నగరంపై.. చెరగని సంతకం

Tue,May 2, 2017 03:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కొత్వాల్.. నిజాం కాలంలో అత్యంత ప్రాధాన్యత గల పదవి. అలాంటి కీలక పదవిలో సుదీర్ఘకాలం కొనసాగిన వెంకటరామారెడ్డి తెలంగాణ వైతాళికుల్లో ప్రముఖులు. బహుముఖ ప్రజాశాలి అయిన వెంకటరామారెడ్డి నగర శాంతి భద్రతల పరిరక్షణలోనే కాదు.. మత సామరస్యం, విద్యావ్యాప్తి వంటి అనేక విషయాల్లో తనదైన ముద్రవేశారు. అందరి మన్ననలూ పొందారు. తెలంగాణ నేల ఎప్పటికీ మర్చిపోలేని సేవలందించారు. రెడ్డి హాస్టల్‌ని స్థాపించి వేలాది మంది విద్యార్థులను ప్రోత్సహించారు.

పాలమూరు నుంచి పట్నం దాకా...
1869వ సంవత్సరం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వెంకటరామారెడ్డి వనపర్తి పాఠశాలలో ఉరూ, పార్శీ భాషలను అభ్యసించారు. చిన్నతనంలోనే తల్లిద్రండులను కోల్పోవడంతో రాయచూరులోని మేనమామ వద్దకు చేరారు. అక్కడే బడిలో పార్శీ, ఉర్దూతో పాటు కన్నడ, మరాఠీ భాషలు నేర్చుకున్నారు. వెంకట రామా రెడ్డి మేనమామ విలియం వహాబ్ రెడ్డి రాయచూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు. వెంకటరామారెడ్డి తన 17వ ఏటా ఠాణాకు అమీను(సబ్ ఇన్‌స్పెక్టర్)గా నియమితులయ్యారు. నిజాయితీ, విధినిర్వహణలో చాకచక్యం కారణంగా అనతికాలంలో పదోన్నతి అభించింది. అలా నిజామాబాద్, బీదర్, ఎలగదల్, వరంగల్, మెదక్ జిల్లాలో పనిచేశారు. తరువాత హైదరాబాద్ సహాయ కొత్వాల్‌గా నియమించబడ్డారు. 1920లో నగర పోలీస్ కమిషనర్ (కొత్వాల్)గా నియమితులయ్యారు. అసఫ్‌జాహీల పాలనలో కొత్వాల్ పదవి పొందిన మొట్టమొదటి హిందూ వెంకటరామారెడ్డి.

పాలనా దక్షత
వేర్వేరు హోదాల్లో పని చేసిన వెంకట రామారెడ్డి తన పాలనా దక్షతతో నిజాం మన్ననలు పొందారు. నగరంలో మత సామరస్యాన్ని పెంపొందించడంతో పాటు, బ్రిటీష్ అధికారులు నగరానికి వచ్చినప్పడు వారికి తగు భద్రతతో పాటు, మర్చిపోలేని ఆతిథ్యాన్ని అందించారు. 1921లో నిజాం రాజు వెంకటరామారెడ్డిని రాజ బహద్దూర్ బిరుదుతో సత్కరించారు. 1931లో బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ బిరుదుతో సన్మానించింది.1933లో ఆయన పదవీ విరమణ అనంతరం సర్ఫేఖాస్‌కు ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు.

సంఘ సేవ
పాలనా వ్యవహారాల్లోనే కాదు.. సమాజ సేవలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అస్పృశ్యత దురాచారాన్ని వ్యతిరేకించారు. అనాథ బాలలకు ఆశ్రయం కల్పించారు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం, వేమనాంధ్ర భాషా నిలయం, బాల సరస్వతీ గ్రంథాలయం పురోభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ జాతిని జాగృతం చేసిన గోల్కొండ పత్రిక ఆయన చొరవతోనే వెలుగుచూసింది. అంతేకాదు గ్రామీణ పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు వసతి గృహాలు ఏర్పాటు చేసి అప్పట్లోనే ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అందుకోసం.. పలువురు ప్రముఖుల నుంచి నిధులు సమకూర్చారు.

విద్యా వ్యాప్తి
నగరంలో రెడ్డి హాస్టల్ ప్రారంభించడం తెలంగాణ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. తెలంగాణలో విద్యావ్యాప్తిలోనూ, రాజకీయ చైతన్యం పెంపొందించడంలోనూ రెడ్డి హాస్టల్ కీలక పాత్ర పోషించింది. హాస్టల్‌ని ప్రారంభించేందుకు గద్వాల మహారాణి, వనపర్తి రాజా, పింగళి వెంకట్రామారెడ్డి, పింగళి కోదండరాం రెడ్డి, గోపాలు పేట, దోమకొండ రాజా, జటప్రోలు రాజా తదతరుల నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు చందాలు పోగుచేశారు. అలా తొలుత నగరంలో ఓ అద్దె ఇంట్లో రెడ్డి హాస్టల్‌ని ప్రారంభించారు. తర్వాత 1918లో ప్రస్తుతం అబిడ్స్‌లో ఉన్న రెడ్డి హాస్టల్ సొంత భవనంలోకి మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కులమతాలకు అతీతంగా వసతి కల్పించారు. తొలుత హాస్టల్‌కి వెంకటరామారెడ్డినే కార్యదర్శిగా వ్యవహరించారు. తరువాత సురవరం ప్రతాపరెడ్డి హాస్టల్‌కి కార్యదర్శిగా పదేళ్ల పాటు సేవలందించారు. ఈ క్రమంలోనే 1933లో రెడ్డి బాలికల హాస్టల్ (నారాయణ గూడ), 1954లో రెడ్డి మహిళా కళాశాల (నారాయణగూడ)లను ప్రారంభించారు.

చివరి వరకు...
విద్య అవసరాన్ని గుర్తించి, అది సమాజంలోని అందరికీ అందాలని తాపత్రయ పడ్డ మనిషి వెంకటరామారెడ్డి. ఆయన ప్రారంభించిన రెడ్డి హాస్టల్ కేవలం విద్యా వ్యాప్తికే కాదు.. రాజకీయాలకూ కేంద్రంగా నిలిచింది. నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఆంధ్ర మహాసభను ఇక్కడి నుంచే నిర్వహించారు. రావి నారాయణ రెడ్డి (తెలంగాణ సాయుధ పోరాట యోధుడు), ఆరుట్ల రామచంద్రారెడ్డి (తెలంగాణ సాయుధ పోరాట యోధుడు), ఆరుట్ల కమలా దేవి (తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు), పి.వి. నరసింహారావు (మాజీ భారత ప్రధాని), సత్యనారాయణ రెడ్డి (మాజీ గవర్నర్), మర్రి చెన్నారెడ్డి (మాజీ గవర్నర్), ప్రొఫెసర్ రాం రెడ్డి (మాజీ యూజీసీ చైర్మర్), జస్టిస్ కుమరయ్య (హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ సీతారాం రెడ్డి (మాజీ లోకాయుక్త) వంటి ఎందరో ప్రముఖులు రెడ్డి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్న వారే. అప్పట్లోనే బాలికల కళాశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్య అందించేందుకు కృషి చేశారు. ఇటు పాలనా వ్యవహారాల్లోనూ, సంఘసేవలోనూ చెరగని ముద్రవేసిన రాజా బహద్దూర్ తన 83వ ఏట నారాయణగూడలోని స్వగృహంలో 2 మే 1953లో మరణించారు. నారాయణ గూడ వైఎంసీఏ చౌరస్తాలో ఇప్పటికీ వెంకట్రామి రెడ్డి విగ్రహాన్ని చూడవచ్చు. ఆయనను స్మరించుకోవడమంటే... ఆయన ఉన్నతమైన ఆలోచనల్ని ముందుకు ముందుకు తీసుకెళ్లడమే.

408

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles