దీనావస్థలో ఉన్నా.. ఆదుకోండి..


Thu,October 12, 2017 12:08 AM

-అనారోగ్యంతో అవస్థలు పడుతున్న తొలి, మలిదశ ఉద్యమకారుడు
-సాయం కోసం వేడుకుంటున్న బండారు మల్లారెడ్డి
(నమస్తే తెలంగాణ, ఎల్‌బీనగర్) : 13 సంవత్సరాల వయసు.. తెలంగాణపై అభిమానం... స్వరాష్ట్రం కావాలనే ఆకాంక్ష.. ఆ చిన్నారిని తెలంగాణ ఉద్యమ పోరాటంతో భాగం చేసింది. తెలంగాణ కోసం చేసిన కార్యక్రమాలతో అరెస్టు అయి మైనర్ కావడంతో బయటపడ్డాడు. తెలంగాణ తొలి ఉద్యమం 1969లో పోరాటం చేసిన బండారు మల్లారెడ్డి, మలి విడత తెలంగాణ ఉద్యమంలోనూ పరుగులు తీశాడు. ప్రస్తుతం అనారోగ్యంతో బతుకుభారాన్ని మోయలేక దీనావస్థలో ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించి.. వైద్యానికి ఆర్థిక స్థోమత లేక ఆపన్నులు ఆదుకోవాలని, ప్రభుత్వం తనకు సహకారం అందించాలని కోరుతున్నాడు. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలో ఓ చిన్న అద్దె గదిలో ఉంటూ జీవనం సాగిస్తున్న మల్లారెడ్డి తనకు వచ్చిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ జబ్బు నయం కావాలంటే సుమారుగా రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నాడు.

మల్లారెడ్డి ప్రస్థానం..
నాటి నల్గొండజిల్లా నేటి సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కుచెర్ల గ్రామంలో బండారు సోమిరెడ్డికి మల్లారెడ్డి 1956లో జన్మించారు. ఇతనికి ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఓ సారా కాంట్రాక్టర్ వద్ద పనిచేసేవారు. 1969లో 13ఏళ్ల వయసులో తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడైన మల్లారెడ్డి తోటివారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఓ ఆంధ్రా ఏఎన్‌ఎం ఇంటిపై దాడిచేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసినప్పటికీ మైనర్ కావడంతో వదిలిపెట్టారు. అనంతరం ఉద్యమంలో పాల్గొన్నారు. తండ్రి సోమిరెడ్డి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలి పెళ్లి చేశారు. అనంతరం సోమిరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారు. అనంతరం కుటుంబ భారం మల్లారెడ్డిపై పడింది. వ్యవసాయం చేసి ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. 1984లో సూర్యాపేట నుంచి మిర్యాలగూడకు భార్య ఉమతో కలిసి తరలివెళ్లాడు. 2003 వరకు రైసుమిల్లు నిర్వహణతో పాటుగా స్కూల్ వార్డెన్‌గా పనిచేస్తూ జీవనం సాగించాడు. 2003లో భార్య మరణించడంతో ఒంటరి అయిన మల్లారెడ్డి మలి విడత తెలంగాణ ఉద్యమంలో భాగం పంచుకున్నారు.

ఒంటరిగా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్న మల్లారెడ్డికి సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్యం గురించి పట్టించుకోక పోవడంతో టీబీ ఎఫెక్ట్ అయ్యింది. దీంతో 2007 నుంచి 2011 వరకు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. నగర శివారు దేవర యంజాల్‌లోని చాయ్ ఫాం క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్‌లో ఉండి చికిత్స చేయించుకున్నాడు. మల్లారెడ్డి ప్రస్తుతం గ్యాస్టో ఎంట్రాలజీ సమస్యలతో బాధ పడుతున్నాడు. కడుపులోని పెద్ద పేగుల్లో గడ్డలు కావడం, మలద్వారం వద్ద కూడా గడ్డలు అయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వైద్య చికిత్స చేయించేందుకు ఉస్మానియా దవాఖాన వారిని సంప్రదించినా ఆపరేషన్ చేస్తామని చెప్పి రోజుల తరబడి తిప్పించుకున్నారని, ప్రైవేటు ఆసుపత్రుల వారిని సంప్రదిస్తే సుమారు రూ.5 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారని ఆయన వివరించారు. ఎవ్వరూ లేని తనను తెలంగాణ ప్రభుత్వం ఆదుకునిక చికిత్స అందించాలని, ఆపన్నులు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. తాను 13ఏళ్ల వయసులో ఆకాంక్షించినట్లుగానే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావడం సంతోషంగా ఉందని అన్నాడు. మల్లారెడ్డికి సాయం అందించాలనుకునే వారు 9177683181లో సంప్రదించాలి.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...