ఘనంగా ఆవిర్భావ సంబురాలు


Thu,October 12, 2017 12:12 AM

-మేడ్చల్ కలెక్టరేట్‌కు శంకుస్థాపన
-సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు
-కొత్తజిల్లాలతో వేగంగా అభివృద్ధి : మంత్రి తలసాని
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి/శామీర్‌పేట/మేడ్చల్ కలెక్టరేట్ : జిల్లా ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు, కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపనతో సంబురాలు అంబరాన్నంటాయి. బుధవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండల పరిధిలోని అంతాయిపల్లిలో మేడ్చల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేసి కీసరలోని తాత్కాలిక కలెక్టరేట్‌లో జిల్లా ఆవిర్భావ దినోత్సవాలను మంత్రి తలసాని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని, నూతన జిల్లాల ఏర్పాటు వలన పరిపాలనలో మరింత వేగం పెరిగిందని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ యావత్తు తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు జిల్లా నలుమూలల నుంచి ఏ ప్రాంత ప్రజలైన కేవలం 30నిముషాల్లోపు కలెక్టరేట్‌కు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రులకు సూచిస్తున్నారన్నారు. కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే పలు రంగాల్లో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని కలెక్టర్‌ను అభినందించారు.

కొత్త భవనం ప్రారంభించుకుందాం..

కిందటేడాది ఇదే రోజు కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాను తానే ప్రారంభించానని, సరిగ్గా ఏడాది తరువాత కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నానని, వచ్చే ఏడాది అక్టోబర్ 11 నాటికి కొత్తగా నిర్మించనున్న కలెక్టరేట్‌ను ప్రారంభించుకుందామన్నారు. భవిష్యత్‌లో మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లోను అగ్రస్థానంలో ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, చింతల కనకారెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జడ్‌పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నందారెడ్డి, జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి, డీఆర్వో సురేందర్‌రావు, నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి, ఎంపీపీలు, జడ్‌పీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిద శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజల అవసరాలను తీర్చుతాం..

కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తుందని, ప్రజల అవసరాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తానని కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. ఇంటర్ ఫలితాల్లో, రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించామని, 10వ తరగతి ఫలితాల్లో 4వ స్థానం సాదించామని వచ్చే వార్షిక పరీక్షల ఫలితాల్లో ప్రథమ స్థానం సాదించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజావాణి సమస్యలు పరిష్కరించి ప్రజల విశ్వాసం పొందామని, మున్ముందు ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లోను అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాకు చెందిన ప్రజల, ప్రజా ప్రతినిధుల ఏకాభిప్రాయంతో శామీర్‌పేట్ మండలం అంతాయిపల్లి గ్రామంలో శాశ్వత కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి మొదటి విడతగా ప్రభుత్వం రూ.35 కోట్లను విడుదల చేసిందని, షాపూర్‌జీ పల్లోంజి నిర్మాణ సంస్థకు కలెక్టరేట్ నిర్మాణ బాధ్యతను అప్పగించామన్నారు. ఒక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.

అన్ని రంగాల్లోను అగ్రస్థానం

మేడ్చల్ జిల్లాలను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జిల్లాలో మరో రెండేళ్ళల్లో ఎవరు ఊహించని విధంగా అభివృద్ది జరుగుతుందన్నారు. ఔటర్ రింగు రోడ్డు, ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ భూములు అధికంగా ఉన్న ఈ మేడ్చల్ జిల్లాలో రైతులు తమ భూములను అమ్ముకోకూడదన్నారు. సమస్యలు తీర్చడంలో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాగం ముందుండి పని చేయాలన్నారు.

మహిళా సంక్షేమ ప్రభుత్వం

సీఎం కేసీఆర్ మహిళల కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని, దసరా పండుగ కానుకగా మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వంకు దక్కుతుందని రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ సునితా మహేందర్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ కలెక్టరేట్‌లో మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రజల పాలిట దేవుడు సీఎం కేసీఆర్

దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలను అమలు చేస్తు తెలంగాణ రాష్ట్రంను అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారని మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలో రూ.2వేల కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయని, మేడ్చల్ జిల్లా ధనిక జిల్లా అని, భవిష్యత్తులో బంగారు జిల్లాగా మేడ్చల్-మల్కాజ్‌గిరి రూపుదిద్దుకోనుందన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ మండలాల్లో ఇంటింటి త్రాగునీరు అందించే ప్రక్రియ 95 శాతం పూర్తయిందన్నారు. మహిళ సంక్షేమం కొరకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

మేడ్చల్ జిల్లా మొదటి ఆవిర్భావ వేడుకలు బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా జరిగాయి.తెలంగాణ కళాజాత బృందాలు, స్థానిక పాఠశాలల విద్యార్ధులు చేసిన నృత్యాలు విశేషంగా అలరించాయి. ముఖ్యంగా లంబాడా గీతాలపై గిరిజన మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. హరితహారం, జానపద,ఆధ్యాత్మికం,దేశభక్తి గీతాలపై ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి.విద్యాశాఖ ద్వారా సుమారు రెండు గంటల పాటు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన కలెక్టర్ ఎంవీరెడ్డి విద్యార్థులు,కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

503
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...