ఫార్మాసిటీ ఏర్పాటుపై


Thu,October 12, 2017 12:07 AM

-ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ
-ప్రజల సందేహాలను నివృత్తి చేసిన కలెక్టర్ రఘునందన్‌రావు..
-హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, పర్యావరణ శాస్త్రవేత్తలు
ఇబ్రహీంపట్నం, నమస్తేతెలంగాణ / యాచారం : రంగారెడ్డిజిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి బుధవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ లో కాలుష్య నియంత్రణ మండలి, టీఎస్‌ఐఐసీ అధికారులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఫార్మాకంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణ మధ్యాహ్నం 3గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా విపక్షాలకు చెందిన రాజకీయపార్టీల నాయకులు, పర్యావరణశాస్త్రవేత్తలు, రైతులు అడిగిన పలు సందేహాలకు కలెక్టర్ సమాధానమిచ్చారు.

ముందుగా కలెక్టర్ రఘునందన్‌రావు, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫార్మాసిటీని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాడిపర్తి, కందుకూరు మండలంలోని ముచ్చర్ల, మీరఖాన్‌పేట్, పంజాగూడ, కడ్తాల్ మండలంలోని ముద్విన్, కలర్కల్‌పహాడ్, సాయిరెడ్డిగూడెం గ్రామాల్లో సుమారు 19,333ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 8,300ఎకరాలను సేకరించామన్నారు. ఇందులో భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా అందజేసినట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీలలో పొల్యూషన్ రాకుండా ఏర్పాటు చేయడం కోసం చైనా, సింగపూర్, అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటించి కొత్త టెక్నాలజీపై అధ్యయనం చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం తీసుకోనున్న భూముల్లో 46శాతం మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగిస్తామని, మిగతా భూమిలో 9శాతం నివాసగృహాల కోసం, 10శాతం అడవులు పెంచడం కోసం, 21శాతం గ్రీన్‌ఏరియాకు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, ఫార్మా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాకంపెనీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న 12గ్రామాలకు చెందిన ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫార్మా ప్రాజెక్టు పూర్తయితే వచ్చే 20 ఏండ్లలో సుమారు రెండుకోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

ప్రజల ఆమోదం మేరకే భూసేకరణ : కలెక్టర్
ప్రజల ఆమోదం మేరకే ఫార్మాసిటీకి అవసరమైన భూసేకరణ జరిపామని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. ప్రజల ఆమోదం మేరకే పట్టాభూములకు, అసైన్డ్‌మెంట్ భూములకు పరిహారం ఇచ్చామని, మిగతా గుట్టలు, రాళ్ల భూములకు కూడా పరిహారం ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

ఫార్మాసిటీ ఏర్పాటు జిల్లాకు వరంలాంటిది : ఎమ్మెల్యేలు మంచిరెడ్డి, తీగల
రంగారెడ్డిజిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల కు వరంలాంటిదని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కర్నె ప్రభాకర్‌లు అన్నారు. హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు కడ్తా ల్ మండలాల్లో అభివృద్ధి సరిగ్గాలేక ఉపాధి అవకాశాలు కూడా లేని పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటుచేసి లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చారన్నారు. కొంతమంది విపక్షనాయకులు ఫార్మాసిటీ ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతుందని, ప్రజలకు తప్పుడు సలహాలిచ్చి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారని, అయినప్పటికీ రైతులు, ప్రజలు వారి మాటలు వినకుండా ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించారని అన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, వంశిచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, జడ్పీకాంగ్రెస్ కో లీడర్ ఏనుగు జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీలు జ్యోతి, జయమ్మ, జడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఫార్మా అసోసియేషన్ నాయకులు నరేందర్, మల్లారెడ్డి, పర్యావరణ ఎన్‌జీఓలు చెన్నకేశవరెడ్డి, సునంద, సరస్వతి, ఇంద్రసేనారెడ్డి, నాగసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం నాయకులు ఆలంపల్లి నర్సింహా, గిరిజన నాయకులు హనుమానాయక్, కిషన్‌నాయక్, మేడిపల్లి ఎంపీటీసీ మోటె శ్రీశైలం తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో మొత్తం 26 మంది ఫార్మాకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు
ఫార్మాసిటీ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు యాచారం మూడు మండలాల్లోని రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుమారు నాలుగు నుంచి ఐదువేల మంది రైతులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగానే కలెక్టర్ ప్రతిఒక్కరి అభిప్రాయాలను వీడియోద్వారా చిత్రీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేయడంతో ప్రతిపక్షాలు సైతం సమావేశానికి హాజరై సహకరించారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, కాలుష్యనియంత్రణ మండలి అధికారి వెంకన్న, టీఆర్‌ఎస్ నాయకులు జేపీ శ్రీనివాస్‌రావు, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మొద్దు అంజిరెడ్డి, డబ్బికార్ శ్రీనివాస్, బర్ల జగన్, గంగనమోని సతీష్, అచ్చన మల్లికార్జున్, తలారి మల్లేష్, మచ్చ లక్ష్మ ణ్, అరవింద్‌నాయక్, శంకర్‌నాయక్, కిషన్‌నాయక్, బాలరాజు, భాస్కర్, మధుసూదన్‌రెడ్డి, మారోజు శ్రీనివాస్, జెర్కోని రాజు, మడుపు శివసాయి, బీజేపీ నాయకులు కొప్పు భాష, కొత్త అశోక్‌గౌడ్, జంగయ్యగౌడ్, ముంత జంగయ్య, కాంగ్రెస్ నాయకులు భాష, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

243
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...