బోనమెత్తిన నగరం


Mon,July 17, 2017 02:27 AM

- కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు
- ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు

నగరంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అమ్మవార్లకు బోనాలను సమర్పించి, సల్లంగా చూడాలని వేడుకున్నారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళీ , కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయాల్లో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు ఇచ్చారు. సింహవాహిని మహంకాళీకి ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించారు. వర్షాలు బాగా కురవాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే గోల్కొండ కోటలో కొలువైన ఎల్లమ్మకు మహిళలు ఏడో బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. సాయంత్రం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కత్తులు బల్లెము చేతబట్టి..నువ్వు పెద్దపులి నెక్కినావమ్మో.. అంటూ కొందరు...అమ్మా బైలెల్లినాదో..తల్లి బైలెల్లి నాదో..అంటూ మరి కొందరు భక్తుల జానపదాల హోరుతో ఆదివారం పాతబస్తీ పునీతమైంది. వాడవాడలా పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో సందడి నెలకొంది. ఆడపడుచుల బోనాల సమర్పణతో అమ్మవారి ఆలయాలన్నీ కళకళలాడాయి. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాతబస్తీలోని లాల్ దర్వాజ శ్రీసింహవాహిని మహంకాళీకి బంగారు బోనం సమర్పించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, మహంకాళీ దయవల్ల రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పంటలు పండి, రైతులు బాగుపడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అమ్మవారి దయవల్ల సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.


- లాల్‌దర్వాజ మహంకాళీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
- పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రులు
-పూజలు నిర్వహించిన ప్రముఖులు
- బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత


వానలు కురవాలని మహంకాళీకి ఆడబిడ్డల నైవేద్యాలు.. హైదరాబాద్‌కు చినుకుల వరాలు! సల్లంగ చూడాలని మొక్కే భక్తులు, సుభిక్షంగా పాలించమని కోరే నాయకులతో పాతబస్తీ బోనాల జాతర జనజాతరను తలపించింది. ఆదివారం ఉదయం మొదలైన బోనాల జాతరలో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. పలు చోట్ల ఆలయాలను విద్యుత్ దీపాలతో శోభా యమానంగా అలంకరించారు. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో బస్తీ వీధుల్లో సందడి నెలకొంది.

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో, చాంద్రాయణగుట్ట, చార్మినార్: చుట్టుముట్టూ హైదరాబాద్ నట్టనడుమ చార్మినార్.. చార్మినార్ కొమ్ముకింద బంగారు మైస మ్మ.. అంటూ పాత నగరంలోని బస్తీలన్నీ జానపదాలతో మార్మోగాయి. తొట్టెలు ఊరేగిస్తూ, పోతురాజులు వీరంగాలు, శివసత్తుల పూనకాలతో బస్తీ వీధుల్లో సందడి నెలకొంది. కత్తులు బల్లెం చేతబట్టి ఊగిపోయే శివసత్తులు, పసుపు కుంకుమలు పులుముకొని కొరడాలు చేతబట్టిన పోతురాజుల ఆటలతో యువత హుషారుగా సాగిపోయింది. నగరంలోని ఆలయాలన్నీ బోనాల జాతర కోసం విద్యుద్దీపాలంకరణతో శోభాయమానంగా అలంకరించారు. ప్రధాన వీధులు, ఆలయ వీధులను తోరణాలతో ముస్తాబు చేసి బస్తీ వాసులంతా స్థానిక ఆలయాల్లో బోనాలను జరుపుకున్నారు. హైదరాబాద్ బోనాలకు ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయానికి వేలాదిమంది భక్తులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరావడంతో లాల్‌దర్వాజ బోనాల జాతర మరింత సంబురంగా జరిగింది.

సింహవాహిని మహంకాళికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలను సమర్పించారు. తెలవారు జామున నిర్వహించిన తొలిపూజ తర్వాత సింహావాహిని మహంకాళికి టీడీపీ నేత దేవేందర్ గౌడ్ కుటుంబం తొలిబోనం సమర్పించింది. సింహావాహిని మహంకాళికి బోనాలు సమర్పించేందుకు వచ్చిన వేలాది మం ది మహిళలు వర్షా న్ని సైతం లెక్కచేయక గంటల కొద్దీ క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. వేలాది మంది సందర్శకులు రావడం, ప్రముఖుల రాకతో ఈ ఆలయంలో దర్శనానికి, బోనం సమర్పణకు భక్తులు మూడు గంటలపాటు వేచి ఉండా ల్సి వచ్చింది.

పాతబస్తీలోని హరిబౌలిలో ఉన్న శ్రీ అక్కన్న మాదన్న ఆలయం లో బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వం తరపున పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్వాన్‌లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ-ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించారు. మీరాలంమండిలోని శ్రీశ్రీశ్రీ మహాకాళేశ్వర ఆలయం, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆల యం, జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం, నాం పల్లి ఏడుగుళ్ల పోచమ్మ దేవాలయాల్లో బోనాల సంబురాన్ని వైభవంగా జరుపుకున్నారు. పాతబస్తీలో బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు కరపత్రాలు అందిస్తూ సైబర్ ఛీటర్ల బారిన పడొద్దంటూ పోలీసులు సూచనలు చేశారు.

బంగారు బోనాలు


హైదరాబాద్ బోనాల్లో బంగారు బోనాలతో అమ్మవారికి పలువురు మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళికి బంగారు బోనం సమర్పించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలిపింక్స్ రజత పతక విజేత పీవీ సింధు, సివిల్స్ ర్యాంకర్, లాల్ దర్వాజ స్థానిక యువతి అయిన స్నేహలత సింహవాహిని మహంకాళికి బంగారు బోనం సమర్పించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కూడా అమ్మవారికి బోనం సమర్పించారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళిని, అక్కన్న మాదన్న మహంకాళిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ స్వామిగౌడ్, రాష్ట్ర మం త్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, కిషన్ రెడ్డి, బంగారు లక్ష్మణ్, ఎంవీ ఎస్‌ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్, టీఆర్‌ఎస్ నేతలు సీ కృష్ణయాదవ్, ఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మెట్రోజోన్ సీజీఎం విద్యాసాగర్ పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. పాతబస్తీలోని ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పాతబస్తీలో బోనాల సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తారు.

మహిళా అభ్యున్నతితో బంగారు తెలంగాణ


తెలంగాణ ప్రధాన పండుగలైన బతుకమ్మ, బోనాలు మహిళల పండుగలే. సుభిక్షం కోరే మహిళల అభ్యున్నతితోనే బం గారు తెలంగాణ సాధ్యం.
-బండారు దత్తాత్రేయ, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి కేసీఆర్ కలలు పండాలే..

బోనాల జాతరలో ఆడవాళ్లు ఇబ్బందులు పడ కూడదని కేసీఆర్ ఆలయాల మరమ్మతులతో పాటు, ప్రత్యేకంగా వసతులు కల్పించారు. తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోకి ప్రగతిలో నంబర్ వన్‌గా ఉండాలని, దేశంలోనే విశిష్టమైన రాష్ట్రంగా నిలిచి కేసీఆర్ కలలు పండాలని అమ్మవారిని కోరు కున్నా.
-పద్మా దేవేందర్ రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్

అమ్మ దయ..


మహంకాళి అమ్మవారి దయవల్ల వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. పంటలు పండి, రైతులు బాగుపడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉం టుంది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాల వేడుకను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. దేశానికి తెలిసేలా ఢిల్లీలో నిర్వహించిన లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభు త్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందించాం.
-కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు

కేసీఆర్ చలవ..


మన సంస్కృతికి మళ్ళీ పట్టంకడుతున్నం. కేసీఆర్ నాయకత్వంలో పండుగల్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.
-నాయిని నర్సింహారెడ్డి, హోంమంత్రి

రాష్ట్రం గర్వించేలా..


తెలంగాణ సంప్రదాయాల్ని, బోనాల విశిష్టతను భారత దేశమంతటికీ తెలిసేలా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం. లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం.
-ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి

తెలంగాణ వైభవం..


సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆషాఢ మాసం బోనాలు మొదలైన నాటి నుంచి నేటి వరకు మొదటి వారం గోల్కొండ జగదాంబ, రెండో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని, మూడో వారం లాల్ దర్వాజలో వర్షం పడటం అమ్మవారి ఆశీర్వాదమే.
-తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

మళ్లీ వస్తా..


పతకం రావాలని మొక్కిన. వచ్చింది. అమ్మను మళ్లీ దర్శించుకున్నా. ఇక ముందు కూడా దర్శించుకుంటా.
- పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

484
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...