సిటీ పోలీసులు..దేశానికే ఆదర్శం


Sat,May 20, 2017 12:25 AM

-బాధితులకు మేమున్నామనే భరోసానిస్తున్నారు
-టెక్నాలజీలో మనమే నెంబర్ 1 సిబ్బంది పనితీరు భేష్
-హైదరాబాద్ పోలీసులపై సీఎం ప్రశంసలు జల్లు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి ఆ మధ్య ఒక రోజు బహుదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఆయన అక్కడి నుంచి నేరుగా నా దగ్గరకు వచ్చి అన్నా.. సిటీ పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ చాలా చాలా బాగుందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇటీవల ఒక సమావేశం జరిగింది. దానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా హాజరయ్యారు. సికింద్రాబాద్‌లోని గుజరాత్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు నాలుగైదు వందల మంది సమావేశమయ్యారు.. టీఎస్‌ఐపాస్, పోలీసుల గురించి మాట్లాడు కున్నారు. వాళ్లేం మాట్లాడుకున్నారంటే.. హైదరాబాద్ సిటీలో మామూళ్లు అడగడం లేదు.. సీపీ, డీసీపీ, ఏసీపీ ఆఫీసులకు సునాయసంగా వెళ్లగల్గుతున్నారు. పోలీస్‌స్టేషన్‌ల్లో గౌరవంగా టీ, కాఫీ ఇచ్చి పోలీసు అధికారులు మాట్లాడుతున్నారంటూ చర్చించారు. ఇంతకంటే మనకు ఇంకా ఏం కావాలి? అద్భుతమైన లా అండ్ అర్డర్ ఉంది. పొలిటికల్ హరాస్‌మెంట్ లేదు. ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పదలచుకున్నా. షీ టీమ్స్ డిజైన్ చేసి స్వాతీలక్రాకు బాధ్యతలు అప్పగించాం. ఎలక్షన్లలో పోలీసుల పేరు చెప్పి ఏ రాజకీయపార్టీ కూడా ఓట్లు అడుగదు. పోలీసుల పేరు చెబితే ఓట్లు మైనస్ అవుతాయని భయం. కానీ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోలీసులు మా ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నారని షీ టీమ్స్ బొమ్మలు పెట్టి ఓట్లడిగారు. సిటీలో పోలీసుల పేరు చెప్పే 99 కార్పొరేటర్ స్థానాలు గెలిచే స్థ్ధాయికి వెళ్లాం...

-తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ పోలీసులపై సీఎం కురిపించిన ప్రశంసలివి
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో హైదరాబాద్ పోలీసులలో వచ్చిన మార్పు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, నగర పోలీసుల పనితీరుపై ఇతర రాష్ర్టాల వ్యాపారులు చర్చించుకుంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. శుక్రవారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం సిటీ పోలీసుల పనితీరును ప్రశంసించారు. ప్రభుత్వ ఆశయాల అనుగుణంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి సిబ్బందిలో మార్పు తెచ్చి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించి విశ్వాసాన్ని చూరగొన్నారని కితాబిచ్చారు.

ఇంకా ఏమన్నారంటే..


ఏ రాజకీయ పార్టీ కూడా పోలీసుల పనితీరును ఎన్నికల్లో చెప్పుకోదు. పోలీసుల పేరు చెబితే ఓట్లు పడవు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతిభద్రతలపై దృష్టి పెట్టింది. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి షీటీమ్స్ ఏర్పాటు చేసింది. వారు చేసిన పనులను మా ఘనతగా మేం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడంతో మాకు ఓట్ల వర్షం కురిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి, అప్పటి సైబరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్, షీటీమ్స్ ఇన్‌చార్జి స్వాతీ లక్రా పోలీసింగ్‌లో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలకు చాలా మేలు చేకూర్చాయి.

రాష్ర్టానికి ఆదర్శంగా హైదరాబాద్ పోలీసింగ్..


హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు రాష్ట్ర పోలీసులందరికీ ఆదర్శంగా నిలిచారు. మట్కా, గుట్కా, పేకాట, నకిలీలు, కల్తీలపై ఉక్కుపాదం మోపుతూ మహిళల భద్రతకు మేమున్నామని పూర్తి భరోసానిస్తున్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు బాగున్నప్పుడే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం ఏర్పాటు కాగానే పోలీసు కమిషనర్‌కు దిశానిర్దేశం చేశాం. ఇందుకనుగుణంగా ఆయన పలు సంస్కరణలు చేపట్టి ఉత్తమ ఫలితాలను రాబట్టారు. టెక్నాలజీ వాడకంలో హైదరాబాద్ పోలీసులు దేశంలోనే ముందున్నారు. వ్యవస్థీకృత నేరాలను పూర్తిగా కట్టడి చేశారు. ఉమ్మడి ప్రభుత్వాల సమయంలో.. చైన్‌స్నాచర్ల బెడదతో మహిళలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడేవారు.అలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ర్టాల చైన్ స్నాచింగ్ ముఠాలతో పాటు, స్థ్ధానికంగా ఉండే స్నాచింగ్ ముఠాలను పోలీసులు అణిచివేశారు.

నగరానికి వచ్చి వివిధ నేరాలు చేసే ముఠాల ఆటకట్టించారు. హైదరాబాద్ పోలీసులంటేనే ఇతర రాష్ర్టాల నేరగాళ్లకు వణుకు పుట్టే విధంగా కట్టడి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీల సహకారంతో భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీతో ప్రజలకు మొబైల్ అప్లికేషన్లు, సోషల్‌మీడియా ద్వారా 24/7 అందుబాటులో ఉంచారు. సిబ్బందిలో బాధ్యతను పెంచి వారి పనితీరును మెరుగుపెట్టారు. వారెలా పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. పనిచేసే వారికి గుర్తింపు ఇస్తుండడంతో క్షేత్ర స్థ్ధాయిలోని సిబ్బంది జవాబుదారితనంతో పనిచేస్తున్నారు. సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. బస్‌స్టాపుల్లో, వీధుల్లో, ఆఫీసుల్లో అమ్మాయిలను వేధించే పోకిరీలకు బుద్ధి చెప్పి మహిళలకు షీటీమ్స్ ధైర్యం ఇచ్చి వారి విశ్వాసాన్ని కలిగించారు. హైదరాబాద్‌లో షీటీమ్స్‌లో అద్భుత ఫలితాలు సాధించిన తర్వాత అదే స్ఫూర్తితో రాష్ట్రమంతటా దీన్ని అమలు చేయనున్నాం. సమాజంలోని ప్రతి మహిళను ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగానే భావించేలా పట్టుబడ్డ వారికి షీ టీమ్స్ కౌన్సిలింగ్ ఇస్తూ వారి మైండ్‌సెట్‌ను మారుస్తున్నారు.

పారదర్శకమైన సేవలు..


ఇతర రాష్ర్టాల వ్యాపారుల ప్రస్తావన హైదరాబాద్ పోలీసులు అందిస్తున్న పారదర్శకమైన సేవలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యాయి. అవినీతికి తావు లేకుండా పోలీసుల అధికారులు సేవలు అందిస్తున్నారు. నగర ప్రజలతో పాటు ఇతర రాష్ర్టాల వ్యాపారులు కూడా సిటీ పోలీసులను కొనియాడుతున్నారు. ఈ విషయాన్ని కూడా సీఎం సభలో ప్రస్తావించారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్‌గుప్తా సికింద్రాబాద్‌లో జరిగిన గుజరాతీలకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్న సమయంలో అక్కడ వ్యాపారులు సిటీ పోలీసుల గురించి ప్రస్తావించిన విషయాలను సీఎం ప్రస్తావించారు. హైదరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే మర్యాద పూర్వకమైన పలుకరింపు ఉందని, సీఐ, ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులను కలవాలంటే గతంలో మాదిరిగా ఎదురు చూడాల్సిన పనిలేకుండా, అధికారులు వెంటనే బాధితులను కలిసి సమస్యలను వింటున్నారని మాట్లాడుకున్నారు. నెలవారీగా ఎవరికి మాముళ్లు ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరూ కూడా మాముళ్లు అడగడం లేదంటూ వారు చర్చించుకున్న విషయాన్ని దామోదర్‌గుప్తా తన దృష్టికి తెచ్చారంటూ సీఎం హైదరాబాద్ పోలీసుల పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు.

సైబరాబాద్ పోలీసుల గ్రూప్ డిస్కషన్


మాదాపూర్ హెచ్‌ఐసీసీలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ముఖాముఖి కార్యక్రమంలో పోలీసు అధికారుల మధ్య గ్రూపు డిస్కషన్‌లు జరిగాయి. ఈ సమావేశంలో సీఎం పోలీసు అధికారులను వారివారి సమస్యలు, పోలీసు శాఖను మరింతగా పటిష్టం చేసేందుకు వారి సూచనలను తెలియజేయాలని కోరారు. దీనికి ఓ పది గ్రూపులుగా ఏర్పడాలని సూచించారు. ఎక్కడ తమ అభిప్రాయం తైప్పెతే అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుందనే అపోహను తొలగిస్తూ కేవలం పేరు, ఊరు లేకుండా మీ అభిప్రాయాలను రాసి సూచన పట్టికలో వేస్తే చాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తన సిబ్బందితో ఇలా గ్రూప్ డిస్కషన్ చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. ఇలా సమావేశానికి వచ్చిన అధికారులు తమ సిబ్బంది నుంచి సూచనలను తీసుకున్నారు.

407
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...