బల్దియా ముందు లోధా బాధితుల ఆందోళన


Wed,September 13, 2017 02:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఫ్లాట్ల కొనుగోలు సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న కూకట్‌పల్లిలోని లోధా కన్‌స్ట్రక్షన్స్ మెరీడియన్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల కొనుగోలుదారులు మంగళవారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కేపీహెచ్‌బీ సమీపంలో లోధా కన్‌స్ట్రక్షన్స్ తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో బెలేజా పేరుతో, దాని పక్కనే మరో నాలుగు ఎకరాల్లో మెరీడియన్ పేరుతో నివాస సముదాయాలు నిర్మించారు. ఈ రెండింటి మధ్యలో గోడను నిర్మించారు. అయితే తమకు ఫ్లాట్ల కొనుగోలు సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం పార్కింగ్, క్లబ్‌హౌస్, గ్రీనరీ, లిఫ్టులు తదితర సౌకర్యాలు కల్పించలేదంటూ మెరీడియన్‌లో ఫ్లాట్ల కొనుగోలుదారులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిపై వారు ఇదివరకే పలుమార్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. బెలేజాకు కల్పించిన సౌకర్యాలపై తమకు కూడా హక్కు ఉందని వాదిస్తున్నారు.

తాము అధిక మొత్తం చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేసినందున ఇందులో మెరీడియన్ ఫ్లాట్ల కొనుగోలుదారులకు ఎటువంటి హక్కులు లేవని, గోడను తొలగించే ప్రసక్తే లేదని బెలేజా ఫ్లాట్ల యజమానులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వెంచర్లకు మధ్య నిర్మించిన గోడను కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీచేయగా, బెలేజా యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వివాదం కోర్టులో ఉంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు రివైజ్డ్ ప్లాన్లకు అనుమతులు ఇవ్వడమే కాకుండా నిర్మాణంలో డీవియేషన్లను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల ప్రకారం జీహెచ్‌ఎంసీ అధికారులు బిల్డర్‌తోపాటు మెరీడియెన్, బెలేజా అపార్ట్‌మెంట్ల యజమానులతో ఇదివరకే రెండుదఫాలు చర్చలు జరపగా ఇంకా ఎటువంటి నిర్ణయం రాలేదు.

ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం మెరీడియెన్ ఫ్లాట్ల యజమానులు దాదాపు 20మందికిపైగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసేందుకు రాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం లోధా అపార్ట్‌మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెరీడియన్ అపార్ట్‌మెంట్‌కు చెందిన మరికొందరు ఫ్లాట్ యజమానులతోపాటు బెలేజా అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల యజమానులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి చర్చలు జరిపారు. ఇరువురి వాదనలూ విన్నారు. కాగా ఈసారి సైతం లోధా కన్‌స్ట్రక్షన్స్ తరఫున ఎవ్వరూ పాల్గొనలేదని అధికారులు తెలిపారు. దీంతో రెండు అపార్ట్‌మెంట్ల యజమానుల వాదనలు విన్న కమిషనర్ చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు మెరీడియన్ అపార్ట్‌మెంట్‌వాసులు కూకట్‌పల్లి నుంచి రెండు బస్సుల్లో తరలి వస్తుండగా ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పంజాగుట్ట వద్దే అడ్డుకొని వారిని వెనక్పు పంపే ప్రయత్నం చేశారు. అయినా కొందరు సొంత వాహనాల్లో జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు.

259
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...