రవాణాశాఖలో అంతా రొటీన్..!


Mon,June 19, 2017 04:22 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రవాణాశాఖలో అంతా రోటీనే. తనిఖీలు, కేసులు, సీజ్‌లు ఎప్పుడూ పునరావృతమే. ప్రజలు, ప్రయాణికులు నవ్వుతున్నా ఉల్లంఘనలకు శాశ్వత పరిష్కారం కనిపెట్టడంలో రవాణాశాఖ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. రవాణాశాఖ ఉన్నతాధికారుల బాధ్యత రాహిత్యమో, ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యమో తెలియదు కానీ నిత్యం స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి ఎన్ని కేసులు రాసినా ప్రైవేటు బస్సుల తీరు మారదు. వేలకు వేల రూపాయల అపరాధ రుసుములు చెల్లిస్తూ కూడా బస్సులను తిప్పుతున్నారు. మళ్లీ మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. పాలెం, షిర్డీ వంటి ఘటనలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారనడానికి ఉదాహారణలైనప్పటికీ చేసిన తప్పునే పదేపదే చేస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసులు రాస్తున్నా, సీజ్ చేస్తున్నా ఉల్లంఘలనకు పాల్పడుతున్నారంటే దీని వెనుక మర్మంపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ పర్మిట్ల వ్యవహారం ట్రావెల్స్ చేస్తున్న మోసం, ప్రభుత్వానికి చేస్తున్న నష్టం బహిర్గతపరిచింది. తెలుగు రాష్ర్టాలకు పన్ను ఎగవేసి ఇతర రాష్ర్టాల నుంచి పర్మిట్లు పొందిన వ్యవహారంపై ప్రజల నుంచి విమర్శలు వచ్చేలా చేశాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే సీరియస్‌గా తీసుకోవడంతోపాటు బస్సులను సీజ్ చేస్తుండటంతో ట్రావెల్స్ యజమానుల్లో కలవరం మొదలైంది. ఎప్పటినుంచో ప్రైవేటు బస్సులు ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రభుత్వానికి ఆర్టీసీకి నష్టం తెస్తున్నాయని నెత్తినోరు కొట్టుకుంటున్నా రవాణాశాఖ అధికారులు వీటి ఆగడాలకు కళ్లెం వేయడం లేదు. వాస్తవానికి రవాణా అధికారుల సహకారంతోనే ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. కేవలం టార్గెట్లు నింపుకోవడానికి మాత్రమే కేసులు రాస్తున్నట్లు, దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ పేరును తగిలిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

స్టేజీ క్యారియర్లుగా...
మోటారు వాహనాల చట్టం ప్రకారం స్టేజీ క్యారియర్లుగా నోటిఫైడ్ రూట్లలో తిరిగే అధికారం ఒక్క ఆర్టీసీకీ మాత్రమే ఉంది. ప్రైవేటు బస్సులకు లేదు. ఐనా తిరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనైతే ఏకంగా ట్రాఫిక్ ఇబ్బందులను సృష్టిస్తూ ప్రధాన కూడళ్లలో ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్నాయి. కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ పొందిన ప్రతి బస్సు స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరి లాస్ట్ పాయింట్‌లోనే ప్రయాణికులను దించాలి. మధ్యలో ఎక్కడా ప్యాసింజర్లను ఎక్కించుకోకూడదు. అదనపు ప్రయాణికులు ఉండకూడదు. ఇద్దరు అనుభవజులైన డ్రైవర్లు తప్పనిసరి. ప్రయాణికుల జాబితా పక్కాగా ఉండాలి. నిషేధిత వస్తువులు రవాణా చేయకూడదు. ఇటువంటి నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఇందులో దాదాపు అన్నింటిని చాలా ట్రావెల్స్ ఉల్లంఘిస్తున్నాయి. ప్రయాణికులను అధికంగా ఎక్కించుకోవడమే కాకుండా ఇద్దరు డ్రైవర్లను మెయింటేయిన్ చేయడం లేదు. రవాణాశాఖ అధికారులు రొటీన్‌లా కేసులు బుక్ చేయడం, సీజ్ చేయడం కాకుండా చిత్తశుద్ధితో నియంత్రణ చేపడితే ప్రమాదాలు, ప్రాణాలు పోవడాలు తగ్గుతాయి.

283
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...