, గోషామహల్‌లో 3,075, బంజారాహిల్స్‌లో 13,330, పంజాగుట్ట డివిజన్‌లో 10,121తో కలిసి మొత్తం 33,731 కెమెరాలు నిరంతరం నిఘా పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్, ఆసీఫ్ నగర్ ఏసీపీలు ఎన్. మురళీ, గౌస్ మోహినుద్దీన్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఆసీఫ్‌నగర్ ఎస్‌హెచ్‌ఓలు రవీందర్, శ్రీనివాస్, పి. వెంకటేశ్వర్లు, డీఐ లక్ష్మీనారాయణ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారులకు అవార్డులు.. దాతలకు మెమోంటోలు
సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చిన 65 మందికి సీపీ మహేందర్ రెడ్డి జ్ఞాపికలు అందచేశారు. అలాగే సీసీటీవీ, కెమెరాల విశిష్టత, నేరాల అదుపులో అధునిక టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై ఇటీవల వివిధ పాఠశాలలకు చెందిన 550 మంది విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందచేశారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...