నగరంలో వంద కేంద్రాలు

Sat,May 20, 2017 12:18 AM

-రైతు, వినియోగదారులకు మేలు చేసేందుకే మన కూరగాయల పథకం
-73 వేల మంది రైతుల నుంచి కూరగాయల సేకరణ
-ఔట్‌లెట్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు

ఖైరతాబాద్ : రైతులకు, వినియోగదారులకు మేలు చేసేందుకే మనకూరగాయల పథకాన్ని ప్రవేవపెట్టామని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎల్లో అండ్ గ్రీన్ ఆగ్రో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన మనకూరగాయలు పథకం ఔట్‌లెట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరగాయలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచి గిట్టుబాటు ధరలకు కూరగాయలు కొనుగోలు చేసి సరసమైన ధరకు వినియోగదారులకు విక్రయిస్తామన్నారు.

కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయని, అలాంటి క్రమంలో ధరల్లో స్థిరత్వం తీసుకురావటానికి మనకూరగాయల పథకం ప్రజలకు అతి తక్కువ ధరల్లో కూరగాయలను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 73వేల మంది రైతుల వద్ద నుంచి రూ. 14. 50కోట్ల వ్యయంతో కూరగాయలను కొనుగోలు చేస్తున్నామని, ము ఖ్యంగా మార్కెటింగ్ శాఖతో పాటు ప్రభుత్వం స్వయంగా ఆర్థికంగా సహకారం అందిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో వంద సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది తమ ముందున్న లక్ష్యమని, జూన్ 2 నాటికి మరో 10 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన విజయా డైయిరీ పాల ఉత్పత్తులను కూడా మన కూరగాయల సెంటర్‌లో లభిస్తాయన్నారు. రసాయనాల ద్వారా క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు వస్తున్న క్రమంలో ప్రజలు సేంద్రీయ ఉత్పత్తులపై ఆసక్తి కనబరుస్తున్నారని, ప్రభుత్వం తమ వంతుగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించటంతో పాటు ఆ పద్దతిలో పండించిన ఉత్పత్తులను ఇక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. నగరానికి 50 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న రైతులకు మన కూరగాయల పథకం ద్వారా విత్తనాలను, సాంకేతికపరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి, జీఎం పద్మా హర్షా, ఎల్లో అండ్ గ్రీన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

319
Tags

More News

మరిన్ని వార్తలు...