ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేయాలి


Sun,August 13, 2017 12:11 AM

-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి
సిటీబ్యూరో,గాంధీదవాఖాన: ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి వైద్యుడు కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి అన్నారు.వ్యాధులపై ప్రజల్లో చైతన్యం కలిగించడం, ప్రివెంటివ్ మెడిసిన్స్‌పై అవగాహన కల్పించడంలో వైద్యుల పాత్ర కీలకమన్నారు. శనివారం గాంధీ వైద్య కళాశాలలో అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రెండ్రోజుల టీఎస్ అపికాన్ (తెలంగాణ ఫిజీషియన్‌ల జాతీయ సదస్సు)-2017ను మంత్రి లక్ష్మారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగాలు రాకుండా నిరోధించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి అంశాల్లో యోగా ప్రక్రియలు బాగా పనిచేస్తున్నట్లు చాలా మంది వైద్యులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్దేశంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. సీఎం నేతృత్వంలో తామంతా కంకణబద్దులమై పనిచేస్తున్నామని తెలిపారు.

అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన సదుపాయాలను కల్పించామని, తెలంగాణ వచ్చిన తరువాత సర్కార్ దవాఖాలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఈ క్రమంలోనే మూడేళ్లలో రోగుల సంఖ్య 20నుంచి 30శాతానికి పెరిగిందన్నారు. జబ్బులు ఎందుకు వస్తున్నాయి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలి, ఎలాంటి వైద్యం ఎప్పుడు, ఎక్కడ అందుబాటులో ఉందో ప్రజలకు వివరించాలని వైద్యులకు మంత్రి సూచించారు. తట్టు వంటి వ్యాధుల నివారణకు టీకాలు ఇస్తున్నామని వివరించారు. గాంధీలో పెరిగిన వసతుల గురించి మీకు తెలుసని, అత్యాధునిక 65 పడకల ఐసీయూ కేంద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నామని, గాంధీలో వసతులపై గవర్నర్ ఎలా స్పందించారో కూడా మీకు తెలుసని మంత్రి వైద్యులనుద్దేశించి అన్నారు.

అనవసర సర్జరీలపై కూడా చర్చ జరగాలని, వాటిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్స్‌పై దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై బాధ్యులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వైద్యులు కూడా బాధ్యతాయుతంగా పనిచేసి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫిజీషియన్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ నర్సింహులు, డాక్టర్ బీఆర్ బన్సోడ్, డాక్టర్ విజయమోహన్, డాక్టర్ శంకర్, డాక్టర్ మనోహర్, డాక్టర్ రాజారావులతో పాటు పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

321
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...