యాప్రాల్‌లో రెండు నెలలుగా దుర్గంధం


Fri,October 13, 2017 12:52 AM

-వ్యాధుల బారిన పడుతున్న కాలనీల వాసులు
-ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు, కార్పొరేటర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : యాప్రాల్‌లోని డీబీఆర్ కాలనీలో రెండు నెలలుగా మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టడం తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీలోకి గత రెండు నెలలుగా పక్కనే ఉన్న జవహర్‌నగర్ పంచాయతీ నుంచి మురుగునీరు ప్రవహిస్తున్నది. పంచాయతీ అధికారులు తమ గ్రామ మురుగునీటిని జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాలనీలోకి వదిలి చేతులు దులుపుకోవడం బాధ్యతారాహిత్యమని స్థానికులు విమర్శిస్తున్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఖాళీగా ఉన్న ప్లాట్లలోకి చేరుతున్నదని, దీంతో దుర్గంధం వ్యాపిస్తున్నదని, వాటిలో దోమలు చేరడంతో తాము రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మురుగు నీరు కారణంగా భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయని, బోర్లలో వస్తున్న నీటితో ఒంటిపై దురద, దద్దుర్లు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సమస్యలపై కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.

సమస్యకు మూల కారణం జవహర్‌నగర్ పంచాయతీ కనుక వారితో తేల్చుకోవాలని, తామేమీ చేయలేమని డిప్యూటీ కమిషనర్ నళినీ పద్మావతి చెప్పారని కాలనీ సంఘం నాయకులు రాంరెడ్డి తెలిపారు. తమ కాలనీ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తుందని, తాము కార్పొరేషన్‌కు పన్నులు కడుతున్నప్పు డు పంచాయతీ వారిని ఎలా ప్రశ్నించగలమని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని డిప్యూటీ కమిషనర్‌తో ప్రస్తావించినప్పుడు కోర్టులో కేసు వేసుకోండని ఆమె నిర్లక్ష్యం గా సమాధానమిచ్చారని చెప్పారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతుండగా, అధికారులు మాత్రం బాధ్యతారహితం గా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు విమర్శించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీలో నెలకొన్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, తమ పిల్లలను రోగాల బారిన పడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...