బురిడీగాళ్లకు చెక్..భూ కేసులకు ఫుల్‌స్టాప్


Mon,July 17, 2017 02:18 AM

-భూవివాదాలు లేకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు
-కోర్టుల్లో 2020 భూ సంబంధ కేసులు
-కేసుల పురోగతిపై సమీక్షకు ఉన్నతాధికారుల కసరత్తు
-మండలాల వారీగా అధికారులతో సమీక్షలు
-షెడ్యూల్ రూపొందించిన అధికారులు

రోజురోజుకు పెరిగిపోతున్న భూసంబంధ కేసులను పరిష్కరించేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపడుతోంది. మాఫియా చేతుల్లో ఉన్న విలువైన భూములను కైవసం చేసుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే ఆలోచనలో అడుగులు వేస్తోంది. ఇందుకోసం జేసీ ప్రశాంతి ఆధ్వర్యంలో మండలాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : భూ సంబంధ కేసులే టార్గెట్‌గా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వివాదాలను పరిష్కరించుకుని అనుకూలంగా తీర్పులు వచ్చేలా కృషిచేస్తోంది. మొత్తంగా ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. మండలాల వారీగా కేసులు, వివాదాలపై ఈ సమావేశాల్లో సమీక్షించనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా సమీక్షా సమావేశాల షెడ్యూల్‌ను అధికారులు రూపొందించారు. జూలై 11వ తేదీ నుంచి జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి ఈ నెల 28వ వరకు కొనసాగనున్నాయి. కేసుల పురోగతిని తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను ఈ సమీక్షా సమావేశాల్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూవివాదాలు అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉంటాయి.

రాజధాని నగరం కావడం, ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉండటంతో ఇక్కడే ఎక్కువగా భూవివాదాలు, భూసంబంధ కేసులు ఎక్కువగా ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు జిల్లాలో 2020 భూసంబంధ కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. చాలా వరకు కేసులు ఏండ్లకేండ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. డిసెంబర్ మాసంలో 1316 కేసులుండగా, జూలై వచ్చే వరకు కేసుల సంఖ్య 2020కు పెరిగింది. కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడంలేదు. దీంతో పరిష్కారం దిశగా అధికారులు అడుగులేస్తున్నారు.
land

బురిడిగాళ్లకు చెక్ పెట్టేందుకే
జిల్లాలో అనేక మంది అక్రమార్కులు బోగస్ డాక్యుమెంట్లతో బురిడీకొట్టిస్తున్నారు. మాఫియాగా ఏర్పడి స్థలాలను అప్పనంగా కొట్టేస్తున్నారు. ఇటీవల వెలుగుచూసిన భోజగుట్ట స్థలం వివాదంలోనూ బోగస్ డాక్యుమెంట్ల్ల తతంగమే బయటపడింది. మరికొన్ని మండలాల్లోనూ ఇలాంటివే బయటపడ్డాయి. వీరందరిపైనా కేసులు నమోదు చేశారు. పైగా ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరగడానికి కారణమిదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటువంటి క్రమంలో అక్రమార్కులకు చెక్‌పెట్టాలని భావించిన జిల్లా యంత్రాంగం ఆయా కేసులపై ప్రత్యేక దృష్టిపెడుతోంది. కేసుల వారీగా లోతుగా అధ్యయనం చేసి రికార్డులను పరిశీలించి ప్రభుత్వ స్థలాలను కాపాడబోతోంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడుకుని ప్రజాప్రయోజనాల కోసం వాటిని వినియోగించాలన్న ఆలోచనతో అధికారులు అడుగులేస్తున్నారు.

364
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...