ఎల్‌ఈడీలతో దీపావళి


Sun,August 13, 2017 12:10 AM

-పండుగ కల్లా పూర్తి కానున్న పనులు
-శరవేగంగా సాగుతున్న బల్బుల మార్పు
-ఇప్పటివరకు 50 వేల వరకు లైట్ల ఏర్పాటు
-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు కార్యక్రమం అవాంతరాలు లేకుండా ముందుకుసాగితే వచ్చే దీపావళి పండుగను నగరవాసులు ఎల్‌ఈడీ వెలుగుల మధ్య జరుపుకునే ఆస్కారముంది. సంప్ర దాయ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు ప్రక్రియ శర వేగంగా కొనసాగుతోంది. ఆయా జోన్లలో రోజుకు ఐదు నుంచి పదివేల చొప్పున, ఇప్పటికే సుమారు 50 వేల బల్బులను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో నగరంలో సంప్రదాయ వీధిలైట్ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు ప్రాజెక్టును చేపట్టింది. సంప్రదాయ బల్బులతో పోల్చుకుంటే ఎల్‌ఈడీ బల్బులు సగానికిపైగా విద్యుత్‌ను ఆదాచేయడంతో పాటు వెలుగు కూడా వాటికన్నా ఎక్కువగా ఉంటుందని ప్రయోగాల్లో నిరూపణ అయింది. ముఖ్యంగా విద్యుత్ బిల్లులు కనీసం 55 శాతం తగ్గుతాయని అంచనా. దీంతోపాటు కాలుష్యం కూడా తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపం చ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఎల్‌ఈడీ బల్బుల వాడకం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మన నగరంలో కూడా ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఇఇఎస్‌ఎల్)తో గత మే నెల 29వ తేదీన జీహెచ్‌ఎంసీ ఒప్పందం కూడా చేసుకుంది. ఒప్పందం ప్రకారం మూడు నెలల్లో లైట్లను ఏర్పాటుచేయాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇబ్బందుల కారణంగా జాప్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. దీపావళి నాటికి పూర్తిస్థాయిలో లైట్ల ఏర్పాటు జరుగుతుందని భరోసా ఇస్తున్నారు.

నిర్వహణకు సర్కిళ్ల
వారీగా ఏజెన్సీల ఎంపిక...
ఈఈఎస్‌ఎల్, జీహెచ్‌ఎంసీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లైట్ల నిర్వహణ ఈఈఎస్‌ఎల్ చేపట్టాల్సి ఉన్నప్పటికీ సాంకేతికపరమైన కారణాల వల్ల ఇంకా చాలావరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే నిర్వహణ కొనసాగుతోంది. ప్రైవేటు కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పుడు తాజాగా ఈఈఎస్‌ఎల్ లైట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. సర్కిళ్లవారీగా ఏజెన్సీలను ఎంపికచేసి వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. వచ్చే వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఇదీ వీధి లైట్ల లెక్క
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రేటర్ పరిధిలో 4,54,000 వీధిలైట్లు ఉండగా, విద్యుత్ బిల్లులు సహా ఒక్కో లైటు నిర్వహణకు ఏటా దాదాపు రూ. 5,000 ఖర్చవుతోంది. సంవత్సరానికి సుమారు రూ. 184 కోట్లమేర విద్యుత్ బిల్లులు చెల్లిస్తుండగా, నిర్వహణకు మరో రూ. 20కోట్లు, బల్బుల కొనుగోలుకు మరో రూ. 10కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. ఎల్‌ఈడీ ప్రాజక్టులో భాగంగా రూ. 270 కోట్ల అంచనా వ్యయంతో 4,54,000సాంప్రదాయ వీధిలైట్ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, లైట్ల ను ఏర్పాటు చేయడంతో పాటు ఏడేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఈఈఎస్‌ఎల్ చేపట్టనుంది. విద్యుత్ ఆదా ద్వారా ఏడేళ్లలో రూ.1238.14 కోట్లు ఆదా అవుతాయని వారి అంచనా.

ఔట్‌సోర్సింగ్ మిగులు సిబ్బందికి ఉద్యోగ భద్రత
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం వీధిలైట్ల నిర్వహణ ప్రైవేటు కాంట్రాక్టర్ల ఆధీనంలో కొనసాగుతోంది. సుమారు నాలుగున్నర లక్షల వీధిలైట్లను 57 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు నిర్వహణ అప్పగించారు. ఒక్కో ప్యాకేజీలో సుమారు 12 నుంచి 13 మంది చొప్పున మొత్తం 751 మంది సిబ్బందికి వేతనాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు ఇందులో సగం మందే. మిగిలిన సగం సిబ్బందికి సంబంధించి బోగస్ పేర్లతో వారి వేతనాలను అధికారులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈఈఎస్‌ఎల్ సర్కిళ్ల వారీగా నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. దీంతో సుమారు 250-300 మంది సిబ్బందితో వారు విధులు నిర్వహించే వీలుండగా మిగిలిన వారిని ఇతర పనులకు ఉపయోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఎవ్వరిని విధుల నుంచి తొలగించే ప్రసక్తి లేదని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుతం వీధిలైట్ల నిర్వహణ విధులు నిర్వహిస్తున్న వారిని యధావిధిగా కొనసాగించే వీలుండగా, బోగస్ పేర్లను మాత్రం ఇతర విభాగాలకు మళ్లించాల్సి ఉంటుందని ఓ అధికారి పేర్కొనడం విశేషం.

ఆగస్టు 10వరకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లు
జోన్ ఎల్‌ఈడీ ఏర్పాటు
ఈస్ట్ 5444
సౌత్ 15303
సెంట్రల్ 6774
వెస్ట్ 8437
నార్త్ 11061
మొత్తం 47019

355
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...