ఆకుపచ్చ తెలంగాణగా మారుద్దాం


Fri,October 13, 2017 12:52 AM

-సుచిత్రలో మొక్కలు నాటిన సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, మేడిపల్లిలో సీడీఎంఏ డైరెక్టర్ అనురాధ
పేట్‌బషీరాబాద్, అక్టోబర్ 12 : 44వ నంబర్ జాతీయ రహదారి కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుచిత్ర నుంచి బోయిన్‌పల్లి వెళ్లే రోడ్డులో గురువారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సీఎంఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్ ముఖ్య అతిథిగా హాజరై జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ సుధాంశ్‌లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, చెట్లను పెంచడంతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అధికారులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మొక్కలను నాటాలనుకునే వారికి తమవంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు . మొక్కలను నాటడంతోనే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో అధికారులు కృష్ణ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలో...
మేడిపల్లి : మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సీడీఎంఏ డైరెక్టర్ అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గురువారం ఫీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధి మేడిపల్లిలోని లక్ష్మీహిల్స్‌కాలనీ, మారుతీనగర్‌కాలనీ, భరత్‌పురికాలనీల్లో మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డితో పాటు పలువురు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపటి తరానికి అందమైన సమాజాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అనంతరం స్థానిక సాయి మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, సురేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బుచ్చియాదవ్, శుభాష్‌నాయక్, దేవీసింగ్, కరుణాకర్‌రావు, పెంటయ్యగౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

231
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...