త్వరలో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ ప్రారంభించనున్న కేటీఆర్


Thu,October 12, 2017 12:08 AM

-సామాన్యుల శుభకార్యాలకు భరోసానిస్తున్న ప్రభుత్వం
-మంత్రి తలసాని నియోజకవర్గంలో అధునాతన హాల్
అమీర్‌పేట్ (నమస్తే తెలంగాణ): ఓ నిరుపేద ఇంట్లో పెండ్లి అంటే కట్నకానుకలు మాత్రమే కాదు. భారంగా పరిణమించే మరో ముఖ్యమైన అంశం ఫంక్షన్‌హాల్. దీనిలో శుభకార్యం చేయా లంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇంటి ఎదుట పెండ్లి చేద్దామంటే అగ్గి పెట్టెల్లాంటి ఇండ్లు. ఇరుకు సందులు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అతి సామాన్యుడి ఇంట్లో పెండ్లి జరగాలంటే ఎంత కష్టం. పేద బలహీన వర్గాల బాధను అర్థం చేసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం 15 ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి నడుం బిగించింది.

పెండ్లికి అయ్యే ఖర్చులకు దాదాపు సరి సమానంగా ఫంక్షన్‌హాల్‌కు కూడా వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలో గజం ఖాళీ స్థలం కూడా వదల్లేని పరిస్థితుల్లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అరకొర ప్రైవేటు కమ్యూనిటీ హాళ్లు సైతం వ్యాపారాత్మక ధోరణితో కమర్షియల్ కాంప్లెక్సులుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు శుభకార్యాలు జరుపుకునేందుకు స్థలం దొరకడం గగనం అవుతోంది. దీనికోసం ప్రభుత్వం నగరంలో నియోజకవర్గానికో ఫంక్షన్‌హాల్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. నగరంలో మొత్తం 15 ఫంక్షన్ హాళ్ల నిర్మా ణాలను ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో సకల సదుపాయాలతో కూడిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. హాల్‌లో విశాలమైన పార్కింగ్ సదుపాయాలతో పాటు ఆహ్లా దాన్ని పంచే విధంగా ఏర్పాటు చేసిన చక్కటి గ్రీనరీతో ఈ ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ ఫంక్షన్‌హాల్ నిరుపేదల కుటుంబాల్లో జరిగే శుభ కార్యాలయాలకు భరోసాగా నిలుస్తోంది.

బహుళార్థ ప్రయోజనకారిగా
బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో రూ.2 కోట్ల వ్యయంతో 560 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మితమవుతున్న ఈ ఫంక్షన్ హాల్‌లో ఒక పెండ్లికి అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చారు. జి+1 పద్ధతిన నిర్మతమవుతున్న ఈ ఫంక్షన్‌హాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో భోజనాల కోసం విశాలమైన డైనింగ్, వంటకాల తయారీ కోసం స్టోర్‌రూం, కిచెన్ ఏర్పాట్లున్నాయి. వీటితో పాటు 11.8 మీటర్ల వెడల్పు, 6.85 మీటర్ల పొడవుతో విశాలమైన వేదిక, వేదికకు అటు ఇటుగా ఇరువైపులా పెండ్లి వారి కోసం రూమ్‌లను సమకూర్చారు. ఈ హాల్‌లో జరిగే పెండ్లి వేడుకల్లో దాదాపు 700 నుంచి 800 మందికి హాజరయ్యే విధంగా ఈ హాల్ రూపుదిద్దుకుంది.

ఫంక్షన్ హాల్ కొరత తీరినట్టే:
-కూర్మ హేమలత, కార్పొరేటర్ బన్సీలాల్‌పేట్
మురికివాడలు అధికంగా ఉన్న బన్సీలాల్‌పేట్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం ఎంతో ఉపకరిస్తుంది. మంత్రి తలసాని సూచనల మేరకు ఈ కమ్యూనిటీ హాల్ నిర్వహణకు నామమాత్రంగా ఫీజులు చెల్లించే విధంగా నిబంధనలు రూపొందిస్తున్నాం. ఈ ఫంక్షన్ హాల్ కు అవసరమయ్యే టెంట్‌హౌస్ సంబంధిత అన్ని సామన్లను తన వ్యక్తిగత నిధులతో మంత్రి తలసాని ఉచితంగా అందజేస్తున్నారు. నగరంలో ఈ తరహాలో నిర్మించ తలపెట్టిన మొట్టమొదటి ఫంక్షన్ హాల్ ఇంత తక్కువ సమయంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడంలో మంత్రి తలసాని చూపిన చొర వ మరువలేనిది. ఈ హాల్ నా డివిజన్‌లో నిర్మించడం ఆనందంగా ఉంది. 19న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగాల్సిన ప్రారంభోత్సవానికై డివిజన్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

302
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...